Pages

Sunday, July 31, 2022

శంకరుల కాల నిర్ణయం - 2

 ధర్మాకృతి : శంకరుల కాలము - 2


ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ “History of Dasanami Nagas”లో “No paer earlier than the 19th Century has been preserved in Sringeri Mutt and the same list can be accepted as correct at the best from 13th Century downwards but not earlier than that period” అని శృంగేరీ గురించి చెబుతూ అంటారు. ఇదే పుస్తకంలో ఇంకొక చోట R.N.Ghosh అనే ఆయనకు శివాభినవనృసింహభారతీ స్వామివారు ఈవిధంగా చెప్పినట్లు వ్రాస్తున్నారు. “At the request of modern archaeologist, my Guru constructed this list, in which Sankaracharya’s birth day is given as 14 vikram Samrat and his immediate successor of Sureswara is started to have lived as the head of Monastery for eight hundred years till 757 AD. You may take it as true or false as you like”. సందర్భానుసారంగా చెప్పవలసి వచ్చింది కాబట్టి వ్రాశాను గానీ, శృంగేరీ పీఠ చరిత్రను, ఔన్నత్యాన్ని కించపరచాలని కాదు. హైందవులందరికీ ఆ పీఠం పూజనీయమైనది.


ఏతావాతా చెప్పవచ్చిందేమంటే ఆదిశంకరుల కాలం క్రీ.పూ.509 అనడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. శృంగేరీ పీఠపు ముప్ఫై రెండవ ఆచార్యుల జీవిత చరిత్రను అత్యంత రమణీయంగా ఆంధ్రీకరించిన ప్రముఖ విద్వాంసులు, విమర్శకులు అయిన శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారు కూడా ఈవిధంగానే అభిప్రాయపడ్డారు. శంకరులకాలం క్రీ.పూ.509 అనడానికి సంప్రదాయ చరిత్రకారులు కొన్ని తిరుగులేని ఆధారాలు చెబుతున్నారు. 


౧. పైన చర్చించిన శంకర పీఠాల సంప్రదాయం ప్రకారం (శృంగేరి మినహాయించి) శంకరుల కాలం క్రీ.పూ.509 అనడం సరిగా సరిపోతోంది. వీరందరూ కుమ్మక్కయి ఈ కాల నిర్ణయం చేశారనడానికి వేరువేరు చోట్ల వేరువేరుగా పరిరక్షింపబడిన సంప్రదాయాలు అవడాన వీలులేదు.


౨. ప్రాచీన శంకర విజయాలలో సూచించిన శంకరుల జననకాలపు గ్రహస్థితి ఈ కాలానికే సరిపోతోంది. వేరే ఏ తేదీకీ దగ్గరగా లేదు.


౩. పతంజలి చరిత్ర ఆధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ.పూ.493గా నిర్ణయింపబడినది. శృంగేరీ పీఠానికి సంబంధమున్న అభినవ విరూపాక్ష పీఠాచార్యులు ఈ నిర్ణయం చేయడం విశేషం. ఈ నిర్ణయాన్ని అనుసరించి కూడా శంకరుల కాలం క్రీ.పూ.509 అని చెప్పుకోవడం సమంజసం. 


౪. జైన విజయాన్ననుసరించి కుమారిల భట్టు కాలం క్రీ.పూ.557గా గుర్తించబడింది. కుమారిలభట్టు కంటే శంకరులు 46 ఏండ్లు చిన్నవారని శంకర విజయాలు చెబుతున్నాయి. 


౫. క్రీ.శ.788కన్నా ముందున్నారని ఆధునిక చరిత్రకారులు ఒప్పుకొన్న అనేకమంది (ముఖ్యంగా భవభూతి, మహేంద్రవర్మల)గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి ఉంది. 


౬. కోట వేంకటాచలం గారు అనేక విధాలుగా శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు. నేపాళ రాజుల వంశచరిత్ర ఆధారంగా పునరుద్ధరించి వారి కాలాన్ని నిర్ణయించి పురాణ ప్రమాణంతో బలపరిచారు. శంకరులు వృషదేవవర్మ కాలంలో నేపాళదేశం పర్యటించినట్లు చెప్పబడింది. వృషదేవవర్మ కాలం కలిశకం 2555-2615గా నిర్ణయించబడినది. తద్వారా శంకరుల కాలం క్రీ.పూ 509 అనడం సరిపోతుంది. వేంకటాచలం గారు భాగవతము, విష్ణు పురాణము మొదలైన పురాణాల ఆధారంగా బుద్ధుని కాలనిర్ణయం, నాగార్జునుని కాలనిర్ణయం చేశారు. దాని బట్టి కూడా శంకరుల కాలం నిర్ణయింపబడింది. 


౭. శంకరుని కాలంలో మగధ రాజ్యపు రాజుగా చెప్పబడుతున్న ఆంద్రహాలుని కాలాన్ని బట్టి కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.


౮. ముఖ్యమైనదింకొకటున్నది. కాశ్మీరులో ఉన్న శంకరాచార్య పర్వతంపై ఉన్న శంకరాచార్య దేవాలయం క్రీ.పూ.367కన్నా ముందు అయి ఉండాలని ఋజువు అవుతోంది.


అయితే ఒకే శంకరులు అనేక కాలాల్లో ఉన్నారనడానికి తగిన ఆధారాలు కనిపించడానికి కారణం ఏమిటి? బౌద్ధగ్రంథాలలో శతాబ్దాల అంతరంలో జీవించి ఉన్న బౌద్ధాచార్యులిరువురకు, శంకరులనే బ్రాహ్మణ సన్యాసి సమకాలీనులుగా చెప్పబడింది. ఇదెలా సాధ్యం? బౌద్ధంలో కూడా అనేక కాలాల్లో ఉన్న నాగార్జునాచార్యులందరినీ నాగార్జునాచార్యుడనే పిలుస్తున్నారు. ప్రస్తుతం లామాలను చూడడం లేదా? అలాగే ఆదిశంకరుల నుండి ఇప్పటివరకు అనేక పీఠాలలో, అనేక కాలాలలో శంకర తుల్యులైన మహామహులున్నారు. శంకర పీఠాలలో వారినందరినీ శంకరాచార్యుల వారనే కదా పిలుస్తున్నాం. మరి ఈ ప్రసిద్ధులైన శంకరాచార్యుల ప్రశంస అనేక గ్రంథాలలోనూ, అనేక శాసనాలలోనూ ఉండడం సహజం. కాబట్టి ఇవన్నీ కట్టుకథలని త్రోసి పుచ్చనక్కరలేదు. అయితే ఈ మహాత్ముల కాలాన్ని ఆదిశంకరుల కాలంగా పొరబడడమే ప్రమాదం. ధీమంతులైన మహాపురుషులు కూడా ఈవిషయంలో ప్రమాదంలో పడినారు. ఏం చేస్తాం! ప్రమాదో ధీమతామపి!!


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 30, 2022

శంకరుల కాల నిర్ణయం - 1

 ధర్మాకృతి : శంకరుల కాలము - 1

ఆంగ్లేయ చరిత్రకారులు, వారినే అనుసరిస్తున్న ఆధునిక చరిత్రకారులు ఆదిశంకరుల కాలాన్ని క్రీ.శ.766గా నిర్ణయించారు. పాశ్చాత్యులకు మన సంస్కృతి పౌరాతన్యాన్ని ఒప్పుకోవడానికి మనసొప్పలేదు. బానిసలకు ఇంతటి మహోన్నతమైన సంస్కృతి చరిత్రకు అందని అనాది కాలం నుంచే ఉన్నదనే నిజం ముఖ్యంగా మెకాలే తరువాతి కాలపు చరిత్రకారులకు కొరుకుడు పడలేదు. అందువల్లనే మన చారిత్రిక పురుషులు పౌరాతన్యాన్ని సాధ్యమైనంత కుదించడానికి ప్రయత్నం చేశారు. మన దురదృష్టవశాత్తు వామాచారులైన చరిత్రకారులు నెహ్రూ gaari కాలం నుండి ప్రభుత్వంలో ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారు. వీరికి మన పూర్వ ఔన్నత్యం మీద నమ్మకం లేదు. మన పురాణాలను, సంప్రదాయాలను, ఆధారాలను పుక్కిట పురాణాలుగా తేల్చివేస్తారు. సంబంధం లేని ఆధారాలను కంబోడియానుండో, చైనా నుండో వీలయితే రష్యా నుండో పట్టుకొని వస్తారు. శంకరుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కంబోడియా శాసనం, శంకరులు తమ గ్రంథాలలో చెప్పిన విషయాలు మొదలుగా గల ఇరవై ఆధారాలను శంకరుల కాలం నిర్ణయించడానికి ప్రమాణాలుగా తీసుకున్నారు. సాంప్రదాయిక చరిత్రకారులు ఆ ఆ ప్రమాణాలను అత్యంత సమర్థవంతంగా ఖండించారు. ఇద్దరి వాదనలనూ విని నిర్ణయించేదెవ్వరు? క్రీ.పూ.ఆరవ శతాబ్దం నుండి క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దం వరకూ ఎవరికి తోచిన కాలం వారు చెబుతూనే ఉన్నారు.
అయితే శంకరుల నుండి ఈనాటి వరకూ అవిచ్ఛిన్న పరంపర చూపుతున్న పీఠాలు నాలుగున్నాయి. విచ్ఛిన్నమయిన పరంపరతో ఇంకొక పీఠమున్నది. ఆధునిక పరిశోధకులు ఈ పీఠాల సంప్రదాయాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోరో అర్థం కాదు. ద్వారక, పూరీ, కంచి పీఠముల వారు శంకరుల కాలాన్ని వారి వద్దనున్న గురు పరంపర ఆధారంగా క్రీ.పూ.509గా నిర్ణయించారు. శృంగేరీ వారు మాత్రం 1954దాకా శంకరుల కాలం క్రీ.పూ.44 అని చెప్పేవారు. ప్రస్తుతం వీరు శంకరుల కాలం క్రీ.శ.788 అంటున్నారని అర్థమవుతోంది. విచ్ఛిన్నపరంపర అయిన జోషిమఠం వారు కూడా శంకరుల కాలం క్రీ.పూ.509గానే చెబుతున్నారు. ద్వారకా పీఠం వారు ప్రస్తుతపు ఆచార్యుల వారితో సహా 80మంది ఆచార్యుల పీఠాధిరోహణ, సిద్ధి వివరాలను చూపుతున్నారు. 18వ శతాబ్దము వరకు కంచిలో ఎంతమంది పీఠాధిపతులు చూపబడ్డారో దాదాపు అంతేమంది ద్వారకలో కూడా ఉన్నారు. వీరి పూర్వ పీఠాధిపతులచే వ్రాయబడిన గ్రంథంలో సుధన్వమహారాజుగారి తామ్రశాసనపు నకలు ముద్రించబడినది. అందులో శంకరులు యుధిష్ఠిర శకం 2031వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు చెప్పబడింది. పూరీ మఠం నూట నలభై మంది ఆచార్యుల పేర్లను తెలియచెబుతూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించింది. కంచి పీఠం వారు 1524-39లలో సర్వజ్ఞ శివేంద్రులచే వ్రాయబడిన పుణ్య శ్లోక మంజరి, సదాశివ బ్రహ్మేంద్రులచే వ్రాయబడిన గురురత్నమాలిక ఆధారంగా ప్రస్తుతము శంకర విజయేంద్రులతో సహా 70మంది ఆచార్యుల వివరాలు అందజేస్తూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు.

చిక్కల్లా శృంగేరీ పీఠం వారు చెప్పే కాలంతో వస్తోంది. 1954సం. వరకూ వీరు శంకరుల కాలం క్రీ.పూ.44గా చెప్పారు. వీరి పీఠంతో సంబంధం ఉన్న కూడలి పీఠం వారు కూడా శంకరులాదిగా అరవై ఏడు పీఠాధిపతుల వివరాలు తెలియబరచి శంకరుల కాలం క్రీ.పూ.44గా నిర్ణయించారు. క్రీ.శ.1844లో ఒక కోర్టు అఫిడవిటులో అప్పటి శృంగేరీ యాజమాన్యము వారు వారి పరంపరలో రమారమి 2000సం.ల పూర్వమున్న శంకరుల కాలంనుండి అప్పటివరకూ 68 మంది ఆచార్యులున్నట్లు, వారి అధిష్ఠానములకు పూజ జరుగుతున్నట్లు వ్రాతపూర్వకముగా తెలియజేశారు. తరువాత ఏ కారణము చేతనో ఆ పీఠాధిపతుల పూజాపేటిక నుండి గ్రహించబడినదని చెప్పబడిన పరంపరా విశేశములో ముప్ఫై ఇరువురు పీఠాధిపతుల పేర్లు మాత్రమే ఉదహరించబడినవి. 1910వ సం.లో అప్పటి శృంగేరీ పీఠాధిపతులచే కాలడిలో వేయించబడిన శిలాశాసనం (ప్రస్తుతం తొలగించబడినది). ఆదిశంకరుల కాలం అప్పటికి 2000సం. పూర్వముగా గుర్తించినది. అయితే తరువాత కాలంలో బహుశః 1967-68లలో అప్పటి పీఠాధిపతులు పూర్వాపరాలను పరిశీలించి శంకరుల కాలం క్రీ.శ.788గా నిర్ణయించారు. కాబట్టి శృంగేరీ పీఠం వారిచే చెప్పబడిన కాలం వారి సంప్రదాయ పరంగా వచ్చినది కాదు. శృంగేరీ పరంపర పరస్పర స్పర్థకల ఇరువురి మధ్య బడి విచ్ఛిన్నము చేయబడినందున దానిని దాని ననుసరించు వారిని ప్రమాణముగా అంగీకరింపవీలులేదని, భారత చరిత్ర చతురానన, భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వేంకటాచలం గారు స్పష్టపరిచారు.

Thursday, July 14, 2022

*వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

 *వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

(బ్రహ్మశ్రీ రేమిళ్ల వేంకటరామకృష్ణశాస్త్రిగారు)
_______________________________
व्यासं वशिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषम्
पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ।।
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ..
వేదవ్యాసమహర్షి వశిష్ఠునికి మునిమనుమడు,
శక్తికి పౌత్రుడు, పరాశరుని కుమారుడు, శుకమహర్షికి తండ్రి. అకల్మషుడు. భారతీయులకు మానవాళికి జ్ఞానభిక్షపెట్టిన పరమేష్ఠిగురువు.
వీరిని త్రిమూర్త్యాత్మకముగా మనం ప్రార్థిస్తూ ఉంటాం.
త్రిమూర్త్యాత్మక గురుస్వరూపుడు -
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః..
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః.
ఇక్కడ మొదటి శ్లోకంలో గురువును బ్రహ్మవిష్ణుస్వరూపంగా, పరబ్రహ్మస్వరూపంగా భావించి నమస్కరిస్తూన్నాం. రెండవ శ్లోకంలో వ్యాసుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తూన్నాం.
రెండిటి సమన్వయంచేత గురువుగా వ్యాసమహర్షిని భావించాల(భావిస్తున్నామ)న్నమాట.
సాక్షాత్ శ్రీకృష్ణస్వరూపుడు-
అభ్రశ్యామః పింగల జటాబద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః .
సర్వాన్ లోకాన్ ప్లావయమానః
కవిముఖ్యః పర్వసు రూపం వివృణోతు.
ఇది వ్యాసులవారివర్ణన. ఆయన మేఘమువలె నల్లనైనవాడు. పింగళవర్ణంలో జటలుకలవాడు.పొడగరి.చేతిలో దండముకలవాడు. కృష్ణమృగాజినం ధరించినవాడు. కవిముఖ్యుడు.
ఇవి బదరికాశ్రమంలో తపస్సుచేసినప్పటి శ్రీకృష్ణునుకి కూడా వర్తిస్తాయి. ఇంతే కాక ఈక్రిందిశ్లోకం వ్యాసనారాయణుల అభేదాన్ని తెలుపుతోంది-
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వన్దే భగవన్తౌ పునః పునః।
ఇది బ్రహ్మసూత్రకర్త వ్యాసునికి శ్రీకృష్ణునికి, భాష్యకర్త శంకరాచార్యునకు సంకరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తోంది. భగవద్గీతనందించిన కృష్ణుడూ కవే.
అనేక పురాణాలను,మహాభారతాన్ని అందించిన వ్యాసుడూ కవే.పైగా వ్యాసుడు కవిముఖ్యుడు.
ఆయన మానవజాతికందించిన సాహిత్యం వెలకట్టలేనిది. అందుకే ఆయన కవిముఖ్యుడు.
ఆదిత్యసదృశుడు వ్యాసుడు -
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్యధాతార మచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
పెనుచీకటికవ్వలి పరతత్త్వాన్ని ఆదిత్యవర్ణునిగా,
కవిగా ఈశ్లోకం చెపుతోంది. నన్నయగారి ఈ పద్యాన్ని గమనించండి-
భారత భారతీ శుభగభస్తి చయంబుల ఘోర సం
సార వికార సంతమసజాల విజృంభము వాపి సూరి చే
తోరుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాం
భోరుహమిత్రు గొల్చి మునిపూజితు భూరి యశోవిరాజితున్.
(ఆం.మ.భా.అవ.22ప.)
ఇందులో వ్యాసుని అంభోరుహమిత్రునిగా అంటే సూర్యునిగా అభివర్ణించాడు.
సూర్యుడు పద్మాలకు వికాసం కలిగించినట్లే వ్యాసుడు పండితులమనఃపద్మాలను వికసింపజేస్తాడు.
సూర్యునివల్ల చీకటితొలగినట్లే వ్యాసునివల్ల మన అజ్ఞానతిమిరం తొలగిపోతుంది.
కాబట్టే ఆయన మునిపూజితుడు, గొప్పకీర్తిచే ప్రకాసించువాడూ అయ్యేడు.
జనహితప్రారంభుడు –
ఎవరే పనిచేసినా అది జనాలకు హితాన్ని కూర్చేదైతే అంతకుమించిన గొప్పపని ఏమీ ఉండదు.
వ్యాసుడు కురువంశాన్ని నిలబెట్టినా, మహాభారతాన్ని, హరివంశాన్ని, అష్టాదశపురాణాల్ని, మహాభావగతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ... రచించినా జనహితంకోసమే.
తాను తరించడం కాదు, శిష్యులను తరింపజేయడమే ఉత్తమగురులక్షణం.
అదే వ్యాసులవారి లక్ష్యం. నన్నయగారి ఈ పద్యం గమనించండి.
పరమబ్రహ్మనిధింబరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా
పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారమ్భుఁ గృష్ణాజినాం
బరు నీలాంబుదవర్ణదేహు ననురూప ప్రాంశు నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్ .
(ఆం.మ.భా.ఆది.3ఆ.3ప.)
వ్యాసులవారు వేదాలకునిధి, పరమబ్రహ్మకునిధి(పరతత్వాన్ని ఎరిగినవారు) బ్రహ్మర్షులలో ముఖ్యుడు, దయాపరుడు,జనహితానికే ప్రయత్నం చేసేవాడు, రాగద్వేషాలు లేనివాడు,
మాత్సర్యం లేనివాడు.
ఇవి సద్గురువుకు ఉండవలసిన లక్షణాలు.
శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడు
రామాయణకాలంలో రాముని పరతత్త్వంగా తెలిసినవారు మహర్షులు మాత్రమే. కాని మహాభారతంలో వ్యాసుని గొప్పతనం చాలమందికి తెలుసు.
కాని ఆయన కథలో ప్రత్యక్షంగా పూనుకున్న సందర్భాలు చాలతక్కువ. తిక్కనగారు వ్యాసుని ఎలా ఆవిష్కరించారో చూడండి -
విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁ గృ
ష్ణద్వైపాయను నీవెఱుంగుము విభున్ నారాయణుంగా విప
శ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధ
ర్మాద్వైతుండు సరోజలోచనుఁడ కాకన్యుండు తద్వాచ్యుఁడే.
(ఆం.మ.భా.శాంతి.6ఆ.476ప.)
విద్వన్మోదవిధాయి - పండితులకు , జ్ఞానులకు ఆనందం కలిగించేవాడు, నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁడు, కృష్ణద్వైపాయనుడు, ధర్మాద్వైతుడు, సరోజలోచనుడు, తద్వాచ్యుడు,మోక్షప్రదాత. ఈవిశేషణాలను గమనిస్తే వ్యాసుడు నారాయణాభిన్నుడని వేరే చెప్పనవసరం లేదు.
నిర్వాణదానక్రియాశీలుడు -
బాలార్క ద్యుతి పుంజ పింజర జటా భారంబుఁ బ్రావృట్ఘన
శ్రీలీలం బ్రహసించు నింగమును రోచిస్స్ఫారదండంబు ను
న్మీలన్నీల మృగాజినాంబరమునై నిర్వాణదానక్రియా
శీలుండైన పరాశరాత్మజుఁడు విచ్చేసెం గృపాలోలుఁడై.
(ఆ.మ.భా.అశ్వ.3ఆ.147ప)
పాండవులకు ఏసమస్య వచ్చినా అక్కడ వ్యాసులవారు ప్రత్యక్షంకావడం చూస్తూ ఉంటాం. అదే ఆయన కృపాలోలత.నిర్వాణదానక్రియాశీలత.
యోగామృత స్ఫీతస్వాంతుడు – వ్యాసుడు
వ్యాసుని జీవితాన్ని పరికిస్తే ఆయన ఎంతటి స్థితప్రజ్ఞడో తెలుస్తుంది.అది యోగంవల్లకాని సాధ్యంకాదు. అందుకే ఎఱ్ఱన గారు ఆయన్ని యోగామృతస్ఫీత స్వాంతుడు అని వర్ణించారు ఈ పద్యంలో -
ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్ట క్రియాశీలుఁ డు
ద్గీతామ్నాయుఁడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత-
స్ఫీతస్వాంతుఁ డనంత సంతత సమావిర్భూత కారుణ్య ధా
రా తోయస్నపనైకశీలుఁడగు పారాశర్యుఁడచ్చోటికిన్ .
(ఆ.మ.భా.అరణ్య.6ఆ.103ప.)
ఒకకసారి ఆ విశేషణాలను గమనించండి. ఆశ్రితజనాభీష్టక్రియాశీలుడు, నిర్విధూతదురితక్లేశుండు, యోగామృతస్ఫీతస్వాంతుడు,
సంతత.... కారుణ్యధారా స్నపనైకశీలుడు.
ఆయన కృపావృష్టిని కురిపించే స్వభావంకలవాడు.
తన జ్ఞానంచే పాపాలను పోగొట్టగలవాడు. (జ్ఞానవిధూతపాప్మా—భగవద్గీత)
ఆగమ పదార్థతత్త్వవిదుడు- వేదవ్యాసుడు
ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటాచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశ వందితు సాత్యవతేయుఁ గొల్చెదన్ .
(ఆ.మ.భా.భీష్మ.1ఆ.71 ప.)
ఆయన వేదాలను విభజించేడంటే పేజీలు చూసి బైండింగు చేయించలేదు. వాటితత్త్వాని ఎరింగిన మహానుభావుడు. అందుకే ఆపనికి పూనుకున్నాడు.
విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం
పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృష్ణ ద్వైపాయనుఁ డర్థిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
(ఆ.మ.భా.విరాట.1ఆ.3ప.)
ఆయన అర్థిలోకహితనిష్ఠను పూని భారతరచన చేసాడు. మొదట అనుకున్నట్లుగా జనహితప్రారంభుడన్నమాటను గుర్తుచేసుకోవాలి.ఈ పద్యలను ఇంకా విస్తృతంగా వ్యాఖ్యానింపవచ్చు. కాని నిడివి పెరుగుతుందని విరమిస్తున్నాను. మన్నించండి.
ఇటువంటి మహానుభావును మనం గురుపూర్ణిమరోజున గురువుగా ఆరాధించాలి,ధ్యానించాలి, పూజించాలి.
🙏శ్రీగురుచరణారవిందాభ్యాం నమః।।🙏

Saturday, February 26, 2022

జగద్గురు పద నిర్వచనం - ఎవరు జగద్గురువులు? - విచారణ

 "జగద్గురు" పద నిర్వచనం - విచారణ

గురువు గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ (గురు గీత)

గు - అంధకారం

రు - దాన్ని నిరోధించగలిగినవారు, నివారణ చేయగలిగినవారు

అంధకార నివారణ, అనగా అజ్ఞాన నివారణ చేయగలిగేవారు గురువులు

 

చిన్నప్పుడు వచ్చీరాని మాటలు మాట్లాడినా, దాన్ని అక్షర రూపంలో వ్రాయడం నేర్పినవారు, అక్షర విషయకమైన అజ్ఞానాన్ని తొలగించిన వారు అక్షర గురువులు. అదేవిధంగా భాషా విషయమై అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి, పదాల కూర్పు, వాక్యాలు, వ్యాసాలు మొదలైనవీ, భాషకు సంబంధించిన నియమాలు, వ్యాకరణం నేర్పినవారు, భాషావిషయకమైన అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టినవారు భాషా గురువు. ఇదే విధంగా, మనకు సైన్సు, లెక్కలు, భూగోళ, ఖగోళ ఇత్యాది విషయాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాటిని నేర్పేవారు ఆయా విషయ గురువులను తెలియబడుతున్నారు.

ఉపనయనం, బ్రహ్మోపదేశం అయ్యిన తరవాత, మనకు వేదం తెలిసినవారు, ఎవరైతే వేదం తెలియనివానికి వేదం నేర్పిస్తున్నారో, అతను వేదగురువు ఔతున్నాడు. అలాగే ఆయా శాస్త్ర గురువులు ఇత్యాది. ఇలా వీరిదగ్గర బాగా నేర్చుకున్న వ్యక్తి మరొకరికి ఆయా విషయాల పట్ల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొడతాడు. అతను పరంపరలో ఇంకొక గురువుగా వస్తున్నాడు. మనకు తేలికగా అవగతమవడానికి, సామాన్య పరిభాషలో ఇదీ గురువుకు సంబంధించిన విషయం.

 

జగత్తు

మనకి జగత్తు రెండు విధాలను చెప్పబడింది

1) స్వాప్నిక జగత్తు - అవాస్తవమైనది. కలలో మాత్రమే కనిపించేది.

2) జాగ్రత్ జగత్తు - ఇది మన కంటికి కనపడేది ఇంద్రియాలతో తెలుస్తున్నది, మన మనసుకి అనుభవంలోకి వస్తున్నది.

మనమందరం ఈ జాగ్రత్ జగత్తులోని విషయాలని కళ్లతో చూస్తున్నాం, స్పర్శతో తెలుసుకుంటున్నాం మిగతా ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. మన మనసుకు కలిగిన అనుభవానికి విరుద్ధంగా ఇంకొకరు చెప్తే ఔనా అలాగా అని నమ్మడానికి లేదు. కానీ శాస్త్రం ఈ జాగ్రత్ జగత్తును కూడా అవాస్తవ జగత్తు అనే అంటుంది. దీనివల్ల మనకి సందేహం కలుగుతుంది. ఈ విషయాలను తెలుసుకోవడానికి మనకు తెలియపరచడానికి మనమొక గురువు దగ్గరకెళ్లాలి.

 

జగత్తులో కలుగుతున్న అనుభవానికి సంబంధించి సత్య విషయం, జగత్స్వభావం తెలుసుకోవడం, తత్సంబంధ అంధకారం తొలగించుకోవడానికిగానూ గురువును ఆశ్రయించాలి.

 

జగత్తులో ఉన్న ఒకే విషయంపట్ల మనకు ఒక్కొక్కరికీ ఒక్కొక్క అనుభవం కలగవచ్చు. భిన్న-భిన్నమైన, కొందరికొకలా మరికొందరికొ ఇంకొకలా  అనుభవాలు కలుగవచ్చు. ఉదా:- పౌర్ణమి చంద్రుడున్నాడు, అందరికీ జానెడే కనిపిస్తాడు, గుండ్రని అప్పడంలా కనిపిస్తాడు. మనకు కొద్ది దూరంలోనే ఉన్నట్లు కనిపిస్తాడు. అంతమాత్రాన నిజానికి చంద్రుడు అప్పడంరూపంలోనో, జానెడు పరిథిలోనో, మనకు కొద్ది దూరంలోనే ఉంటాడా? లేదు, చాలా పెద్దగా ఉంటాడు, లక్షల కి.మీ. దూరంగా ఉంటాడు.

భూమి మీదనుంచి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసే వ్యక్తికి అది ఓ చిన్న పక్షిరూపంలో కనిపిస్తుంది, దానియొక్క అసలు పరిమాణం మరుగునపడుతుంది. అదే ఆకాశంలో విమానంలో ఉన్న విమానంలోంచి క్రిందకు చూస్తున్న ప్రయాణీకునికి క్రింద ఉన్న ఇళ్ళు, మనుషులు చీమలు, క్రిముల పరిమాణంలో కనపడతాయి. నిజాకవేవీ సత్యం కాదు. విమానం చాలా పెద్దది, భూమి మీద ఉన్న మనుష్యులు, ఇళ్ళు-భవనాలపరిమాణం చీమలంత క్రిములంత కాదు.

 

దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే మనకు కలిగిన అటువంటి అనుభవాలన్నీ దుష్టమైనవే కానీ, నిర్దుష్టమైనవి కావు కదా.

 

ఆవిధంగా దుష్టమైన అనుభావలన్నీ సత్యం కావు అని తెలిసి జగత్తు యొక్క స్వభావం, తత్త్వం వాస్తవ స్వరూపం గురించి పూర్తిగా తెలిసినవాడు జగత్తుగురించి నిర్దుష్టంగా మనకు తెలుపగలడు.

 

మనకు ఒక నానుడి ఉన్నది "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా?" అని. జగములో ఉన్నవారంతా గుర్తుపట్టే బ్రాహ్మణునికి అని కాదు ఇక్కడ చెప్పింది, జగమంటే ఏమిటో దాని స్వభావమేమిటో పూర్తిగా తెలిసినవానికి జంధ్యం అవసరంలేదు అని. జంధ్యం అవసరంలేని బ్రాహ్మణుడెవరు అనే ప్రశ్నకు సమాధానం "సన్యాసి" అని. జగత్తుగురించి పూర్తిగా తెలియని వాడు జంధ్యం వేసుకుని సాధన చెస్తారు. కొందరు సన్యాసులైనా సరే, ఎందుకంటే వారికి జగత్స్వరూప స్వభావాలు సరిగ్గా పూర్తిగా తెలియవు కాబట్టి. నిర్దుష్టం, నిర్దోషం కాని జగత్తునందలి అనుభవాలను కూడా సత్యమే, వాస్తవమే అనుకునే సిద్ధాంతంలో ఉన్నవారికి జగత్తుయొక్క వాస్తవ స్వభావ, స్వరూప, తాత్త్విక విషయ జ్ఞానం అసంపూర్ణం, కాబట్టి వారు తద్విషయమై అజ్ఞానాన్ని తొలగజేయలేరు. వారికి జంధ్యం అవసరమే!

ఎవరు జగత్తు విషయమైన అజ్ఞానాన్ని పోగొడతారో వారే జగద్గురువులు

ఈ జగద్గురువులు అంటే ఎవరెవరు?

ఒక శరీరాన్ని, ఒక ఆకారంతో ఉన్నవారిని చూసి జగద్గురువులు అని అంటున్నాము. వారు బ్రహ్మాన్ని తెలుసుకుంటే అంటే తార్కికంగా ఐనా, అనుభవపూర్వకంగా ఐనా తెలుసుకున్న వారిని జగద్గురువులంటున్నాము.

ఐతే, మనకు భాగవతం 2వ స్కందం, 5వఅధ్యాయంలో బ్రహ్మ నారద సంవాదంలోని 10-12 శ్లోకాలలో జగద్గురు విషయం ఉన్నది.

నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః !

అవిజ్ఞాయ పరం మత్త ఏతావత్త్వం యతో హి మే !! 10

యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహమ్ !

యథార్కోఽగ్నిర్యథా సోమో యథర్‍క్షగ్రహ తారకాః !! 11

తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి !

యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుమ్!! 12

ఓ నారదా! వాస్తవముగా నన్ను గూర్చి నీవు సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు మొదలైన మాటలచే సంబోధించిన విషయం ఏదీ అసత్యం కాదు. ఎందుకంటే? నాకంటే అధికుడైన పరమాత్మ యొక్క తత్త్వమును గూర్చి తెలియనంతవరకూ "ఇదంతా నా ప్రభావమే" అని లోకంలోని వారికి అనిపించడం సహజము. యథార్థముగా ఈ సమస్త సృష్టికీ ఆపరమశక్తి స్వరూపుడగు పరమాత్మ శక్తియే కారణము.(10) నారదా! సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, తారాకలు, స్వయంప్రకాశమానుడైన ఆ భగవంతుని నుండి తేజస్సును పొందియే, ఈ జగత్తులో వెలుగులు నింపుచున్నవి. అదే విధంగా నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింపజేయబడీన జగత్తును మాత్రమే ప్రకటింపజేయుచున్నాను. (11) భగవంతునియొక్క దుర్జయమైన మాయచే మోహితులవడం వలననే లోకులు నన్ను చూచి జగద్గురువుగా పేర్కొనుచున్నారు. వాస్తవముగా ఆ శ్రీ కృష్ణుడే జగద్గురువు (కృష్ణం వందే జగద్గురుమ్) అటువంటి వాసుదేవ భగవానుని నేను నమస్కారపూర్వకముగా ధ్యానించుచున్నాను.(12)

ఈ విషయం ద్వారా మనకు సిద్ధమైనదేమంటే పరబ్రహ్మమునే జగద్గురువు అని చెప్పబడింది. ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నవారిని కూడా జగద్గురువు అని సంబోధించబడుతున్నారు.

జగద్గురువులు అంటే ఒక్కరే ఒక్కరు ఆ పరమాత్మయే! అప్పుడు మరి శంకరభగవత్పాదులు జగద్గురువులు కారా! అంటే? వేదాంత ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతం ప్రకారం  "బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఔతున్నాడు"

 

నేనే బ్రహ్మమును అని తెలుసుకోవడం అసలైన తెలుసుకోవడం అదీ అద్వైతం! అంతే తప్ప వేరెక్కడో ఉన్నది బ్రహ్మము అని తెలుసుకోవడం అసలు తెలుసుకోవడం కాదు.
అంటే "This is Bramham" అని కాదు, "I am Brahmam" అని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడం. ఆ విధమైన జ్ఞానమును తెలుసుకున్నవారూ బ్రహ్మమే, వారే జగద్గురువులుగా పిలువబడుతున్నారు.

 

ఐతే మరి ఎంతమంది జగద్గురువులు? అనాదిగా సదాశివుడు, నారాయణుడి నుంచి లెక్కకడితే ఇప్పటివరకూ ఎందరో జగద్గురువులు. వేలు లక్షలు. ఔనా ? కానీ ఈ లెక్క శరీరాలను , నామరూపాలను సూచించే లెక్కయే కదా! వీళ్ళు జగద్గురువులు, వాళ్ళు జగద్గురువులు ఎందరో జగద్గురువులు అని చెప్పేవారు శరీరాలను లెక్కపెడుతున్నారు తప్ప, బ్రహ్మమును చెప్పట్లేదు. బ్రహ్మము ఒక్కటే, అదే జగద్గురు తత్త్వం.

ఏ వ్యక్తి ఆ బ్రహ్మము తానే అనీ, ఈ జగత్తు అవాస్తవమనీ దాని తత్త్వ స్వరూపాది విషయకాన్ని తెలుసుకుని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత వాక్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడో అతనే జగద్గురువు.

 

ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారు చిన్నవయసులోనే ఉన్నప్పుడు ఉత్తరభారత యాత్ర చేశారు. ప్రయాగలో చాతుర్మాస్యం చేసి కాశీవైపు యాత్ర ప్రారంభించారు. కాశీలో పండితులు ప్రముఖులు రెండుగా విడిపోయారు, వారి ప్రకారం నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కంచిపీఠంలేదు కాబట్టి ఆహ్వానం, గౌరవ సత్కారం అవసరంలేదు అని కొందరభిప్రాయం. అప్పుడు కాశీరాజు సంకటంలో పడిపోయారు. ఏంచేయాలో తెలియలేదు, వచ్చినది సామాన్య యతి కాదు, పైగా కంచి కామకోటి పీఠాధీశ్వరులు. అప్పుడు కాశీరాజు ప్రయాగనుంచి వస్తూ వింధ్యాచలంలో బస చేసిన పరమాచార్య స్వామి వారి వద్దకు సాదరంగా వెళ్ళి, మేముండేది వ్యాసకాశీలో, కాబట్టి ఉత్తరకాశీపండితుల విషయం పక్కనపెట్టి, పీఠంతో , పరివారంతో సహా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని విజ్ఞప్తి చేసారు. అపుడు స్వామివారు ఉత్తరకాశీ పండితులు వచ్చి మమ్మల్ని జగద్గురువులు అని నిర్ణయిస్తే మేము కాశీ వస్తాము. లేదా విశ్వేశ్వరునికి ఇక్కణ్ణుంచే నమస్కారం చేసి వెళ్ళిపోతాము అని తెలిపారు. అప్పుడు ఉత్తరకాశీ నుంచి వచ్చిన పండిత బృందం స్వామివారిని " మీరు జగద్గురువులు ఎలా ఔతారు, మీకు జగత్తంతా తెలుసా?" అని ప్రశ్న వేసారు. అప్పుడు స్వామి వారు ఎవరు జగద్గురువో వారు జగత్తునుండి అన్నీ తెలుసుకుంటారు. అని భాగవతంలోని అనేక ఘట్టాలను, దత్తాత్రేయ స్వామి వారు జగత్తులోని అనేక విషయాల ద్వారా వారు నేర్చుకున్నవిషయాలను చూపారు.

 

మన ఇంట్లో చెత్త ఊడ్చి బైట పారేస్తే (పూర్వకాలంలో, ఇప్పటికీ పల్లెల్లో) కోడి వెళ్ళి చెత్తను తనకాళ్లతొ లాగేసి, తనక్కావలసిన గింజలో, ఏ ఆహారమో మాత్రమే ముక్కుతో పొడిచి తింటుంది. మన ఉంగరంలోంచి వజ్రం ముక్క పడిపోయి అది చెత్తతో పాటు బైట పారవేయబడ్డా, చెత్తలో ఆహారం ఏరుకునే కోడి మాత్రం దాన్ని వజ్రం ముక్క చాలావిలువైనది అని దాచదు, మిగిలిన చెత్తతో సమానంగానే కాళ్లతో జరిపేసి తనకి కావలసినది మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది. ఇలా జగత్తునుంచి తెలుసుకొనే విషయాలనేకం.ఆతరవాత ఎంతో సంతోషంతో ఉత్తరకాశీ పండితులంతా కలిసి జగద్గురువు అని నిర్ణయించి వారిని సాదరంగా కాశీకి ఆహ్వానించి, స్వాగత సత్కారాలు ఉత్సవాలు చెసారు.

 

జగత్తులో ఉన్న తాత్విక విషయం తెలుసుకొని, జగద్విషయకమైన అజ్ఞానము, అంధకారాన్ని పోగొట్టేటువంటి వారే జగద్గురువులు.

 

ఇంతమంది జగద్గురువుల శరీరాలు వేరైనా, లెక్కపెట్టగలిగినా పరమాత్మ తత్త్వం ఒక్కటే జగద్గురుత్వం, జగద్గురుతత్త్వం ఒక్కటే!

 

మన ఇంట్లో కిచెన్, హాలు, బెడ్రూమ్, పూజారూమ్, స్టోర్ రూమ్ అన్నీ ఉన్నాయ్ అన్నిరూములూ వేరే ఆయా గదులకోసం కట్టిన గోడలవల్ల ఆయా గదుల్లో ఉండే స్పేస్/ఆకాశం వేరుగా కనపడుతోంది. అదే పూజారూమ్ చిన్నగా ఉన్నదని గోడ బద్దలుకొట్టి స్టోర్ రూమ్ పూజారూం కలిపేస్తే ఇప్పుడున్నది ఒకటే గది, ఒకటే ఆకాశం. "ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః" గమనిస్తే గురు తత్త్వం ఒక్కటే, కానీ గురువు శరీరాన్నిచూసి ఆ శరీరమే గురువు అని అనుకోవడం కాదు, గురువు అనేది ఒక తత్త్వం. తత్త్వానికి ఆకారం లేదు, ఉండదు. అందుకొరకు ఆకారానికి, ఆ శరీరానికి పూజ, గౌరవం. గురువు ఆకాశం వలె సర్వ వ్యాపకుడు అతనికి శరీరం ఒక ప్రతీక.

 

ఏ విషయమైన అజ్ఞాన్ని పోగొడితే ఆవిషయానికి గురువు అని అన్నట్లు, రామాయణం చెప్ఫేవారిని రామాయణ గురువు, భాగవతం చెప్పేవారిని భాగవత గురువు, పురాణం చెప్పేవారిని పురాణ గురువు అని అంటున్నాం. దానర్థం వాళ్ళు రామాయణానికంతటికీ గురువు , లేదా భాగవతానికంతటికీ గురువు, లేదా పురాణాలన్నిటికీ గురువు అని కాదు. రామాయణానికి సంబంధించిన అజ్ఞానాన్ని, భాగవతానికి సంబంధించిన అజ్ఞానాన్ని, పురాణాలకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగతేసే గురువులు అని అర్థం.

 

అదే విధంగా ఈ జగత్తు విషయకమైన అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి దాని స్వభావాన్ని బోధించి సత్యం తెలియజేసే గురువే "జగద్గురువు". జగత్తు యొక్క అసలు స్వరూపాన్ని యెరిగి, తానే బ్రహ్మమైయున్నాననే సత్యాన్ని తెలుసుకున్న అటువంటి గురువులందరకూ ప్రతీకగా శంకరులు ఆయా పీఠాల్లో పీఠాధిపతులను జగద్గురువులుగా ప్రతిష్ఠించే వ్యవస్థను ఏర్పరచారు.

 

-శంకరకింకరః

(శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్)

------------

గురువుల అమృతమయమైన అనుగ్రహంతో జగద్గురు శబ్దానికి సంబంధించిన విషయ, విచారణ పూర్వకమైన ఈ వ్యాసం ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసమందు ఏవైనా తప్పులు, దోషాలుంటే సూచించ ప్రార్థన.

----------------