Pages

Saturday, February 26, 2022

జగద్గురు పద నిర్వచనం - ఎవరు జగద్గురువులు? - విచారణ

 "జగద్గురు" పద నిర్వచనం - విచారణ

గురువు గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ (గురు గీత)

గు - అంధకారం

రు - దాన్ని నిరోధించగలిగినవారు, నివారణ చేయగలిగినవారు

అంధకార నివారణ, అనగా అజ్ఞాన నివారణ చేయగలిగేవారు గురువులు

 

చిన్నప్పుడు వచ్చీరాని మాటలు మాట్లాడినా, దాన్ని అక్షర రూపంలో వ్రాయడం నేర్పినవారు, అక్షర విషయకమైన అజ్ఞానాన్ని తొలగించిన వారు అక్షర గురువులు. అదేవిధంగా భాషా విషయమై అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి, పదాల కూర్పు, వాక్యాలు, వ్యాసాలు మొదలైనవీ, భాషకు సంబంధించిన నియమాలు, వ్యాకరణం నేర్పినవారు, భాషావిషయకమైన అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టినవారు భాషా గురువు. ఇదే విధంగా, మనకు సైన్సు, లెక్కలు, భూగోళ, ఖగోళ ఇత్యాది విషయాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాటిని నేర్పేవారు ఆయా విషయ గురువులను తెలియబడుతున్నారు.

ఉపనయనం, బ్రహ్మోపదేశం అయ్యిన తరవాత, మనకు వేదం తెలిసినవారు, ఎవరైతే వేదం తెలియనివానికి వేదం నేర్పిస్తున్నారో, అతను వేదగురువు ఔతున్నాడు. అలాగే ఆయా శాస్త్ర గురువులు ఇత్యాది. ఇలా వీరిదగ్గర బాగా నేర్చుకున్న వ్యక్తి మరొకరికి ఆయా విషయాల పట్ల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొడతాడు. అతను పరంపరలో ఇంకొక గురువుగా వస్తున్నాడు. మనకు తేలికగా అవగతమవడానికి, సామాన్య పరిభాషలో ఇదీ గురువుకు సంబంధించిన విషయం.

 

జగత్తు

మనకి జగత్తు రెండు విధాలను చెప్పబడింది

1) స్వాప్నిక జగత్తు - అవాస్తవమైనది. కలలో మాత్రమే కనిపించేది.

2) జాగ్రత్ జగత్తు - ఇది మన కంటికి కనపడేది ఇంద్రియాలతో తెలుస్తున్నది, మన మనసుకి అనుభవంలోకి వస్తున్నది.

మనమందరం ఈ జాగ్రత్ జగత్తులోని విషయాలని కళ్లతో చూస్తున్నాం, స్పర్శతో తెలుసుకుంటున్నాం మిగతా ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. మన మనసుకు కలిగిన అనుభవానికి విరుద్ధంగా ఇంకొకరు చెప్తే ఔనా అలాగా అని నమ్మడానికి లేదు. కానీ శాస్త్రం ఈ జాగ్రత్ జగత్తును కూడా అవాస్తవ జగత్తు అనే అంటుంది. దీనివల్ల మనకి సందేహం కలుగుతుంది. ఈ విషయాలను తెలుసుకోవడానికి మనకు తెలియపరచడానికి మనమొక గురువు దగ్గరకెళ్లాలి.

 

జగత్తులో కలుగుతున్న అనుభవానికి సంబంధించి సత్య విషయం, జగత్స్వభావం తెలుసుకోవడం, తత్సంబంధ అంధకారం తొలగించుకోవడానికిగానూ గురువును ఆశ్రయించాలి.

 

జగత్తులో ఉన్న ఒకే విషయంపట్ల మనకు ఒక్కొక్కరికీ ఒక్కొక్క అనుభవం కలగవచ్చు. భిన్న-భిన్నమైన, కొందరికొకలా మరికొందరికొ ఇంకొకలా  అనుభవాలు కలుగవచ్చు. ఉదా:- పౌర్ణమి చంద్రుడున్నాడు, అందరికీ జానెడే కనిపిస్తాడు, గుండ్రని అప్పడంలా కనిపిస్తాడు. మనకు కొద్ది దూరంలోనే ఉన్నట్లు కనిపిస్తాడు. అంతమాత్రాన నిజానికి చంద్రుడు అప్పడంరూపంలోనో, జానెడు పరిథిలోనో, మనకు కొద్ది దూరంలోనే ఉంటాడా? లేదు, చాలా పెద్దగా ఉంటాడు, లక్షల కి.మీ. దూరంగా ఉంటాడు.

భూమి మీదనుంచి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసే వ్యక్తికి అది ఓ చిన్న పక్షిరూపంలో కనిపిస్తుంది, దానియొక్క అసలు పరిమాణం మరుగునపడుతుంది. అదే ఆకాశంలో విమానంలో ఉన్న విమానంలోంచి క్రిందకు చూస్తున్న ప్రయాణీకునికి క్రింద ఉన్న ఇళ్ళు, మనుషులు చీమలు, క్రిముల పరిమాణంలో కనపడతాయి. నిజాకవేవీ సత్యం కాదు. విమానం చాలా పెద్దది, భూమి మీద ఉన్న మనుష్యులు, ఇళ్ళు-భవనాలపరిమాణం చీమలంత క్రిములంత కాదు.

 

దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే మనకు కలిగిన అటువంటి అనుభవాలన్నీ దుష్టమైనవే కానీ, నిర్దుష్టమైనవి కావు కదా.

 

ఆవిధంగా దుష్టమైన అనుభావలన్నీ సత్యం కావు అని తెలిసి జగత్తు యొక్క స్వభావం, తత్త్వం వాస్తవ స్వరూపం గురించి పూర్తిగా తెలిసినవాడు జగత్తుగురించి నిర్దుష్టంగా మనకు తెలుపగలడు.

 

మనకు ఒక నానుడి ఉన్నది "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా?" అని. జగములో ఉన్నవారంతా గుర్తుపట్టే బ్రాహ్మణునికి అని కాదు ఇక్కడ చెప్పింది, జగమంటే ఏమిటో దాని స్వభావమేమిటో పూర్తిగా తెలిసినవానికి జంధ్యం అవసరంలేదు అని. జంధ్యం అవసరంలేని బ్రాహ్మణుడెవరు అనే ప్రశ్నకు సమాధానం "సన్యాసి" అని. జగత్తుగురించి పూర్తిగా తెలియని వాడు జంధ్యం వేసుకుని సాధన చెస్తారు. కొందరు సన్యాసులైనా సరే, ఎందుకంటే వారికి జగత్స్వరూప స్వభావాలు సరిగ్గా పూర్తిగా తెలియవు కాబట్టి. నిర్దుష్టం, నిర్దోషం కాని జగత్తునందలి అనుభవాలను కూడా సత్యమే, వాస్తవమే అనుకునే సిద్ధాంతంలో ఉన్నవారికి జగత్తుయొక్క వాస్తవ స్వభావ, స్వరూప, తాత్త్విక విషయ జ్ఞానం అసంపూర్ణం, కాబట్టి వారు తద్విషయమై అజ్ఞానాన్ని తొలగజేయలేరు. వారికి జంధ్యం అవసరమే!

ఎవరు జగత్తు విషయమైన అజ్ఞానాన్ని పోగొడతారో వారే జగద్గురువులు

ఈ జగద్గురువులు అంటే ఎవరెవరు?

ఒక శరీరాన్ని, ఒక ఆకారంతో ఉన్నవారిని చూసి జగద్గురువులు అని అంటున్నాము. వారు బ్రహ్మాన్ని తెలుసుకుంటే అంటే తార్కికంగా ఐనా, అనుభవపూర్వకంగా ఐనా తెలుసుకున్న వారిని జగద్గురువులంటున్నాము.

ఐతే, మనకు భాగవతం 2వ స్కందం, 5వఅధ్యాయంలో బ్రహ్మ నారద సంవాదంలోని 10-12 శ్లోకాలలో జగద్గురు విషయం ఉన్నది.

నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః !

అవిజ్ఞాయ పరం మత్త ఏతావత్త్వం యతో హి మే !! 10

యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహమ్ !

యథార్కోఽగ్నిర్యథా సోమో యథర్‍క్షగ్రహ తారకాః !! 11

తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి !

యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుమ్!! 12

ఓ నారదా! వాస్తవముగా నన్ను గూర్చి నీవు సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు మొదలైన మాటలచే సంబోధించిన విషయం ఏదీ అసత్యం కాదు. ఎందుకంటే? నాకంటే అధికుడైన పరమాత్మ యొక్క తత్త్వమును గూర్చి తెలియనంతవరకూ "ఇదంతా నా ప్రభావమే" అని లోకంలోని వారికి అనిపించడం సహజము. యథార్థముగా ఈ సమస్త సృష్టికీ ఆపరమశక్తి స్వరూపుడగు పరమాత్మ శక్తియే కారణము.(10) నారదా! సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, తారాకలు, స్వయంప్రకాశమానుడైన ఆ భగవంతుని నుండి తేజస్సును పొందియే, ఈ జగత్తులో వెలుగులు నింపుచున్నవి. అదే విధంగా నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింపజేయబడీన జగత్తును మాత్రమే ప్రకటింపజేయుచున్నాను. (11) భగవంతునియొక్క దుర్జయమైన మాయచే మోహితులవడం వలననే లోకులు నన్ను చూచి జగద్గురువుగా పేర్కొనుచున్నారు. వాస్తవముగా ఆ శ్రీ కృష్ణుడే జగద్గురువు (కృష్ణం వందే జగద్గురుమ్) అటువంటి వాసుదేవ భగవానుని నేను నమస్కారపూర్వకముగా ధ్యానించుచున్నాను.(12)

ఈ విషయం ద్వారా మనకు సిద్ధమైనదేమంటే పరబ్రహ్మమునే జగద్గురువు అని చెప్పబడింది. ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నవారిని కూడా జగద్గురువు అని సంబోధించబడుతున్నారు.

జగద్గురువులు అంటే ఒక్కరే ఒక్కరు ఆ పరమాత్మయే! అప్పుడు మరి శంకరభగవత్పాదులు జగద్గురువులు కారా! అంటే? వేదాంత ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతం ప్రకారం  "బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఔతున్నాడు"

 

నేనే బ్రహ్మమును అని తెలుసుకోవడం అసలైన తెలుసుకోవడం అదీ అద్వైతం! అంతే తప్ప వేరెక్కడో ఉన్నది బ్రహ్మము అని తెలుసుకోవడం అసలు తెలుసుకోవడం కాదు.
అంటే "This is Bramham" అని కాదు, "I am Brahmam" అని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడం. ఆ విధమైన జ్ఞానమును తెలుసుకున్నవారూ బ్రహ్మమే, వారే జగద్గురువులుగా పిలువబడుతున్నారు.

 

ఐతే మరి ఎంతమంది జగద్గురువులు? అనాదిగా సదాశివుడు, నారాయణుడి నుంచి లెక్కకడితే ఇప్పటివరకూ ఎందరో జగద్గురువులు. వేలు లక్షలు. ఔనా ? కానీ ఈ లెక్క శరీరాలను , నామరూపాలను సూచించే లెక్కయే కదా! వీళ్ళు జగద్గురువులు, వాళ్ళు జగద్గురువులు ఎందరో జగద్గురువులు అని చెప్పేవారు శరీరాలను లెక్కపెడుతున్నారు తప్ప, బ్రహ్మమును చెప్పట్లేదు. బ్రహ్మము ఒక్కటే, అదే జగద్గురు తత్త్వం.

ఏ వ్యక్తి ఆ బ్రహ్మము తానే అనీ, ఈ జగత్తు అవాస్తవమనీ దాని తత్త్వ స్వరూపాది విషయకాన్ని తెలుసుకుని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత వాక్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడో అతనే జగద్గురువు.

 

ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారు చిన్నవయసులోనే ఉన్నప్పుడు ఉత్తరభారత యాత్ర చేశారు. ప్రయాగలో చాతుర్మాస్యం చేసి కాశీవైపు యాత్ర ప్రారంభించారు. కాశీలో పండితులు ప్రముఖులు రెండుగా విడిపోయారు, వారి ప్రకారం నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కంచిపీఠంలేదు కాబట్టి ఆహ్వానం, గౌరవ సత్కారం అవసరంలేదు అని కొందరభిప్రాయం. అప్పుడు కాశీరాజు సంకటంలో పడిపోయారు. ఏంచేయాలో తెలియలేదు, వచ్చినది సామాన్య యతి కాదు, పైగా కంచి కామకోటి పీఠాధీశ్వరులు. అప్పుడు కాశీరాజు ప్రయాగనుంచి వస్తూ వింధ్యాచలంలో బస చేసిన పరమాచార్య స్వామి వారి వద్దకు సాదరంగా వెళ్ళి, మేముండేది వ్యాసకాశీలో, కాబట్టి ఉత్తరకాశీపండితుల విషయం పక్కనపెట్టి, పీఠంతో , పరివారంతో సహా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని విజ్ఞప్తి చేసారు. అపుడు స్వామివారు ఉత్తరకాశీ పండితులు వచ్చి మమ్మల్ని జగద్గురువులు అని నిర్ణయిస్తే మేము కాశీ వస్తాము. లేదా విశ్వేశ్వరునికి ఇక్కణ్ణుంచే నమస్కారం చేసి వెళ్ళిపోతాము అని తెలిపారు. అప్పుడు ఉత్తరకాశీ నుంచి వచ్చిన పండిత బృందం స్వామివారిని " మీరు జగద్గురువులు ఎలా ఔతారు, మీకు జగత్తంతా తెలుసా?" అని ప్రశ్న వేసారు. అప్పుడు స్వామి వారు ఎవరు జగద్గురువో వారు జగత్తునుండి అన్నీ తెలుసుకుంటారు. అని భాగవతంలోని అనేక ఘట్టాలను, దత్తాత్రేయ స్వామి వారు జగత్తులోని అనేక విషయాల ద్వారా వారు నేర్చుకున్నవిషయాలను చూపారు.

 

మన ఇంట్లో చెత్త ఊడ్చి బైట పారేస్తే (పూర్వకాలంలో, ఇప్పటికీ పల్లెల్లో) కోడి వెళ్ళి చెత్తను తనకాళ్లతొ లాగేసి, తనక్కావలసిన గింజలో, ఏ ఆహారమో మాత్రమే ముక్కుతో పొడిచి తింటుంది. మన ఉంగరంలోంచి వజ్రం ముక్క పడిపోయి అది చెత్తతో పాటు బైట పారవేయబడ్డా, చెత్తలో ఆహారం ఏరుకునే కోడి మాత్రం దాన్ని వజ్రం ముక్క చాలావిలువైనది అని దాచదు, మిగిలిన చెత్తతో సమానంగానే కాళ్లతో జరిపేసి తనకి కావలసినది మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది. ఇలా జగత్తునుంచి తెలుసుకొనే విషయాలనేకం.ఆతరవాత ఎంతో సంతోషంతో ఉత్తరకాశీ పండితులంతా కలిసి జగద్గురువు అని నిర్ణయించి వారిని సాదరంగా కాశీకి ఆహ్వానించి, స్వాగత సత్కారాలు ఉత్సవాలు చెసారు.

 

జగత్తులో ఉన్న తాత్విక విషయం తెలుసుకొని, జగద్విషయకమైన అజ్ఞానము, అంధకారాన్ని పోగొట్టేటువంటి వారే జగద్గురువులు.

 

ఇంతమంది జగద్గురువుల శరీరాలు వేరైనా, లెక్కపెట్టగలిగినా పరమాత్మ తత్త్వం ఒక్కటే జగద్గురుత్వం, జగద్గురుతత్త్వం ఒక్కటే!

 

మన ఇంట్లో కిచెన్, హాలు, బెడ్రూమ్, పూజారూమ్, స్టోర్ రూమ్ అన్నీ ఉన్నాయ్ అన్నిరూములూ వేరే ఆయా గదులకోసం కట్టిన గోడలవల్ల ఆయా గదుల్లో ఉండే స్పేస్/ఆకాశం వేరుగా కనపడుతోంది. అదే పూజారూమ్ చిన్నగా ఉన్నదని గోడ బద్దలుకొట్టి స్టోర్ రూమ్ పూజారూం కలిపేస్తే ఇప్పుడున్నది ఒకటే గది, ఒకటే ఆకాశం. "ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః" గమనిస్తే గురు తత్త్వం ఒక్కటే, కానీ గురువు శరీరాన్నిచూసి ఆ శరీరమే గురువు అని అనుకోవడం కాదు, గురువు అనేది ఒక తత్త్వం. తత్త్వానికి ఆకారం లేదు, ఉండదు. అందుకొరకు ఆకారానికి, ఆ శరీరానికి పూజ, గౌరవం. గురువు ఆకాశం వలె సర్వ వ్యాపకుడు అతనికి శరీరం ఒక ప్రతీక.

 

ఏ విషయమైన అజ్ఞాన్ని పోగొడితే ఆవిషయానికి గురువు అని అన్నట్లు, రామాయణం చెప్ఫేవారిని రామాయణ గురువు, భాగవతం చెప్పేవారిని భాగవత గురువు, పురాణం చెప్పేవారిని పురాణ గురువు అని అంటున్నాం. దానర్థం వాళ్ళు రామాయణానికంతటికీ గురువు , లేదా భాగవతానికంతటికీ గురువు, లేదా పురాణాలన్నిటికీ గురువు అని కాదు. రామాయణానికి సంబంధించిన అజ్ఞానాన్ని, భాగవతానికి సంబంధించిన అజ్ఞానాన్ని, పురాణాలకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగతేసే గురువులు అని అర్థం.

 

అదే విధంగా ఈ జగత్తు విషయకమైన అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి దాని స్వభావాన్ని బోధించి సత్యం తెలియజేసే గురువే "జగద్గురువు". జగత్తు యొక్క అసలు స్వరూపాన్ని యెరిగి, తానే బ్రహ్మమైయున్నాననే సత్యాన్ని తెలుసుకున్న అటువంటి గురువులందరకూ ప్రతీకగా శంకరులు ఆయా పీఠాల్లో పీఠాధిపతులను జగద్గురువులుగా ప్రతిష్ఠించే వ్యవస్థను ఏర్పరచారు.

 

-శంకరకింకరః

(శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్)

------------

గురువుల అమృతమయమైన అనుగ్రహంతో జగద్గురు శబ్దానికి సంబంధించిన విషయ, విచారణ పూర్వకమైన ఈ వ్యాసం ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసమందు ఏవైనా తప్పులు, దోషాలుంటే సూచించ ప్రార్థన.

----------------