Pages

Tuesday, December 9, 2014

కలిదోషాలు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కాల విభాగంలో ప్రస్తుత కాలానికి అధిపతి కలిపురుషుడు. అతని లక్షణములు అతను పరిపాలించే విధంగానే ప్రజలకి ఫలితాలుంటాయి. అందుకే త్యాగశీలురైన శౌనకాది మహామునులు ఈ కలిదోషాలు ఎలా ఉంటాయో కొద్దిగా చెప్తూ దాని విముక్తి కలిగే మార్గం అంటే ఆ కలి పాలనలో కలిగే దోషాలు మానవులనంటకుండా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పమని శుక్రబ్రహ్మని కోరారు.

అలసులు, మందబుద్ధి యుతులల్పతరాయువులుగ్రరోగ సం
కలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యవి సేయజాలరీ 
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై 
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర! జెప్పవే!

కలియుగంలో జనులు ’మంద భాగ్యులు’ ’అల్పతర ఆయువులు’ అని ఏనాడో తెలియజేయబడింది. ఋషులచే రాబోయే కాలంలో వచ్చే రోగమూ తగు ఔషధమూ తెలియజేయబడ్డాయి. కానీ ఎం లాభం వారు చెప్పినట్లుగానే కలియుగంలో జనం అలసులు-సోమరులు, మందబుద్ధి కలవారు, సుకర్మములు చేయనివారు.. కాబట్టి ఫలితములు కూడా అలానే ఉంటాయి. ఉంటున్నాయి. ఔషధం ఒక్కటే మార్గం స్వధర్మాచరణము, విహిత కర్మాచరణము, ఉపాసన. పోయిన జన్మలో ఏ పాపఫలితాలని కూడ బెట్టుకున్నామో తెలీదు ఈ జన్మలోనూ తెలిసీ తెలీక ఎంతెంత పాపపుణ్యాలను మూటకట్టి నెత్తినెత్తుకుంటున్నామో తెలీదు. కనీసం భగవంతుని దగ్గర నిజాయితీగా ఉండడం నేర్చుకుంటే సగం ఇబ్బంది పోయినట్లే. కష్టం రావడం సాధారణం దాన్ని తట్టుకు నిలబడి దైవం పాదాలు, ధర్మమార్గం ఇంకా గట్టిగా పట్టుకోవడం రావాలి. అంత కృత యుగంలోనూ హరిశ్చంద్రుని కొడుకు లోహితుడు ప్రాణాలు వదిలాడు ఆయన తన ధర్మం తప్పలేదు. తిరిగి బతికాడు. అలాగే త్రేతా యుగంలోనూ అరవైవేల సగరులు మడిసిపోయారు ఐనా ఇక్ష్వాకులు ధర్మం తప్పలేదు కొన్ని అటువంటి కొన్ని లక్షల సంతానం పెట్టు భగీరథాదులు, స్వయం భగవానుడే రామాదులుగా నలుగురుగా వచ్చారు ఆ వంశంలో.

మొన్న మా చుట్టాలావిడతో మన సత్సంగం తరపున భద్రాచలంలో చేసుకున్న శ్రీరామ పట్టాభిషేకం గురించి మాట్లాడుతూ దాని నిర్వహణ ఇత్యాది వివరాలు అడుగుతూంటే ఒకటికి రెండు మార్లు ఆవిడతో ’కళ్యాణం ఏ జంటకాజంట లేదా కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు, అది వ్యక్తిగతోపాసనకి జీవబ్రహ్మైక్య సిద్ధికి తార్కాణం. కానీ పట్టాభిషేకం అందునా శ్రీరామ పట్టాభిషేకం సాంఘికంగా సామూహికంగా చేసుకోవాలి అందరూ కలిసి చేసుకోవాలి. శ్రీరాముల వారు ఏ ఒక్కరికో రాజు కాదు అందరికీ ఆయనే ప్రభువు అని పట్టాభిషేకం చేయాలి అని. స్వామి పట్టాభిషేకం చూసాక / చేసాక మనకి ఆయన ప్రభువు, మనం ఆయన రాజ్యంలోని వారం. అప్పుట్లో శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా అయోధ్యావాసులనెలా పాలించాడో మననీ అలాగే పాలించమని కోరుకోవాలి. కాదు కాదు ఆయన అలాగే మనకే కష్ట నష్టాలు రాకుండా  ఆయన చూసుకుంటాడు అన్న పూనిక ఆ పట్టాభిషేకంతోనే కలగాలి / కలుగుతుంది. అని చర్చసాగింది. అలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే సంపూర్ణ శక్తి లేకున్నా కనీసం శక్తికొలదీ ద్రవ్యం సమర్పించాలి లేకపోతే కనీస కాయిక సాయమో ఏదో ఒకటి చేయాలి. శ్రీరాముడే నాకు ప్రభువు అని గుర్తెరిగి ఆయన ప్రభువుగా ఉండగా ఆయన బాధపడకుండా ఉండేలా జీవించే జీవన విధానం మెల్లగా అలవర్చుకుంటే... మనం రాములవారివారమే అప్పుడు ఏ దోషం మననంటగలదు?

-శంకరకింకర

ఇక రెండో విషయం... చాలా మంది ఈ అన్వయంలో కొంత పొరపాటు లేదా తొట్రుపాటు పడుతున్నట్లు తోస్తున్నది. కలిలో నామ స్మరణం తేలిక. అంటే అదొక్కటే చేసి వైదికమైన విహిత కర్మాచరణలు వదలమని కాదు. అటువంటి విహిత కర్మాచరణలు ఉపాసనా పద్ధతులు, యజ్ఞయాగాదులు వదలమని కాదు వేదం చెప్పిన రీతిలో ఇవి జరుగుతూనే ఉండాలి. కలిలో బ్రహ్మగారికి ఆలయం ప్రత్యేక పూజ లేదు అని పురాణోక్తి. నాలుగు ముఖాలతో వేదం చదివే బ్రహ్మాగారిని పూజించడమే వేదాధ్యయనం, వేద విహితంగా జీవించడం. దాని అసలు అన్వయమేమంటే కలి దోషం వల్ల వేద అధ్యయనము, స్వాధ్యాయము, వేదం చెప్పినదానికి వ్యతిరిక్తంగా చెప్పడం, వేదం వద్దన్నదాన్ని చేయడం సనాతన ధర్మానికి మూల స్థంభాలైన వర్ణాశ్రమ ధర్మాలని కాలరాయాలని చూడడం. ధర్మసోపానాలని పునాదులతో పెకిలించాలనుక్కోవడం. వేద తిరస్కరణమే బ్రహ్మగారిని పూజించకపోవడం. వేదం చదువుకునే అవకాశం అధికారం లేకపోతే వేద పండితులని శక్తిమేరకు సత్కరించాలి లేదా కనీసం నమస్కరిస్తే చాలు వాళ్ళకి ఏవో కానుకలివ్వాలి అని కాదు. అధికారంలేకపోయినా వేదమంత్రాలను అనుష్టించడం కూడని పని. కానీ వేదార్థం తెలుసుకొని తదనుగుణంగా జీవించాలి. అవి అందించడానికి రాముడిగా వచ్చాడు, పురాణ రూపంలో వ్యాసుడందించాడు. 

వేదాధికారం లేనివారు వారికి విధింపబడ్డ విధి నిర్వహిస్తూ భగవన్నామం చేయాలి, వేదాధికారం ఉన్నవారు విహిత కర్మాచరణం చేసి తరవాత భగవన్నామాదులు చేయాలి తప్ప భగవన్నామొక్కటే చాలు మంత్రాలు ఉపాసనలు యజ్ఞాలు అఖ్ఖర్లేదని ఏ విహిత కర్మలని చేసే అవకాశం కర్తవ్యం ఉన్నవారు వదల కూడదు.

ఏదేమైనా శ్రీరాముడే మనకు ప్రభువుగా సర్వజగద్రక్షకుడుగా ఉండగా మన కష్ట నష్టాలన్నీ ఆయనవే అన్న ధృతికలిగి ఉండడం చాలా అవసరం..


సర్వం శ్రీ రామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు

-శంకరకింకర

No comments:

Post a Comment