Pages

Wednesday, March 10, 2021

*లింగపూజకు అర్చనకు (అభిషేకము అర్చనలోని అంగము) అధికారి ఎవ్వరు?*

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండము నుండి


అనేక లింగం యో నిత్యం భక్తి శ్రద్దా సమన్వితః !! 30 

పూజయేత్స లభేత్కా మాన్మనసా మానసేప్సితాన్‌ !

న లింగారాధనాదన్యత్పుణ్యం వేద చతుష్టయే !! 31

విద్యతే సర్వశాస్త్రాణామేష ఏవ వినిశ్చయః !

సర్వమేతత్పరిత్యజ్య కర్మజాల మశేషతః !! 32 

భక్త్యా పరమయా విద్వాన్‌ లింగమేకం ప్రపూజయేత్‌ !

లింగేsర్చితేsర్చితం సర్వం జగత్‌ స్థావరజంగమమ్‌ !! 33

సంసారాం బుధి మగ్నానాం నాన్యత్తారణ సాధనమ్‌!

అజ్ఞానతిమిరాం ధానాం విషయాసక్త చేతసామ్‌ !! 34

ప్లవో నాన్యోsస్తి జగతి లింగారాధన మంతరా !

...అనేక లింగములను నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించు వ్యక్తి కోరికలన్నీ తీరును. నాలుగు వేదములలో లింగారాధనము కంటెను అధికపుణ్యమైన కర్మ లేదని, సర్వశాస్త్రముల నిశ్చయము.  విద్వాంసుడు, తెలిసినవాడు ఈ కర్మ సముదాయమునంతను వీడి పూర్ణభక్తితో లింగపూజను చేయవలెను. అలా లింగము నర్చించినచో, చరాచర జగత్తు నంతనూ అర్చించినట్లే అని, . అజ్ఞానము అనే చీకటివలన అంధులై, ఇంద్రియ భోగములలో నిమగ్నమైన మనస్సు గల వారికి , ఈ లోకములో లింగార్చన తప్ప మరిసంసారమును దాటించే మరింకొక నావ లేదు.

 

ఎవరెవరు లింగమునర్చించిరి? ఎవరెవరు అర్చింవచ్చు.

హరి బ్రహ్మదయో దేవా మునయో యక్షరాక్షసాః !! 35

గంధర్వాశ్చారణాస్సిద్ధా దైతేయా దానవాస్తథా !

నాగాశ్శేష ప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా !! 36

సప్రజాపతయ శ్చాన్యే మనవః కిన్నరా నరాః !

పూజయిత్వా మహాభక్త్వా లింగం సర్వార్థ సిద్ధిదమ్‌ !! 37

ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్సర్వాన్‌ హృది స్థితాన్‌ ! 

*విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు మరియు శేషుడు మొదలగు నాగులు, గరుడుడు మొదలగు పక్షులు ప్రజాపతులు, మనువులు, కిన్నరులు, మరియు మనుష్యులు సర్వకార్యములను సిద్ధింపజేయు ఈ లింగమును అనన్య భక్తితో పూజించి , తమ తమ మనోరథములనన్నింటినీ సాధించుకొనిరి.*


*బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః* !! 38

*పూజయేత్సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరమ్‌* !

*కిం బహూక్తేన మునయః స్త్రీ ణామపి తథాన్యతః* !! 39

*అధికారోఽస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః* !

*ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరమ్‌* !! 40

*అన్యేషా మపి జంతూనాం వైదికేన న సంమతమ్‌* !

*వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గతః* !! 41

*కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాన్‌ శివః* !

*దధీచి గౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసామ్‌* !! 42

*ద్విజానాం జయతే శ్రద్ధా నైవ వైదిక కర్మణి* ! 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని గాక సర్వులు లింగమును ఆయా మంత్రములతో అనగా వారి వారికి అధీకృతమైన మంత్రములతో శ్రద్ధగా నిత్యము పూజించవలెను. (అనగా బ్రాహ్మణులు వైదిక మంత్రములతోనూ, ఇతరులు వారివారికి నిర్దేశించిన వైదిక, తాంత్రిక, పౌరాణికాది మంత్రములతోనూ పూజించవలెను ) *ఓ మునులారా! ఇన్ని మాటలేల? ఓ ద్విజులారా! స్త్రీలకు, ఇతరులకు అందరికి కూడ శివలింగమును అర్చించుట యందు అధికారము గలదు.* ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుటయే శ్రేష్ఠము* . *ఇతరులకు వైదిక పద్ధతి అను కూలము కాదు*. వేదవేత్తలగు *ద్విజులు వైదిక పద్ధతిలోనే పూజించవలెననియు , ఇతర పద్ధతిలో కాదనియు పరమేశ్వరుడు చెప్పెను*. దధీచి, గౌతముడు మొదలగు ఋషుల శాపముచే భ్రష్టమైన అంతః కరణము గల ద్విజులకు వైదిక కర్మల యందు శ్రద్ధ కలుగనే కలుగదు.

యో వైదిక మనాదృత్య కర్మ స్మార్‌ మథాపి వా !! 43

అన్యత్స మాచరేన్మర్త్యో న సంకల్పఫలం లభేత్‌ !

ఇత్థం కృత్వార్చనం శంభోర్నై వేద్యాంతం విధానతః !! 44

పూజయే దష్ట మూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః !

క్షితిరాపోsనలో వాయురాకాశ స్సూర్య సోమకౌ !! 45

యజమాన ఇతి త్వఎ్టౌ మూర్తయః పరికీర్తితా !

శర్వోభవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః !! 46

మహాదేవః పశుపతి రేతాన్మూర్తిభిరర్చయేత్‌ !

వైదిక కర్మలను, స్మార్తకర్మలను అశ్రద్ధచేసి ఇతర కర్మల నాచరించు మానవుడు తాను కోరిన ఫలమును పొందడు. ఈ విధముగా నైవేద్యము వరకు యథావిధిగా అర్చించి, ఆ లింగమునందే, త్రిలోకములను వ్యాపించియున్న అష్టమూర్తులను పూజించవలెను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనునవి అష్టమూర్తులు అని కీర్తింపబడినవి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, ఈశ్వరుడు మహాదేవుడు, పశుపతి అను పేర్లను అష్టమూర్తులతో బాటు భావించి అర్చించవలెను.

పూజయేత్పరివారం చ తతశ్శంభోస్సు భక్తితః !! 47

ఈశానాది క్రమాత్తత్ర చందనాక్షత పత్రకైః!

ఈశానం నందినం చండం మహాకాలం చ భృంగిణమ్‌ !! 48

వృషం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తత్ర్కమాత్‌ !

అగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా !! 49

తత ఏకాదశాన్‌ రుద్రాన్‌ పూజయేద్విధినా తతః !

తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రియ మేవ చ !! 50 

స్తుతీర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా !

తతః ప్రదక్షిణాం కృత్వా నత్వా లింగం విసర్జయేత్‌ !! 51


ఆ తరవాత శివుని పరివారమును భక్తితో పూజించవలెను . ఈశానునితో మొదలిడి, క్రమముగా నంది, చండ, మహాకాల, భృంగి, వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులను, ముందువైపు వీరభద్రుని, వెనుక వైపు కీర్తి ముఖుని గంధ అక్షత, బిల్వపత్రములతో పూజించవలెను.  తరువాత పదకొండు రుద్రులను యథావిధిగా పూజించి, పంచాక్షరిని జపించి, రుద్రాధ్యాయమును పఠించవలెను. పిమ్మట వివిధ స్తుతులను, పంచాగమును పఠించి, ప్రదక్షిణము చేసి, నమస్కరించి లింగమునకు ఉద్వాసన (పార్థివ లింగమునకు ఉద్వాసన, ఇతర లింగములకు పూజార్పణం చేసి మందసమునందుంచవలెను, లేదా సింహాసనమందుంచవలెను) చెప్పవలెను.

 

ఇతి ప్రోక్తమశేషం చ శివపూజన మాదరాత్‌ !

రాత్రా వుదజ్ముఖః కుర్యాద్దేవకార్యం సదైవ హి !! 52 

శివార్చనం సదాప్యేవం శుచిః కుర్యాదుదజ్ముఖః !

న ప్రాచీమగ్రత శ్శంభో ర్నోదీచీం శక్తి సంహితామ్‌ !! 53

న ప్రతీచీం యతః పృష్ఠ మతో గ్రాహ్యం సమాశ్రయేత్‌ !

వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా !! 54 

బిల్వపత్రం వినానైవ పూజయోచ్ఛంకరం బుధః !

భస్మాప్రాప్తౌ మునిశ్రేష్ఠాః ప్రవృత్తే శివపూజనే !! 55

తస్మాన్మృదాపి కర్తవ్యం లలాటే చ త్రి పుండ్రకమ్‌ !! 56


ఇతి శ్రీ శివ మహాపురాణే ప్రధమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే పార్ధివ పూజన వర్ణనం నామైక వింశోsధ్యాయః (21)

ఈ విధముగా శివపూజను నిశ్శేషముగా శ్రద్ధతో చెప్పితిని. దేవకార్యమును "రాత్రియందు" ఎప్పుడైననూ ఉత్తరము వైపు కూర్చుండి మాత్రమే చేయవలెను భక్తుడు శుచియై, ఉత్తరాభిముఖుడుగనే శివుని అర్చించవలెను. శివలింగమునకు ఎదురుగా తూర్పునందు గాని, శక్తి ఉంéడే ఉత్తరభాగమునందు గాని , వెనుక పశ్చిమ మునందు గాని అర్చనకు కూర్చుండరాదు. కావున మిగిలిన దక్షిణము నందు కూర్చుండవలెను. భస్మ యొక్క త్రిపుండ్రము లేకుండా, రుద్రాక్షమాల లేకుండా, మారేడు దళములు లేకుండా విజ్ఞుడు శంకరుని అర్చించరాదు. ఓ ముని వరులారా! శివపూజ ఆరంభమైనప్పుడు భస్మ లభించనిచో, మట్టితో నైననూ లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను.

 శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో పార్థివ పూజన వర్ణనము అనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).


No comments:

Post a Comment