Pages

Thursday, November 8, 2012

మోహ ముద్గరం

సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం! నిర్మోహత్వే నిశ్చలతత్వం! నిశ్చలతత్వే జీవన్ముక్తిః
 అసలు జీవుడు దేనిని పట్టుకును దేని చుట్టూ తిరిగి తన జీవితంలో సాధింవలసినది సాధించలేకపోతున్నాడో దానిని జగద్గురువులు ఏనాడో చెప్పారు. గీతాచార్యుడు కూడా అదే చెప్పారు. మోహాన్ని వదిలించుకో అని. శంకరులు చెప్పిన ఈ పై వాక్యం కలిగిన స్తోత్రాన్ని "మోహ ముద్గరం" అని పిలిచారు పెద్దలు. మోహం మీద ఝుళిపించిన కొరడా అన్నమాట. ఆదిశంకరులే ఇతర విషయాల గురించి చెప్పినప్పుడు ఎప్పుడూ సౌమ్యంగా చెప్పీ.. ఈ మోహం గురించి ఎందుకు కొరడా ఝుళిపించాల్సివచ్చింది? అంటే మోహాన్ని అంత నిష్కర్షగా దూరం చేసుకోవాలన్నమాట. ప్రయత్న పూర్వకంగా.

నేటి కాలమాన స్థితుల దృష్ట్యా జీవితంలో ప్రతీక్షణం మోహావేశపూరితమైఉంటోంది. మోహాన్ని వదలగొట్టుకోవటం అంత సులభం కాదు, కానీ అంత కష్టతరమా... ఏమో... సాధన చేయాలి. సాధన సిద్ధించినవాళ్ళకే తెలుసు. చిన్నప్పట్నుంచి ఏదో ఒకదాని గూర్చి ఏడిచో, అరిచో, బ్రతిమాలో భయపెట్టో ఏదో ఒకటి చేసి తాననుక్కున్నది సాధించడం నేర్చుకున్న మనం ఇటువంటి విషయాలు ఎందుకు సాధించలేకున్నాం? అదో లక్ష వరహాల ప్రశ్న కాదేమో.. దాని సమాధానం కూడా మోహమే నేమో.

ప్రతి వ్యక్తి ఎప్పుడో చోట లౌల్యానికీ, మోహానికీ గురై ఎక్కిన మెట్లనుంచి జారుతూనే ఉన్నాడు. చిన్న పెద్ద తేడా ఏంలేదు. లౌకిక జీవనం గడుపుతూ కూడా ఆధ్యాత్మికతలో కాస్త సాధనలో పైస్థాయిలో చేరుకుంటున్నవారే ప్రతిదానికీ నాది-నేను-నాకు-నన్ను అంటూ మోహంలో పడడం చూస్తుంటాం. సాధారణ యాంత్రిక జీవనం సాగించే వారే కొద్దిగా నయమేమో, కనీసం వారికి వారి కుటుంబం, ఇల్లు, ఉద్యోగం తప్ప ఇతరాలపై ఇంత వ్యామోహం ఉండదు. (ఇది నా భావనే సుమా, తప్పై ఉండచ్చేమో తెలీదు...)

ఈ మోహం నన్నేం చేస్తోందంటే, సమస్త ప్రపంచాన్నీ నాతో ముడిపెడుతోంది, ప్రపంచ కర్తను దూరం చేస్తోంది. విశ్వంలో తిప్పుతూనే ఉంది, విశ్వనాథుణ్ణి తెలుసుకోవడానికి, పంచన చేరడానికి అడ్డుపడుతోంది. అసలు అటు ఆలోచనే లేకుండా నా ప్రపంచ వ్యాపారాలు నడిపిస్తోంది. వాడెవడో పిలవలేదని క్రోధానికి కారణమౌతోంది. పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి మావాడు మావాడు అని చంకలు గుద్దుకునేంత ఆప్యాయతను పెంచుతోంది. రెంటిలోనూ వాడెవడితోనే కట్టేస్తోంది. వాడెవడో తెగిడాడని పిసుక్కుపోతోంది వీడెవడో పొగిడాడని గీరెక్కుతోంది. ఓ పెద్దమనిషి నన్ను గుర్తిస్తే పెద్దమనిషంటోంది లేదంటే ఆఁ ఈ మధ్య వాడికి పొగరెక్కిందంటోంది. అసలు నాకెందుకివన్నీ నేను చేయాల్సింది చేసుకెళ్ళిపోతే పోలా అని ఏ కోశానా లేదు, అలా ఆలోచించట్లేదు... ఆలోచించనివ్వట్లేదు కర్తృత్వభావన ఏకోశానా కలగనీయట్లేదు, అంతా బాధ్యత, మోహం. ఏకాంతాన్నాశ్రయిస్తే వీడికి పొగరెక్కిందంటూ మారిపోయాడంటూ చుట్టూచేరినవారు, పరిచయస్తులు.

సదా మోహాటవ్యాం చరతి....ఈ మోహం ఒక అడవి అని శంకరులన్నట్లు, ఒక చోటనుండి ఇంకోచోటికి వెళ్ళినా అడవే... ఆ అడవిలోనే తిరుగుతోంది కాదు తిప్పుతోంది. దారి తెన్నూ కనపడనీదు, దిక్కులు తెలీవు, కాలం తెలీదు, గడవాల్సింది గడచిపోతోంది. ఎలా దీన్నుండి బయట పడడం...

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః!
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో!!

1 comment:

  1. నమస్తే
    మన గురువు గారి ప్రవచనాలు ఈ మోహ ముద్గరం (భజగోవిందం) పైన ఉన్నాయా. గురువు గారి సైట్ లొ ఉన్నవి 3 శ్లోకాలకి మాత్రమె ఉన్నాయి. మిగతావి ఎక్కడ దొరకవచ్చు? దయచేసి తెలియజేయ గలరు
    కే బి నారాయణ శర్మ

    ReplyDelete