శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఒకానొకప్పుడు ఒక శంకరాచార్యులని ఒక నాస్తికుడైన వ్యక్తి ఇలా
ప్రశ్నించారట "మీరు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం,
దాని ఫలితం, స్వర్గం, నరకం,
మోక్షం, దేవుడు, ఆత్మ అని
ఏవేవో చెపుతారు. మాకవన్నిటిమీదా నమ్మకంలేదు అవన్నీ ఎవరో కల్పించినవి అని ఇప్పటి విజ్ఞానం
ద్వారా మాకు తెలుస్తోంది. మీరు చెప్పేవి బోధించేవి ఇవన్నీ అసలు లేవు అని మా నమ్మకం.
కాబట్టి మీ జీవితాన్ని సరి యైన విధంగా మలచుకొని, ఈ కల్పిత శాస్త్రాలు
వాటి నిబంధలలో కట్టుబడడం వగైరా ఈ ఇబ్బందులన్నీ వదిలి మీ ఇష్టం వచ్చినట్లు హాయిగా
జీవించచ్చు, మీ కళ్ళముందు కనబడుతున్నదాని గురించి మీ మేథాశక్తిని
మనుష్యజాతికి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. మీ జీవితమూ వ్యర్థం కాదు అని చెప్పారట"
దానికి ఆ శంకరులు చిరునవ్వి నవ్వి " అవును మీరు చెప్పింది
బాగుంది. మీరు చెప్పిందాంట్లో విషయాలు నాకు మంచి చెప్పాలని ప్రయత్నించి చెప్తున్నారు
భగవంతుడు మీకు మేలు చేస్తాడు.
1) ఒక వేళ మీరన్నట్లు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం ఊర్థ్వాధోలోకాలు, పాప పుణ్యాలు,
మోక్షం లేవు అనుక్కుని, వేదాది శాస్త్రాలు నిబంధనలు
అన్నీ కల్పితాలు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు జీవించమన్నారు. ఇప్పుడు నేను చేసేది నా
ఇష్టం వచ్చినట్లు జీవించడమే, నాకు వేదం అన్నా శాస్త్రమన్నా సనాతన
ధర్మమన్నా ఇష్టం అందుకు అనుగుణంగా జీవిస్తున్నాను కాబట్టి నేను సంపూర్ణ అంగీకారంతో
సంపూర్ణసంతోషంతోటే ఈ జీవితాన్ని సాగిస్తున్నాను. వేరేవిధంగా జీవించడం నాకు ఇష్టముండదు.
కాబట్టి మేమూ, మా పూర్వాచార్యులు చెప్పినట్లు నిజంగా పైన చెప్పినవి
లేకున్నా మా జీవితం మాకు నచ్చిన విధంగా సాగుతున్నది కాబట్టి ఇలా జీవించడంలో మాకే ఇబ్బందీ
లేదు.
2) ఒక వేళ అలా మీరన్నట్లు కాక మేము , మా పూర్వాచార్యులు నమ్మిన మా వేద శాస్త్రాదులే వేదాంతర్గతమైన సిద్ధాంతములు
సత్యమని, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం,
జీవుడు, ఆత్మ ఇత్యాదుల ఎరుక మీకు దేహాంతంలో తెలిసిందనుక్కోండి
అప్పుడు మీరేమి చేయగలరు, ఏదైనా చేయడానికి అప్పుడు మీకు దేహమే
ఉండదు కదా! మేము మా పూర్వాచార్యులు, వేద శాస్థ్రాదులు,
ధర్మం చెప్పినట్లు జీవించాం మాకు ఇబ్బందిలేదు మరి మీరో? ఇన్ని రోజులూ మీరబద్ధం అనుకున్నది సత్యం అను ఎరుక వచ్చాక సమయం మించిపోతుందే?
మరి మీలోని జీవుడు ఎలా ఉద్ధరణ పొందుతాడు?
మీరు చెప్పిన విషయాన్ని తీసుకుంటే రెండు పార్శ్వాల్లోనూ ఇబ్బంది
లేని వాళ్ళం మేము. మీరు నమ్మింది మీకు తప్పని తేలిననాడు ఇబ్బందుల్లో ఉండేది మీరు...!
మాకు రెండు విధాల్లోనూ ఉండేది ఆనందమే...! మా ధర్మాన్ని నమ్మి చరించే వారికి ఏ స్థితిలో
నైనా ఉండేది ఆనందమే.
కాబట్టి సనాతన ధర్మ చరితులమైన మా జీవితం గురించి మీకు బెంగవద్దు, మీ జీవితాన్ని మీరు గట్టెక్కించుకోండి. ఈ జీవితాన్ని మీ ఉద్ధరణకి
పది మంది ఉద్ధరణకి పనికి వచ్చేలా తీర్చిదిద్దుకోండి... భగవంతుడు మీకు మేలు చేస్తాడు,
మీకు శుభం కలుగుతుంది....!!!
(ఎప్పుడో పెద్దలు చెప్పిన చద్దిమూట, చెవులతో ఒడిసి పట్టుకున్నది)