Pages

Thursday, January 22, 2015

అమ్మవారికి సూర్యడే హారతి.. గోవాలో అద్భుతమైన ఆలయాలు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన గోవాపట్టణం పేరు చెప్పగానే విశృంఖలమైన ఆటవిడుపు స్థలం, అవైదిక అధార్మిక సనాతనధర్మ వ్యతిరిక్త మతస్థులకు ఆలవాలంగా ముద్రపడ్డ ప్రదేశంగా గుర్తొస్తుంది. కలిప్రదేశాలైన మద్యం, జూదం, ఇతర కార్యకలాపాలకి పెట్టిందిపేరుగా ముద్రపడ్డది. ఇది కేవలం పాశ్చాత్యులు ఆ ప్రాంతంలోకి వలస వచ్చి వారి మతసంబంధ ప్రార్థనామందిరాలు కట్టుకొని తమ మత ప్రచారం చేసుకోవడం వల్లనూ, వారి వారి దేశాలలో ఉన్న విశృంఖల అలవాట్లవల్లనూ సముద్ర తీరంలో వ్యాహ్యాళికి వచ్చి డిసెంబరు నెలలో వారు జరుపుకునే పెద్ద ఉత్సవం వల్లనూ వచ్చి పడిన ముద్ర. కిరస్థానీయుల దుష్కృత్యాల వల్ల కొంత మేర సనాతన ధర్మానుయాయులు ఇబ్బంది పడ్డా ఇప్పటికీ ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు, చుట్టుపక్కల పల్లెల్లో మన నాగరికత పరిఢమిల్లుతూనే ఉంది. నిజం, చూస్తే కానీ నమ్మలేకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే.. శ్రీ గౌడపాదుల వారి మఠం ఇక్కడే ఉంది.

కొంకణ పర్వత సాణువుల్లో మాండవి నదీ సంగమ తీరంలో ఉన్న  సముద్ర తీరం అంతా ప్రకృతి రూపంలో పార్వతి మాత పరవశమే. సుందరమైన లోయలు సహజ వనాలు, చిన్న చిన్న  కొండలమీదుగా వేసిన రోడ్ల నుండి వెళ్తూ చుట్టూఉన్న కొండలను పెద్ద పెద్ద చెట్లను చూసి ఆనందించవలసినదే. ఎంతో దైవీ వృక్ష సంపద, రావి, మర్రి, మద్ది, కొబ్బరి, పనస, మామిడి, బొగడ, వెలగ, మారేడు, పోక, సంపెంగ, మందార ఎన్నో ఎన్నో దేవతా వృక్షాలు. మల్లి, లవంగ, మిరియాలతీగలు, సుగంధ ద్రవ్యాల చెట్లు, పొదలు... ఎన్నో ఎన్నెన్నో...

 ప్రాంతంలో అమ్మవారి ఆరాధన ఎక్కువ అమ్మవారిని సంతేరి అని పిలుస్తారు. ఇక్కడ పురోహిత వృత్తిలో ఉండేది కొంకణ సారస్వతులు. దక్షిణ కర్ణాటక పద్ధతులే కనిపిస్తాయి ఎక్కువగా. సరే వాడుక భాషలో సంతేరి  అన్నా అమ్మవారి పేరు శాంత దుర్గ శాంత దుర్గ సంస్థానములు అని గోవాలో 5-6 చోట్ల ఆలయాలుంటాయి. దక్షిణగోవాలో మంగేశ్వర్, శాంత దుర్గ, గణపతిమహాలస, బాలాజీ ఆలయాలు ముఖ్యంగా దర్శనీయాలు. అత్యధికంగా భక్తులు విచ్చేస్తుంటారు కూడాను. అన్నీ పెద్ద పెద్ద ఆలయాలు, చాలా శుభ్రంగా అప్పుడే కడిగిరా అన్నట్లుంటాయి అన్నీ.

మంగేష్వర్, మంగేషి  మంగిరీశ్వర్ అనే పేర్లతో పిలువబడే ఆలయం శివసంబంధమైనది. అమ్మవారు  పర్వత సానువుల్లో తపస్సు చేస్తుండగా శివుడు పరీక్షించడానికి ఒక పులిని పంపాడట. మామూలు పులి ఐతే అమ్మవారికి లొంగిపోయేది. కానీ, పరీక్షించడానికి శివుడే ఆ రూపంలో రావడంతో ఆమె భక్తి సడలించక సర్వశరణాగతి చేసి త్రాహి మాం గిరీశ్వరా అని వేడుకొందట. శివుడు పులి వేషం వదిలి ప్రసన్నుడై ప్రత్యక్షమైయాడని స్థల ఐతిహ్యం. అప్పట్నుంచి  ప్రదేశంలోకి వచ్చి అందరు భక్తులూ పులికన్నా ప్రమాదమైన  సంసారం నుంచి కాపాడమని త్రా హి మాం గిరీశ్వరా అని వేడుకోవడం మొదలెట్టారు. కాల క్రమంలో మాం గిరీశ్వర్, , మాంగిరీషి గా మారి ఇప్పుడు మంగేషి గా పిలువబడుతున్నది. మంగేష్కర్ ఇంటి పేరు కలవారు  గ్రామానికి చెందినవారే అంటారు. పుష్కరిణి కూడా గొప్పగా ఉన్నది..

మహాలస : ఇక్కడ మహావిష్ణువు ఏకబేర మూర్తిగా ఉంటారు లక్ష్మీనారాయణస్వామిగా పక్కనే సంతేరి అమ్మవారు ఉంటారు (పార్వతి / శాంత దుర్గ). నారాయణ నారాయణి కలిసి ఉన్న ఆలయం బహుశః ఇదేనేమో... నారాయణుని స్త్రీరూపమే పార్వతి అని తెలియజెప్పేదే  ఆలయం.  ఇద్దరి కలయికే  ఆలయం.  ఒక నారాయణుడిగానో లేక అమ్మవారిగానో మాత్రమే విచారించినా లోక  నిర్వహణ  వారిదే కదా?  అలాంటిది ఇద్దరూ వెలిసిన ప్రదేశం అంటే? నిజంగా అత్యద్భుతమైన గొప్ప క్షేత్రం. ఆలయం వెనకాల యాగ శాల, కళ్యాణ మంటపం, శ్రీ విద్యా సంబంధమైన కొందరు దేవతలు, భైరవుడు, చతుష్షష్టియోగిని పీఠము, పుష్కరిణి చాలా గొప్పగా ఉన్నాయి. సారస్వతులు అక్కడ అమ్మవారి ఉపాసన చేసుకుంటుంటే చూడగలిగాం..

గణపతి ఆలయం : పై ఆలయాలకన్నా చిన్నది కానీ చుట్టూ ఉద్యానవనంతో అలరారుతోంది. బయటకి రోడ్డు మీదకే పనస చెట్లున్నాయి. మేము వెళ్ళే సరికి స్వామివారికి నివేదన సమయం. స్వామి వారికి నివేదన ఇచ్చి  ప్రసాదం మాకు ఇచ్చారు. ఇది స్వయంభూ వినాయకాలయం అని ప్రసిద్ధి.

శాంత దుర్గ - శాంత చండి - సంతేరి. ఆలయం మంగేషి అంత పెద్దది. ఆలయ ప్రాకారం దాటి లోపలకి వెళ్ళగానే మట్టి కనపడదు మట్టి ఉండే స్థలం అంతా గోమయంతో అలికి ఉంది. అద్భుతంగా తోచింది. మేం వెళ్ళినప్పుడు పక్కనే ఏదో యాగం చేస్తున్నట్టున్నారు. సరే అమ్మవారు ఒకసారి హరిహరులమధ్య ఎందుకో వాదు వస్తే మధ్యవర్తిగా ఉండి ఇద్దరినీ శాంతింపజేసిందని ఐతిహ్యం. ఆమె దుర్గయే ఐనా అతి శాంత మూర్తి. పక్కన మూడు మహా సర్పాలుంటాయి అవి హరిహరబ్రహ్మలకు వారి మధ్య వైరానికి చిహ్నములట.. అమ్మవారి దర్శనం కోసం లోపలికి సరిగ్గా మధ్యాహ్నం 1 ప్రాంత సమయంలో వెళ్ళగలిగాం పైగా శుక్రవారం... కాదు అమ్మ రప్పించుకుంది. అది అమ్మవారికి మధ్యాహ్నపూజలో నివేదన సేవ చేసే సమయం. అద్భుతంగా శృంగేరి శారదలా వెలిగిపోతోంది అమ్మవారు బంగారు కాంతులతో.. ఎక్కడో దూరంగా ఉన్నాం కనపడుతుందా లేదా అని. ఇంతలో అందరూ లేవండి హారతి సమయం అని కొంకణ్ లో చెప్పారు సరే అర్థం చేసుకొని లేచి నిలబడ్డాం అప్పటికే ముందు వరుసలలో అమ్మవారి మంటపానికి ఇరువైపులా వందేసి మంది ఉన్నారు. హారతి కదా అని కొద్దివా వంగి చూస్తున్నాం ఇంకా హారతి మొదలవ్వలేదు. అక్కడహారతిచ్చే పద్ధతి చూసి ఆశ్చర్యం వేసింది, ఒక అలౌకిక అనుభూతి కలిగింది.  ఎంత ప్రణాళిక నడపకపోతే ఎక్కడ హైదరాబాదు ఎక్కడ గోవా అందులో ఎక్కడో ఉన్న శాంతదుర్గ ఆలయం... సరిగ్గా హారతి సమయానికి అక్కడికి చేర్చింది.. తలచుకుంటేనే  దృశ్యాలు కళ్ళలో మెదులుతున్నాయి... అమ్మవారికి మామూలు లౌకిక హారతి మొదట ఇవ్వరు ఆలయం బయట ఎక్కడో దీప స్తంభమంటపాలదగ్గర ఒక అద్దం అమర్చి సూర్య కిరణాలు పరావర్తనం చేయించి  కిరణాలు అమ్మవారి మీద పడేలా చేసి ముందు హారతి సూర్య కిరణాలతో ఇస్తారు.  హారతి వెలుగులలోనే ఇక మిగిలిన అన్ని నక్షత్ర, కుంభ, సప్త, పంచ, ఏక, కర్పూర అన్ని హారతులూ ఇస్తారు. ఇదంతా దాదాపు 15నిమిషాలకు పైగా సాగుతుంది.  సూర్య కాంతి వెలుగులోఅమ్మవారు ఎవరికి వారికి అతి దగ్గరగా ఉన్నట్లు దర్శనమిస్తుంది. అసలు చూడవలసిందే చెప్పనలవి కాదు.


ఇంకా ఎన్నో ఆలయాలున్నాయి సమయాభావం వల్ల వెళ్ళలేకపోయాం... ఏమైనా అమ్మ అక్కడ శాంత దుర్గ గా వెలిసింది కాబట్టి ఎంత అవైదిక అధార్మిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నా,  నిర్వహించే వాళ్ళూ అమ్మకి బిడ్డలే కదా అందుకే శాంతంగా చూస్తూ ఉపేక్షిస్తున్నదని అవగతమైంది...



జై సంతేరీ ప్రసన్న్, జై మంగేషి ప్రసన్న్, జై మహాలస ప్రసన్న్, జై గణేశ్...


No comments:

Post a Comment