Pages

Wednesday, February 26, 2014

శివరాత్రంటే లేటుగాలేచి సాయంత్రం పళ్ళు తిని రాత్రి సినిమాలు చూడడం కాదు!

శ్రీ గురుభ్యోనమః
అందరికీ నమస్కారం
శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
శివరాత్రి అంటే శివుని పుట్టినరోజు అని ఒక అపోహ ప్రచారంలో ఉన్నది, ఎప్పుడూ ఉండే శివునికి ఒక పుట్టుక అంటూ లేదు ఆయనే అందరి పుట్టుకకూ కారణం ఆయన పుట్టడం అంటూ లేదు ఆయన బ్రహ్మము. ఆయననుండి జగత్ పుడుతుంది అంతేకాని శివరాత్రి శివుని పుట్టిన రోజు కాదు.
ఐతే శివరాత్రి విశేషమేమి? ఎందుకు అత్యంత ప్రాముఖ్యమున్న నైమిత్తిక తిథి. ఎన్ని రకాల ఉపాసనలనీ సిద్ధింపజేయగల నైమిత్తిక తిథి శివరాత్రి. శివరాత్రి గురించి పురాణ వాజ్ఙ్మయాన్నిపరిశీలించి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సృష్ఠికి పూర్వం పరబ్రహ్మం తనలో తానే రమిస్తూ ఉన్నప్పుడు కలిగిన అహం స్ఫురణ ద్వారా తాను వివిధములుగా మారాలన్న కోరిక కలుగింది. పరబ్రహ్మం యొక్క అహం స్ఫురణయే శక్తి లేదా మాయ లేదా ప్రకృతి అని వివిధ నామాలు. వివిధములుగా వ్యాప్తి చెందాలన్న కోరికయే సృష్ఠికి మూల కారణమై అహం స్ఫురణతో ఉన్న పరబ్రహ్మంనుండి శ్రీ మహా విష్ణువు ఆవిర్భవించారు  ఆయన ఆవిర్భవించాక ఆయన ఒక్కరే ఉండడం వల్ల ఆయన ఎక్కడనుంచి వచ్చారు ఏమి చేయాలి అన్నదేమీ తెలియలేదు అప్పుడు ఆయనకి "తపించు" అన్న మాట వినపడింది (అదే పరబ్రహ్మము తన సృష్ఠికి ఇచ్చిన మొట్ట మొదటి ఆదేశం అదే ఇప్పటికీ శిరోధార్యం). వెంటనే శ్రీమహావిష్ణువు తపస్సు చేయసాగారు. ఆయన చేస్తున్న గొప్ప తపస్సువల్ల ఆయన శరీరంలోంచి తపోజలాలు ఉద్భవించి సమస్త సృష్ఠి జలమయం అయ్యింది. అలా తపస్సు చేస్తున్న శ్రీమహావిష్ణువు నాభిలోంచి ఒక కమలం ఉద్భవించి అందులోంచి పంచ ముఖాలతో బ్రహ్మగారు పుట్టారు.
ఆయన నేనెవరు ఎక్కడనుంచి వచ్చాను అని ఇంతకు ముందు శ్రీ మహావిష్ణువులాగానే తెలియని స్థితిలో ఉండి తాను పుట్టిన తామర పువ్వు తూడులోంచి క్రిందకు వెళ్లగా తపస్సు చేస్తున్న శ్రీ మహావిష్ణువు కనపడ్డారు ఆయనే తన పుట్టుకకు కారణమైన వారని తెలియక తాను కాక ఇంకొకరు ఉన్నారు అన్న భావన, భయం కలిగి ఆయనతో వాదానికి సిద్ధపడ్డారు. {బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మనమేవ ఆవైత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్త్సర్వమభవత్! [బృహదారణ్యకోపనిషత్] (మొట్టమొదట బ్రహ్మమే ఉండెను, ఈ చరాచర ప్రపంచమంతా పరబ్రహ్మమై ఉన్నది, కానీ అజ్ఙానం వలన తన స్వస్థితి ఎరుగడు, అహంకార రహిత జ్ఙానం వలననే తాను పరబ్రహ్మం అని తెలుసుకుంటాడు)}  ఇద్దరి మధ్య గొప్ప వాదోపవాదాలు జరిగాయి, మాయా స్వరూపమైన అజ్ఙానం వల్ల నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదన ప్రబలింది యుద్ధం వరకూ వచ్చింది.
అటువంటి సమయంలో వారి అజ్ఙానాన్ని ధ్వంసం చేసి బుద్ధి చెప్పాలనుక్కున్న పరబ్రహ్మం అకస్మాత్తుగా వారిరువురి మధ్యా ఒక గొప్ప కాంతితో అగ్నిస్థంభంగా లింగా కారంలో తనని తాను వ్యక్తపరచుకున్నారు. వీరిరువురూ వారి వాదోపవాదాలను పక్కనబెట్టి ఈ అగ్ని లింగ యొక్క ఆది అంతం కనుక్కున్నవారే గొప్పవారు అని ఒప్పందం చేసుకుని బ్రహ్మగారు హంస రూపంలో ఆదిని కనుక్కోవడానికి ఊర్ద్వ దిశలో పయనించసాగారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అధోభాగం వైపు పయనించి ఆ అగ్ని లింగం యొక్క చివర చూడడానికి వెళ్ళారు. ఇరువురూ వారి వారి దిశలవైపు కొన్ని వేల వేల సంవత్సరాలు పయనించినా దాని ఆది అంతు కనుక్కోలేకపోయారు. ఊర్ధ్వంగా పయనిస్తున్న బ్రహ్మగారికి ఎదురుగా ఒక మొగలిపువ్వు కిందకి పడడం చూశారు ఆమొగలిపువ్వుని ఆపి ఈ అగ్నిస్థంభం యొక్క ది ఎక్కడుంది అని అడిగారు అప్పుడు మొగలి పువ్వు దానిని చేరుకోవడం ఎవరి తరమూ కాదు ఎప్పుడో నేను ఆ లింగం మొదట్లోంచి పడ్డాను ఎన్ని ఏళ్ళు యుగాలైందో తెలీదు ఇంకా పడుతూనే ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మగారు విష్ణువుతో చేసుకున్న పందెం గెలవాలని ఆ మొగలిపువ్వుతొ ఒక ఒడంబడిక చేసుకుని నేను ఈ లింగం మొదలు చూసానని చెప్పమని మొగలిపువ్వుని కోరారు అదీ సరేనంది తిరిగి బ్రహ్మగారు తాను ఎక్కడ నుంచి బయలు దేరారో అక్కడికి చేరుకున్నారు. అలాగే విష్ణుమూర్తి ఆ అగ్ని లింగం యొక్క అంతు కనిపెట్టలేమని గ్రహించి తిరిగి ఆయనా ఆయన బయలుదేరిన స్థానానికే చేరుకున్నారు. బ్రహ్మగారు విష్ణువుతో తాను ఆ లింగం యొక్క ఆది చూసాననీ సాక్ష్యం మొగలి పువ్వనీ చెప్పగా మొగలు పువ్వు దానిని సమర్థించింది. వెంటనే ఆ అగ్ని లింగంలోంచి పరబ్రహ్మం సాకారుడై తప్పు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వు తన పూజలకు పనికిరాదని శాపం ఇచ్చి రాజసగుణంతో అబద్ధం చెప్పి చెప్పించిన బ్రహ్మగార్కి అర్చనాదులు ఉండవని చెప్పి సత్వగుణంతో ఉండి తన ఉపదేశాన్ని పాటించి (తపించు అని చెప్పిన మాటను పాటించి) పందెం ఓడిపోతానని తెలిసినా నిజాయితీతో వ్యవహరించినందుకు శ్రీ మహావిష్ణువుకు సృష్టి రక్షణ భారాన్నీ, తనకు సాటిగా గౌరవాన్నీ ఇచ్చి తనతోపాటుగా తనకు సమానుడుగా పూజాధికాలు ఉంటాయని వరమిచ్చారు. ఇక తరవాత బ్రహ్మగారి ప్రార్థన విని వేదాన్నిచ్చి దానికణుగుణంగా సృష్ఠి సాగించమనీ, శ్రీమహావిష్ణువుని ఆ సృష్ఠిని రక్షించమనీ ఆనతిచ్చారు.
ఆ అగ్నిలింగం ఏ అజ్ఙానాన్నైతే రూపుమాపటానికి ఉత్పన్నమైందో, ఆ సమయాన్నే కాలచక్రంలో ప్రతి యేటా ఈ మహాశివరాత్రిగా నిర్ధారించి అర్థరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో లింగోద్భవకాలంలో అభిషేకాదులు, అర్చనలూ చేస్తారు. అర్థరాత్రి శివలింగం ఉద్భవించడం అంటే చీకటి (అజ్ఙానం) దట్టంగా ఉన్న సమయంలో జ్యోతి (జ్ఙాన) స్వరూపంగా ఆవిర్భవించడమే దీని అంతరార్థం. అందుకే ఈ రోజు ఉదయంనుంచీ ఉపవాసం తోపాటు (అంటే నిర్జలోపవాసం అని కాదు, ఏపని చేస్తున్నా శివధ్యానం చేస్తూ ఉండడం ఉప= దగ్గరగా వసి= వసించడం ) శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! శివ గాధలు, పూజలు, అభిషేకాలు, ఆలయ దర్శనాలు వంటివి చేస్తూ  అర్థరాత్రి లింగోద్భవ కాలం సమయానికి అభిషేకం చేసి కర్పూరలింగాలు లేదా దీపాలు వెలిగించి అందులోకి పరమేశ్వరుని ఆవాహన చేసి ఈ క్రింది స్తోత్రాన్ని చదువుతారు. (లింగోధ ప్రార్థన అంటారు దీన్ని, ఈ శ్లోకాన్నే కార్తీక దీప నమస్కారానికీ సమన్వయం చేస్తారు..)
కీటా: పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః
భవన్తిత్వం శ్వపచాహి విప్రాః
ఇక ఈ లింగం అంటే ఏమిటి అది దేనికి గుర్తు అని పరిశీలిస్తే,
ఆకాశం లింగం ఇత్యుక్తం పృథివీ తస్య పీఠికా !
ఆలయః సర్వదేవానాం లయనాత్లింగముచ్యతే !!
లింగం అంటే ఆకాశం లింగం, ఈ భూమి పీఠం, సర్వదేవతలకూ ఆలయం. అన్నీ ఇందులోనే లయమవుతున్నాయి కాబట్టి ఇది లింగం అని ప్రమాణం. అంటే సర్వ వ్యాపకమైన విష్ణు తత్త్వమే శివతత్త్వం, పేర్లు వేరు ఉన్నది ఒక్కటే. ఆ రెండూ అభేధం. ఆ రెండూ ఏమి అంతటా ఉన్నది పరబ్రహ్మమే బేధం అన్న సమస్యే లేదు, ఉన్న సమస్యల్లా అజ్ఙానం, అది రెండా, మూడా, నాలుగా, నలభైయ్యా ఇంకా ఎన్నోనా అన్న సమస్య, అజ్ఙానం వల్ల పరబ్రహ్మం వేరు నేను వేరు అనే భావన. అజ్ఙానం పోగొట్టగలిగే ఉపాసన చేయగలిగిన రోజు ఈ శివరాత్రి ఇటువంటి ఇంకో తిథి శ్రీ కృష్ణ జన్మాష్ఠమి. ఇప్పుడున్న చలికాలంలో ఉన్న దట్టమైన చీకటి అజ్ఙానాన్ని సూచిస్తే, అప్పుడుండే మేఘావృత రాత్రిళ్ళు అజ్ఙానాన్ని సూచిస్తాయి. అరూపరూపి ఐన లింగం అర్థరాత్రే ఆవిర్భవించి జ్ఙానానిస్తే. సాకార రూపమైన విష్ణువు కూడా ఇప్పటికి ఆరు మాసాల తరవాత అర్థరాత్రి జన్మించి కృష్ణం వందే జగద్గురుంగా తన లీలల ద్వారా జ్ఙాన బోధ చేస్తారు. సాకార రూపార్చన నిరాకార రూపార్చనవైపు ఎదగడానికే.
మహా ప్రదోషం
ఈ శివరాత్రికే మహా ప్రదోషం అని పేరు. మనకి రోజూ ప్రదోషకాలం ఎలానో ఒక మాసానికి కృష్ణ పక్షంలో వచ్చే మాస శివరాత్రి ప్రదోష సమయం అలానే సంవత్సరకాలాన్ని చూసినట్లైతే మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రి మహా శివరాత్రి మహా ప్రదోష కాలం. ప్రదోషకాలంలో కేవలం శివార్చన మాత్రమే నిర్దేశించబడింది కారణం ఏమంటే ప్రదోషకాలంలో సర్వదేవతలూ శివతాండవం లో పాలు పంచుకోవడానికి వెళ్తారు. విష్ణువు మద్దెల వాయిస్తారు, సరస్వతీ దేవీ నారదాదులు వీణానాదం చేస్తూ గానం చేస్తుంటారు విఘ్నేశ్వర స్కందాది  ఇతర దేవతలు దేవాది గణాలు ఋషులు తమ తమకు ఉచితమైన వాద్య పరికరాలతో ఆ శివతాండవానికి తమ సహకారాన్ని ఇస్తూంటారు. కాబట్టే ప్రదోషకాలంలో శివపూజ నిర్దేశించబడిందిఆ సమయంలో శివార్చన శివలింగాభిషేకం చేస్తే అక్కడ ఉన్న దేవతలూ సంతసిస్తారు అంటే మనకి రోజూ ప్రదోషవేళలో ఉండే ఒక గంటా గంటన్నర సమయం ఎలానో ఒక సంవత్సర కాలంలో ఈ మహా శివరాత్రి అంతే. అందుకే నేడు షాణ్మతములవారూ శివరాత్రి వ్రతం చేస్తారు వ్రతం చేయకపోయినా ఉపవాసం ఉండి శివాలయ సందర్శనం శివగాథలను వినడం ఇత్యాదులు చేసి జాగరణం ఉంటారు. జాగరణం అంటే జాగురూకాతతో ఉండడం. జాగ్రత్తగా ఉండి అజ్ఙాన నివృత్తి చేసుకొనడానికి చేసే ప్రయత్నమే ఈ రోజు ఉపాసన.
ఐనా ఇలా చెప్తూపోతే ఎన్నిపుస్తకాలైనా సరిపోదు, మౌనంలోనే ఆయన దొరుకుతారు, ఆయన మొట్ట మొదట ఇచ్చిన ఉపదేశమైన "తపించు" అన్న ఆనయే శరణం కాబట్టి ఈ రోజు వీలైనంత తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం. పరమేశ్వరానుగ్రహాన్ని, సంపూర్ణ శివజ్ఙానాన్ని పొంది, అంత్యకాలంలో పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందుదాం.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
----------------------------
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

No comments:

Post a Comment