21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం.
వినాయకుడికి ఏయే పత్రాలతోపూజించాలి అన్న మీమాంసలో కొన్ని కొన్ని చోట్ల కొందరు కొందరు పెద్దలు కొన్ని సంప్రదాయాలలో చేసుకుంటున్న వ్రత విధానం ప్రకారం రెండు మూడు పత్రాలలో వ్యత్యాసం ఉంది. ఐతే మరి మేము ఏవి వాడాలి ఏపత్రాలతో పూజించాలి. ప్రముఖంగా తులసిపత్రంపైన ఈ సందేహం ఎక్కువ. శైవ సంప్రదాయస్తులు ఒకానొక పురాణోక్త మైన గణేశ తులసీ సంవాదాన్ని దృష్టిలో ఉంచుకొని తులసీ పత్రంతో పూజించరాదని చెప్తారు. కొందరు నేరేడు ఆకులతో పూజిస్తారు. ఔత్తరాహికులు కేతకీపత్రం అంటే మొగలి ఆకులతోపూజిస్తారు, అలాగే కొన్ని చోట్ల శ్వేత దూర్వ అంటే తెల్లగడ్డి, ఆగస్త్య పత్రం ఇలా వేర్వేరు పత్రాల మార్పులతో ఉంటుంది. ఉత్తరభారతంలోనూ చలి దేశాల్లోనూ దేవదారు దొరుకుతుంది మనకి లభ్యంలో ఉండదు.
అలాగే ప్రాంతాలవారీగా బీజాపూరఫలం ఇష్టమని గింజలు ఎక్కువగా ఉండే జామ, దోసపండు, దోసకాయ, చిట్టడవులదగ్గర ఉండే ప్రాంతం వారు పంపరపనాస, మాదీఫలం వంటివి కూడా వాడడం కద్దు. కొన్ని చోట్ల దొరికితే పనస కూడా నివేదిస్తారు. తెలుగులో కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, ఔత్తరాహికుల మోదకాలు ఇవన్నీ ప్రాంతాచారాలను బట్టి మారిన ఒకే వంటయొక్క రూపాలు
ఐతే ఇవన్నీ మన శ్రద్ధ ప్రకటించడానికే. పైగా ఏ కల్పంలోనూ 21పత్రాలు అంటే ఇవే అని రూఢి లేదు.
21 పత్రాలు
21 నామాలతో దూర్వాయుగ్మ పూజ
21 నేతి కుడుములతో (ఉండ్రాళ్ళ) నివేదన
//దైవీ గుణ సంపత్తి కలిగి 21 దోషాలను తొలగించి తద్వారా పాపఫలితాన్ని తీసి 21 రకాల నరకలోక బాధలను పడకుండా కాపాడమని. సాత్విక బుద్ధినిమ్మని, ప్రకృతి యెడల దైవీ భావనతో వ్యవహరిస్తామని, నివేదన బుద్ధితో వ్యవహరిస్తామని భగవంతుని దగ్గర చెప్పుకోవడమే ఈ 21 నామాలతో 21 దైవీ గుణ సంపత్తి కలిగిన పత్ర పూజ అంతరార్థం.//
పరంపరాగతంగా మీ ఇళ్ళలో మీ సంప్రదాయం ప్రకారం ఏయే పత్రాలతో పూజిస్తున్నారో వాటితోనే పూజించాలి. మీ ఇంటి ఆచారాన్ని వంశఆచారాన్ని అనుసరించి గతంలో మీపెద్దలు చేసిన విధంగా లేదా మీ ఇంటి పురోహితుడు సూచించిన విధంగా లేదా మీరు ఆశ్రయించిన స్వగురువు సూచన మేరకు ఆచరించాలి. ఇవేమీ మాకు తెలియదు అనుకుంటే, తేలిగ్గా స్కాంద పురాణాంతర్గతంగా వివరించి వ్రతకల్పంగా రూపొందించబడిన వ్రత విధానాన్ని వ్రతచూడామణి ఇత్యాది గ్రంథాలలో ప్రకటించారు దాని అనుసరించి చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద అల్లరి పడనవసరంలేదు, మన ఆచారంలోలేని ఇతర ప్రాంత, సంప్రదాయ విషయాలను మనవాటిలో జొప్పించుకోనవసరంలేదు. తండ్రి యైన శివుడు ఆచార ప్రియుడు అని శివపురాణం చెప్తుంటే కొడుకైన గణపతి అదే పరంపరాగతమైన మార్గంలో చరిస్తే ఆనందిస్తాడు, బావుందనో, అందంగా చెప్పబడిందనో మరోమార్గంలోకి మళ్ళడం మంచిది కాదు.
-శంకరకింకర
No comments:
Post a Comment