Pages

Monday, December 18, 2017

తెలుగు సభల నిర్వహణ


ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా.....
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

...

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

....


తెలుగు సభల నిర్వహణ అమోఘం. ఐతే ఇంతకుముందు ప్రభుత సాయంతో నడిచేవి ఇప్పుడు ప్రభుతే నడుపుతోంది. నా వూళ్ళో వేడుక చేస్తే నా వూరి ప్రత్యేకతలని ప్రత్యేకంగా చూపించడం ఏ మాత్రం తప్పు కాదు. అలా అని పూర్వ పెద్దలను విస్మరించకూడదు కదా! ఆ చిన్న మచ్చ ఈ చంద్రునిమీద తప్పలేదు. తెలుగులో అనువదింపబడ్డ అతిపెద్ద ఇతిహాసం కవిత్రయ భారతం
, భారతం అనే గారెలు లేని తెలుగు భోజనం రుచించదు కదా, తిరుపతి లడ్డూ ఐన అన్నమయ పదాల స్మరణ విస్మరణ.. త్యాగయ్య వారి పాయస తియ్యందనాలు లేవు. విశ్వనాథవారి బొబ్బట్లు కనపడట్లేదు.. అష్ట దిగ్గజాల ఆధరువులేవీ? ఇలాంటివే అక్కడక్కడా కించిత్ విస్మరింపబడిన దోషాలు. ఇవి ఖచ్చితంగా తెలుగు సభలే ఏ అనుమానమూ లేదు.... కానీ ఇవి మా ప్రాంత తెలుగు సభలు, ప్రపంచ సభల అనిపించుకునే స్థాయిని కలుపుకోలుతనం లోపించడం వల్లనూ.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల నా దృష్టిలో కోల్పోయాయి.. 


ఎవరైనా గతంలో ఈప్రాంత కవులు కవయిత్రులు సాహిత్యం వివక్షకి గురైంది కాబట్టి ఇలా ఇప్పుడు చేసుకుంటున్నాం అంటే ఆ సమర్థన సరికాదు. ఆ వివక్షకి సమాధానమే విభజన. విభజన ఐపోయిన చరిత్ర. ఇప్పుడు కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా భాషకి సాహిత్యానికి, కవులు కళాకారులకు మళ్ళీ కొత్తగా విభజన అంటించద్దు అని నా బోటి కొత్తతరపు వారి ఆవేదన. రాజకీయాలకతీతంగా జరగాల్సిన ప్రపంచ సభలు, ఇంత గొప్ప నిర్వహణ ప్రాంతీయ సభలైయ్యాయన్నదే ఆవేదన.

అధికారికంగా సభల నిర్వహణనెత్తుకున్న ప్రభుతను శ్లాఘిస్తున్నాను. కానీ ప్రభుత్వం రాజకీయం సమ్మిళితమై రాజ్యంచేస్తున్నవన్నది సత్యం. ప్రభుత్వంగా చేయాల్సిన ఆలోచనలను రాజకీయపు ఆలోచనలు అధిగమించాయి అన్నదీ తేటతెల్లమైంది "అది ఇరువేపులా.."


అందుకే, ఇకపై ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణకి రాజకీయాలకతీతంగా ఒక ప్రత్యేక నిర్వహణ సంస్థ ఏర్పడాలి. రాజకీయాలకతీతంగానే సభానిర్వహణలుండాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, సభానిర్వహణ ఏర్పాట్లలో తోడ్పాటువరకే ప్రభుత నియంత్రింపబడాలి. తెలుగువారు కేవలం ఆంధ్ర తెలంగాణయే కాదు.. ఒరిస్సా, తమిళ, కన్నడ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, అండమాన్ ఇత్యాది రాష్ట్రాల్లోనూ ఉన్నారు... ఇవి సాహిత్య కారులు, కవులు, కళాకారులు నిర్వహించుకునే , నిర్వహించుకోవాల్సిన సభలు.


నా వ్యాసం వ్యక్తిగత, రాజకీయాతీతం. ఇంతకుముందు వరకూ జరిగిన రీతిలోనే ఇప్పుడూ జరిగాయి. ఎప్పుడూ ఒక ప్రాంతానికే పెద్ద పీట వేయబడ్డది.. నేటితో కలిపి. రేపైనా మారాలి! తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు పట్టాభిషేకం జరగాలి. ప్రాంతాలకికాదు.


తెలుగు వేర్లు ఐతే, తెలుగు జాతి కాండం, ఈ రెండూ కాపాడబడితేనే.. యాస- సాహిత్యం - కళలు - ప్రాంతాలు అనే కొమ్మలు - రెమ్మలు - ఆకులు + పువ్వులు - కాయలు - పళ్ళు బాగుంటాయి...


వీటిలో రాజకీయం, సినిమా కలరింగు రెండూ దూరకుండా భవిష్యత్తు సభలు "ప్రపంచ" సభలుగా నిర్వహించబడాలని కోరుకుంటూ... 

సినారె వారి గీతం పాడుకుంటూ..

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

~~~~~~~~~~

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. 

అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!

-
శంకరకింకర

No comments:

Post a Comment