శ్రీ
శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర
జీవిత విశేషాలు
శ్రీ శ్యామ శాస్త్రి గారి "సంగీత కుసుమార్చన"
ద్వారా అతి శీఘ్ర కాలంలోనే "మహా వాగ్గేయకారుడనీ, సంగీత
కారుడనీ పేరు సంపాదించారు". "పెద్ద పెద్ద విమర్శకులు కూడా ఆయన
సంగీతానికి, సాహిత్యానికి దాసోహం అయ్యారు".
ఆయన స్వరజతులను వారు మనస్సు నిండా నింపుకుని ఆనందించేవారు. వారి కృతులలోని
లాలిత్యం, అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉండే
సాహిత్యం ఆకృతులు విన్నప్పుడు తన్మయత్వంతో కళ్ళు చెమర్చేవి. [ఇది
నిజం. ఇప్పటికీ వారి కృతులు ఏ సంగీతం తెలియని నాబోటికే కళ్ళు చెమరిస్తే స్వయంగా
శ్యామ శాస్త్రి గారు ఆలపించినప్పుడు ఎలా ఉంటుందో కదా....]. తన
గురువుగారు నేర్పిన గహనమైన సంగీత శాస్త్రపు లోతుల్లోని ఎన్నో రాగాలతో వీరు హేలగా
సంగీత కుసుమాలు తయారు చేసేవారు. కొన్ని కొన్ని గొప్పనైన అపూర్వ రాగాలయందు ఆయనకున్న అధికారం వేరెవరికీ
ఉండదన్నది అతిశయోక్తి కాదు. ఆయన తొలి కృతి సావేరి రాగంలో సంస్కృతంలో రచించినది.
పల్లవి
జనని
నత జన పరిపాలిని
పాహి
మాం భవాని త్రి-లోక (జనని)
అనుపల్లవి
దనుజ
వైరి నుతే సకల జన
పరితాప
పాప హారిణి జయ-శాలిని (జనని)
చరణం
1
సతత
వినుత సుత గణ పతి
సేనాని
రాజ రాజేశ్వరి
విశాలాక్ష
తరుణి అఖిల జన
పావని
(శ్రీ రాజ రాజేశ్వరి)
సతి
శుభ చరితే సదా మధుర
భాషా
విగళదమృత రస ధ్వని
సుర
నుత పద యుగ దర్శిత ఇహ మమ
గాత్రమతి-మాత్రమజని
సుజని (జనని)
చరణం
2
కువలయ
లోచన యుగళే
కల్యాణి
నీల వేణి వికచ
కోకనద
రజచ్చరణే అతి
రమణి
(ఘన నీల వేణి)
భువి
దివి రక్షణి ధృతామర గణే
భాగ్యవతి
శక్తి సంపూర్ణే
కవన
నిపుణ మతిం అయి దిశ ఇహ తవ
కాంతిముపయాతుం
గిరీశ రమణి (జనని)
చరణం
3
చరణ
నిపతదమర సముదయే
కాళి
సారస ముఖి
సు-శోభితోరు
యుగళ వర
కదలి
(నవ సారస ముఖి)
సురుచిర
మురళీ మృదంగ స్వర
సంశోభిని
రస-కృత మహీ తలే
సరసిజ
కర యుగళే కటి కలిత మణి
కాంచీ
భృతే కాంచీపుర వాసిని (జనని)
ఈ
కృతి వల్ల ఆయన సంగీతంలో ఎన్ని శిఖరాలు దాటారో విదితమౌతుందని పండితులు చెప్తారు.
శ్రీ శ్యామ శాస్త్రి గారు వంశపారంపర్యంగా వచ్చిన కామాక్షి
సేవను వదలకుండా, అమ్మవారి ఉపాసనలో నిమగ్నమై ఉండేవారు.
వారు శ్రీవిద్యా సాంప్రదాయంలో మంచి నిష్ణాతులు. శ్యామ శాస్త్రి గారి సర్వ వేళలా తల్లి కామాక్షినే ధ్యానిస్తూ
ఉండేవారు. అది పూజ ఐనా సంగీతమైనా. [ పోతన గారు
ప్రహ్లాదుని గురించి చెప్పినట్టు ఏ పని చేసినా అమ్మ గురించే ధ్యానం, అంతగా
ధ్యానం చేయడం వల్లనే నేమో ఆయనకీ కామాక్షికీ అబేధ స్థితి ఏర్పడింది] ఒక్కోసారి
"ఆయన కామాక్షితో మాట్లాడేవారు", మరోసారి
"కామాక్షియే ఆయనతో మాట్లాడేది". రాను
రాను అది నిత్యమయ్యిపోయింది. అదీ ఆయన అపార భక్తికి ఉపాసనకి తార్కాణం. "శ్రీ
ముత్తు స్వామి దీక్షితుల వారికి శ్రీ విద్యా సాంప్రదాయంలోని రహస్యాలు శ్రీ శ్యామ
శాస్త్రి వారు బోధించారని ఆ పరంపరలోని వారు చెప్తారు".
పుణ్య దినాలలోనూ,పర్వ
దినాలలోను, శుక్రవారాదులలోనూ జరిగే విశేష పూజలలో
వారు "త్వరగా అంతర్ముఖులయ్యే వారు".
భక్తి పారవశ్యంతో కన్నుల ఆనంద భాష్పాలతో కీర్తనలు పాడేవారు. ఆ సమయాలలో లౌకిక
విషయాలపైగానీ, పదార్థములపై గానీ స్మృతి ఉండని సమయంలో
తీయటి గొంతుతో హృదయ భావాలు పొంగుతుండగా ఎన్నో గొప్ప కృతులు చేసారు. భావ
మాధుర్యానికి, సంగీత మాధురిమకు, సాహిత్యంలోని
లాలిత్యం అదే సమయంలో ప్రగాఢ గాంభీర్యం, భావ సాంద్రత.
నేటికీ ఎందరో సాహితీ వేత్తలకు సంగీతకారులకు ఆదర్శం.
శ్రీ శ్యామ శాస్త్రి గారు స్ఫురద్రూపి, శుభ్రమైన
తెల్లని పంచె చక్కని అంచు కలది కట్టు కుని, చేతిలో
వెండి తొడుగున్న పొన్ను కర్ర పట్టుకుని, కాశ్మీర జిలుగుల
శాలువా పైన ఆచ్చాదించుకుని నుదుట విభూతి, పెద్ద కుంకుమ
బొట్టు పెట్టుకుని, మెడలో బంగారు రుద్రాక్షల మాల వేసుకుని
ప్రత్యేకంగా కనపడేవారు. "పుంసాం మోహన రూపాయ" అన్నట్టు ఆయన అలా వీధిలో
వెళ్తూంటే వీధిలో వారి చేతులు "అసంకల్పితంగా చేతులు రెండూ
ముకుళించుకునేవి". ఆయన రూపం అద్భుత రమణీయకం అని ఆయన గురించి వ్రాసిన
గ్రంథాలలో వ్రాసారు. ఒక్క సారి చూస్తే మరచిపోలేని అద్భుత రూపం, తేజస్సు
వారి స్వంతం. ఆయన నడచి వెళ్తూంటే వీధులలోఅందరూ లేచి నిలబడి గౌరవ ప్రకటనం చేసేవారు.
కూడళ్ళలో, రద్దీ ప్రాంతాల్లో కూడా వారిని చూడగానే
పక్కకి తప్పుకుని నమస్కరిస్తూ దారి ఇచ్చే వారు. అప్పట్లో "వారిని చూడడమే మహా భాగ్యంగా భావించే వారు". "నడిచే కామాక్షిని చూస్తున్నాం" అనుక్కునేవారు. [ అలా
అని వారి బయటికి వచ్చినప్పుడు శిష్య బృందాలు గుంపులు గుంపులుగా ఆయన వెనక ముందూ
నడుస్తూ హడావుడి చేసారనుక్కునేరు. వారికి ఉన్న శిష్యులు అతి తక్కువ ముందే, ఆయనకి అటువంటి కోటరీలు, ఆభిజాత్యాలు
పటాటోపాలేమీ లేవు]. ఆయన అందరినీ చక్కగా పలకరించేవారు.
"అజాత శత్రువు" అని పేరు విమర్శకులు
సైతం ఆయనను "సంగీత సామ్రాట్టు" అని
పిలిచేవారు. అందరిచేత గౌరవం పొందిన సిద్ధ పురుషుడు.
శ్రీ శ్యామశాస్త్రి గారి సమకాలీకులైన శ్రీ త్యాగరాజు గారు, శ్రీ
ముత్తు స్వామి దీక్షితుల వారికి చాలా మంది శిష్యులుండేవారు. కానీ శ్యామ శాస్త్రి
వారికి అతి కొద్ది మందేశిష్యులు. ఉన్న వారికి కూడా శ్రద్ధగా ఆయన నేర్పలేదని
అంటారు. జీవితాంతం తోడున్న ఆయన కొడుకులే ముఖ్య శిష్యులైనారు. ఒక వేళ శ్యామ
శాస్త్రి వారు కూడా శిష్యులకు సంపూర్ణంగా సంగీత శిక్షణ ఇచ్చి ఉంటే ఆయన
"వ్రాసిన 300 కృతులకు పైగా" ఇప్పుడు లభ్యమైయ్యేవి. ఆయన ఎప్పుడూ శిష్యులుండాలనీ, ప్రచారం
కావాలనీ, కోరుకోలేదు. అలాగే జీతంకోసం సంగీతం
చెప్పే స్థితి ఆయనకు కలగలేదు. కామాక్షి దయ వల్ల ఆయన ఆ వంశంలో "పుట్టడానికి
ముందే సరిపడా ఆస్తి సమకూర్చబడింది". అందువల్లనే అనుక్కుంటా రాజుల వద్దకు, జమీందారీల
వద్దకు వారెప్పుడూ వెళ్ళే వారు కాదు. వీలైతే వారికి దూరంగా ఉండడానికే ఎక్కువగా
ప్రయత్నించేవారు. ఆయన నరులను స్తుతి చేసి ఎరుగడు. కేవలం అమ్మ వారి మీదనే వారి
కృతులు. శిష్యులకి ఆయన సంగీతం శ్రద్ధగా
నేర్పకపోవడానికి కారణాలలో పైవి కూడా కారణమైనా, అసలు
కారణం ఇంకోటుంది. అది వారి నిత్య తపస్సు. "సంగీతం మొదలెట్టగానే ఒక ట్రాన్స్
అంటాం కదా అలా అంతర్ముఖులై ఎన్నో గొప్ప గొప్ప రాగాలలో కీర్తనలు చేసేవారు".
అది సంగీతం నేర్చుకోడానికి వచ్చిన శిష్యులకి అర్థం కాక అన్నప్రాశన నాడే ఆవకాయ
అన్నం లా ఉండేది. పట్టు బట్టి వారి దగ్గర నేర్చుకున్నది వారి కుమారులు మరి
కొంతమంది ఒకరో ఇద్దరో.
పండితులు విమర్శకులు వారి కృతులకు ప్రాచుర్యం రాకపోవడానికి
కారణం రెండు విధాలుగా చెప్తారు. ఒకటి పైన చెప్పిన కారణం రెండవది.. శ్యామ శాస్త్రి
గారి కృతులు సంగీత పరంగా గొప్ప విద్వత్తుతో కూడుకున్నవి. తాళ క్రమ విషయాలలో అత్యంత
గహనమైనవి గంభీరమైనవి. వాటిని పాడడం అంత సులభం కాదు.సంగీత సాధనలో బాగా పండిన ఒక
స్థాయి వారికి గానీ ఆ రాగ తాళ క్రమ విన్యాసం అర్థం కాదు. శ్యామశాస్త్రి
గారి కీర్తనలు కొన్ని పాడగలిగితే సంగీత విద్వాంసుడైనట్టే అని సంగీతజ్ఞుల అభిప్రాయం! అంగీకారం!.
సాధారణ పామర జనులకు వారి సాహిత్యం చదివితే అర్థం అయ్యేలా ఉన్నా, సంగీత
గాంభీర్యం వల్ల అర్థం కాదు. ఈయన కృతులు సంగీతంలో కృషి చేసిన వారికి చాలా
ఆనందాన్నిస్తాయి. ఆయన అపార సంగీత జ్ఞానం వల్ల ఆయన కృతులలో మాంజి, కల్గడ, చింతామణి
వంటి అపూర్వమైన రాగాలు ఉండడంవల్లా, ఆయన కృతులు
చౌక కాలము, మధ్యమ కాలము లలో ఉండడం వలన, సంగీతం
అనే అరణ్యంలో ఆయన కున్న సామర్థ్యం రీత్యా ఎన్నో సుందర వనాలను తీర్చి దిద్దగల
సామర్థాన్ని సూచిస్తాయి.
ఒకసారి వారి మిత్రుడొకరు పుదుక్కోటకు ఆహ్వానిస్తే వెళ్ళి
అక్కడి బృహదంబా దేవాలయంలో దర్శనం చేసుకుంటున్న శ్యామ శాస్త్రి గారి వద్దకు ఒక
బ్రాహ్మణుడు గబగబా వచ్చి "మధురలో మీనాక్షి అమ్మ ఎదురు చూస్తోంది. నువ్వు
వెళ్ళి అక్కడకి వెళ్ళి మీనాక్షీ సన్నిధానంలో ఆమెను స్తుతిస్తూ కొన్ని కీర్తనలు
చేయి" అని కోరగా అది అమ్మవారి ఆజ్ఞగా భావించి అలాగే నిశ్చయించుకొన్నారు.
తిరిగి తంజావూరు వచ్చి తిరిగి తన ఉపాసన ఇతర నిత్య కర్మాదులు, నిత్య
విధులలో ఉండి మధురై సంగతి మరుగైంది. కొంత కాలానికి కలలో ఆ బ్రాహ్మణుడే తిరిగి
కనపడి మధురై సంగతి జ్ఞాపకం చేసాడు. అదీ ఆయన సంగీతంలోని మాధుర్యం అమ్మతనం మీద
అమ్మవారి మీద వారు వ్రాసిన కృతులు వినడానికి మీనాక్షమ్మే ఆయనను రప్పించుకునేందుకు
ఎదురు చూసిందంటే శ్రీ శ్యామశాస్త్రి గారు భక్తి మాధుర్యం ఏమిటో ఆయన సాహిత్యమేమో
అర్థం అవుతుంది. [ముఖ్యంగా సంగీత కారులు సాహిత్యాన్ని ఒక
సారి వ్రాసుకుని దానికి సంగీత రచన వేరుగా చేస్తారు. అందువల్లనే చాలా కీర్తనలలో
పదాలు సగంలో విరిగి పోయినట్టు అనిపిస్తుంది. ఉదా: కుందరదన అన్న చోట కొన్ని కీర్తనలలో కుం... ............. దర..............
దన................ అన్నట్టు ఉంటుంది దీనికి కారణం సాహిత్యం దానికి సంగీతం వేరుగా
రచించడం. కానీ శ్యామశాస్త్రి గారి సాహిత్యం తోపాటే సంగీతం కూడా రచించేవారు కాబట్టి
పదాలు తేలికగా అర్థం అవుతాయి, పదాలని విరవడం
ఈయన బాణీలో అత్యల్పం, శూన్యమనే చెప్పొచ్చు.]
సరే, మీనాక్షి
తల్లి నుండి మళ్ళీ పిలుపు రావడంతో, మరచినందుకు
చింతించి తన శిష్యుడైన అలసూరు కృష్ణయ్య గారిని వెంటబెట్టుకుని మధురై వెళ్ళారు.
వారి గురించి అందరూ విన్నవారే కాని తంజావూరు వారికి తప్ప వారెవరో ఎవరికీ తెలియదు
ఆర్భాటాలకూ పేరు ప్రతిష్ఠలకూ, ప్రత్యేక
గురింపులకూ వారు విలువిచ్చేవారు కాదు. అంత గొప్ప పేరున్నా, పలు
ప్రాంతాలలో వారి అభిమానులున్నా, రాజాదులు వారి
సేవకు కాచుక్కూచున్నా ఎవ్వరినీ ప్రత్యేక దర్శనాలు, ప్రతేకతలు
కోరకుండా ఉన్న కొద్దిశిష్యులను కూడా వెంటబెట్టుకెళ్ళకుండా, కేవలం
ఒక్క శిష్యుణ్ణే వెంటబెట్టుకెళ్ళారు. శ్యామ శాస్త్రి గారు మీనాక్షి కోవెలలో అమ్మను
చూస్తూ అమ్మకి ఎదురుగా నిలబడి కొన్ని కృతులు చేస్తుంటే, ఎవరో
సంగీత కారుడు అని అర్చకులు కానీ, వచ్చివెళ్తున్న
భక్తులు కానీ పట్టించుకోలేదు. అందరూ ఏ సంగీత
విద్వాంసుణ్ణి చూడాలనుక్కుంటారో ఆ కామాక్షీ స్వరూపమైన శ్యామశాస్త్రి ఈయనే అని
తెలుసుకోలేకపోయారు. నాలుగు కృతులు అయ్యింతరవాత ఐదవ కృతి అహిరి రాగంలో మొదలు
పెట్టగానే ఆ గాన గాంధర్వా మాధుర్య ప్రవాహానికి భక్తులందరూ తన్మయావస్తలోకి
వెళ్ళిపోయారు [అప్పుడే వారు అక్కడ మీనాక్షి అమ్మ మీద నవరత్న
మాలికా కృతులు చేసారు.] ఆయన
గాత్రానికి, సాహిత్యానికి, ఆనంద
తన్మయత్వానికి మీనాక్షి తల్లే ఆనందించింది. వెంటనే అర్చక స్వాముల్లోని ఒక అర్చకుడు
అందరి ముందూ " ఈయన ఎవరో గొప్ప సంగీత విద్వాంసుడు, అంతే
కాదు అమ్మవారికి ఆంతరంగికుడైన భక్తుడు. ఈయనని దేవాలయ మర్యాదలతో
సత్కరించాలి" అని ఆవేశంతో ఊగిపోతూ
పలికాడు. అప్పటి మొదలు నేటి వరకూ శ్యామశాస్త్రి గారి కుటుంబానికి మధురైలో ఆలయ
మర్యాదలతో సత్కరించడం ఆ ఆలయ ఆచారమైంది. [ఏ
ప్రత్యేకతలూ కోరుకోకుండా నిరాడంబరంగా ఉంటూ మన కున్న విభూతిని ఈశ్వర పరం చేయటం వల్ల, నిష్కామం గా ఉండడం వల్ల సంతసించిన పరమేశ్వరుడు
సాధకునికి దక్కవలసినదాన్ని అయాచితంగా ఇస్తాడు]. శ్యామశాస్త్రి
గారి పక్కనున్న శిష్యుని వలన ఆయనే వాగ్గేయకార సార్వభౌముడైన శ్రీ శ్యామశాస్త్రి
గారు అని తెలుసుకుని ఆయన నిరాడంబరతను చూసి అవాక్కవ్వడం దేవాలయం వారి వంతయ్యింది.
అక్కడున్న భక్తజనులు, దేవాలయం వారు, అర్చకులు
ఆయనను చూసి ఆనంద పరవశులయ్యారు ఎన్నో సత్కారాలుచేశారు.
మీనాక్షి
అమ్మ వారి మీద శ్యామ శాస్త్రి గారి నవరత్న మాలికా కృతులలో ఏడు మటుక్కు చాలా
ప్రచారంలో ఉన్నాయి [మిగతా రెండూ నాకు తెలియలేదు, చాలామందికి
తెలియవు, ఎవరికైనా తెలిస్తే తెలియజేయ మనవి]
సరోజ దళ నేత్రి - శంకరాభరణ రాగం - ఆది తాళము
దేవి మీన నేత్రి - శంకరాభరణ రాగం -
ఆది తాళము
మరి వేరే గతి - శంకరాభరణ రాగం - ఆది తాళము
నన్ను బ్రోవు లలితా - లలితా రాగం - మిశ్ర లఘు తాళము
మాయమ్మ - అహిరి రాగం - ఆది తాళము ( ఈ కృతికే అర్చక స్వామిని మీనాక్షమ్మ
ఆవేశించి, పైన చెప్పిన ఘట్టం జరిగింది)
దేవి నీదు పద సారస - కాంభోజి రాగం - ఆది తాళము
మీన లోచన బ్రోవ - ధన్యాసి రాగం - చాపు
తాళము
కొందరి
మతం ప్రకారం ఈ కృతి నవ కృతుల్లో ఒకటిగా అంటారు
రావే పర్వతరాజ కుమారి - కళ్యాణి రాగం - ఆదితాళం
కానీ
చాలామంది సంగీతజ్ఞుల ప్రకారం మీనాక్షి అమ్మవారిమీద మిగిలిన రెండు కృతులు శ్రీ రాగంలోనూ, నాటకురంజిలోనూ
చేశారు ప్రస్తుతం అవి అలభ్యం. ఈ రాగాలలో కామాక్షి అమ్మవారిని కీర్తించారు.
సశేషం....