Pages

Friday, September 28, 2018

శంబుక వధ (శంబూక వధ) ప్రామాణికత విచారణ


శ్రీ గురుభ్యోనమః

శ్రీరాముడు శంబుకుణ్ణి వధించాడా? అది ప్రక్షిప్తమా లేక నిజమా ? అసలు త్రేతాయుగంలో శ్రీరామాయణ కాలంలో శూద్రులు తపస్సు చేయుట నింద్యమా లేక శ్రీరాముని ప్రాభవాన్ని తగ్గించడానికి జరిగిన సాహిత్య సంకరంలో భాగమా? ఎవరికి వారు ఈ విశేషాలను చదువుకొని శ్రీ రామాయణం సాంతం చదివి వాల్మీకి హృదయాన్ని, శ్రీరాముని నడతను పరిశీలించి తెలుసుకోదగును.


శ్రీ రామాయణం అయోధ్య కాండ 63-64 సర్గలు

దశరథుని వలన పొరపాటున మరణించిన మునికుమారుడు (శ్రవణ కుమారుడు)

కడవలో నీటిని నింపుతున్నది ముని బాలకుడని తెలియక ఏనుగు నీరు తాగుతున్నదనుకొని చూడకుండా శబ్దబేధి ద్వారా బాణాన్ని దశరథుడు సంధిస్తాడు. దశరథుడు వేసిన బాణము ఆ ముని బాలకుని శరీరంలో దిగి ప్రాణములను పోనీయక అడ్డుపడి భయంకరమైన వ్యథకు గురిచేయుచుండగా, ఆ ముని బాలకుడు దశరథుని ఈ బాణం ములుకు మర్మావయవములు బాధించుచు ప్రాణము పోకుండా అడ్డు పడుతున్నది కాబట్టి బాణం తీసి వేయమని కోరతాడు. బాణం తీస్తే మునిబాలకుడు చనిపోతాడు తీయకపోతే బాధతో విలవిలలాడతున్నాడు పైగా తాపసి, ముని బాలకుడు అని సంశయిస్తూ దుఃఖిస్తుండగా, అతి కష్టంమీద మరణమంచున నున్న ఆ ముని బాలకుడు బలాన్ని ప్రొది చేసుకొని ఇలా చెప్తాడు.

సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్,
బ్రహ్మ హత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్

నద్విజాతిరహం రాజన్ మా భూత్తే మనసో వ్యథా,
శూద్రాయామాస్మి వైశ్యేన జాతో జనపదాధిప!

నేను ధైర్యముతో మృత్యు శోకాన్ని  దిగమింగి అణగద్రొక్కి స్థిరచిత్తుడనౌతున్నాను. నీవు బ్రహ్మహత్యాపాతకము చేసానేమో అని భయపడకుము.  ఓ రాజా! నేను ద్విజుడను కాను, నీవు మనస్సులో బాధపడకు. నేను శూద్రస్త్రీయందు జన్మించిన వాడను. కాబట్టి ఈ బాణముని తొలగించి నాబాధను తీర్చు అని చెప్తాడు. అప్పుడు దశరథుడు ఆ బాణం ములుకు తీయగా ఆ తపోధనుడైన మునిబాలకుడు దశరథుని వైపు చూస్తూ ప్రాణాలు విడుస్తాడు.

ఆ విషయం దశరథుడు వెళ్ళి ఆ ముని బాలకుల తల్లిదండ్రులకి విన్నవించి మన్నింపు కోరి ఏం చేయాలో ఆజ్ఞాపించమని అడుగుతాడు. అప్పుడు ఆమునీశ్వరుడి మాటలు..

సప్తధా తు ఫలేన్మూర్థా మునౌ తపసి తిష్ఠతి,
జ్ఞానాద్విసృజతః శస్త్రం తాదృశే బ్రహ్మచారిణే!

తపస్సులోనున్న మునిపైగాని, అట్టి బ్రహ్మచారిపైగాని తెలిసి ఆయుధాన్ని ప్రయోగించినవాని శిరస్సు ఏడుముక్కలౌతుంది.  నువ్వు తెలియక చేసావు కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నావు. లేకపోతే నువ్వేమిటి నీ ఇక్ష్వాకు వంశమే నశించేది. ఆ తరవాత ఆ మునిబాలకుడు (నద్విజుడు) బ్రతికుండగా తల్లిదండ్రులకు అగ్నికార్యములో సహకరించుట, వేదవాఙ్మయము పారాయణ చేసి వినిపించుట, తపస్సుకు సహకరించుట ఇట్లా అన్ని విషయాలు ఆ తాపసి జంట  వివరించి, దశరథునిపై కోపగించి పుత్రశోకంతోనే మరణిస్తావని శాపమిస్తారు. ఇక్కడ ఆ తాపసి జంట అంటే వైశ్య పురుషుడు, శూద్ర స్త్రీ ఇద్దరూ తపస్సు చేస్తున్నవారే.

---------------
దీన్నిబట్టి ఆకాలంలో శూద్రులే కాదు, స్త్రీలూ, శూద్ర స్త్రీలు, వర్ణసంకరమున జనించినవారు కూడా ముని వృత్తినవలింబించారనీ, తాపసులైనారనీ తెలుస్తున్నది. ఆ కాలంలో శూద్రులకు తపస్సు లేదన్న విషయము ప్రక్షిప్తము, పైగా తాపసిని తెలిసి తెలిసి సంహరిస్తే లేదా ఆయుధమెత్తితే తల ఏడు ముక్కలౌతుందని స్పష్టంగా చెప్పబడింది. అంతే కాదు తెలిసి తెలిసి అలాంటి పని చేస్తే తానేకాదు వంశం మొత్తం నాశనమౌతుందని తాపసి వాక్కు.

తన తండ్రికాలంలోనే అలా జరిగిన సందర్భమున్న సమయంలో అటువంటి ముని శ్రేష్టులు నివసిస్తున్న రాజ్యంలో రాముడు ఇలాంటి అకృత్యానికి ఒడిగడతాడా? బ్రాహ్మణులు,  రాజ గురువులకు ఆ కాలంలో ఇలా అందరూ తపస్సు చేసుకుంటూండేవారన్న ఈ విషయం తెలియదనుకోగలమా. అప్పుడు సమాజం కలిసే ఉంది అందరూ చక్కగా ధర్మవర్తనంతో నాలుగు వర్ణాల ధర్మాలనూ, నాలుగు ఆశ్రమ ధర్మాలనూ పాటించేవారు. తాపసులజోలికెవరూ వెళ్ళేవారు కారు. వారికుచితమైన గౌరవమున్నది.

స్వయం రాముడే అరణ్యకాండలో తాపసులకి రక్షణగా ఉండి వారినిబ్బందిపెట్టేవారిని దునుమాడుతానని ప్రతిజ్ఞచేసాడు. అలాంటి వాడు ఒక తాపసిని హతమార్చడం అసంభవం. నిజంగా హతమార్చి ఉంటే, ఆ ఘట్టంలోనే, దశరథుని చేతిలో హతమైన ముని కుమారుని తల్లిదండ్రులగు తాపసుల మాటల ప్రమాణంగా శ్రీరాముని తల ముక్కలయ్యేది ఇక్ష్వాకు వంశం నశించేది (శ్రీ రామా భద్రం తే!)

ఇక అరణ్యకాండ చూద్దాం... ‍6, 9 &10 సర్గలు

దణ్డకారణ్యంలో మునులు తమను రాక్షసుల బారినుండి రక్షించమని కోరితే, తాపసులు ఆజ్ఞాపించవలెను కానీ కోరకూడదు, తాపసులను ఇబ్బంది పెట్టే రాక్షసులను నేనూ నా తమ్ముడూ సంహరించి వారిని కాపాడెదము అని ప్రమాణం చేస్తాడు (6)

సీతమ్మ రామునితో నీ ఇంద్రియాలు నీ అధీనంలోనే ఉన్నవి అని తెలుసు, కానీ ఏ వైరమూ లేకుండానే దణ్డకారణ్యంలో ఉన్న ఋషుల రక్షణ కొరకై వారినిబ్బందిపెట్టురాక్షసులను మనకు ప్రత్యక్షంగా ఏ అపకారమూ చేయకున్నా దునుముతానని ప్రతిజ్ఞ చేసావు అని తన బెంగను వ్యక్త పరుస్తుంది. (9) 

అప్పుడు శ్రీరాముడు తాను దండకారణ్యములోని ఋషులకి ఇచ్చిన మాటను చెప్పి, నేను ఇక్కడి తాపసులను నాపాలనలో రక్షించి తీరుతాను దీనికి వ్యతిరేకంగా చేయలేను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ ఇచ్చిన మాటకే కట్టుబడి తాపసులను రక్షిస్తాను తప్ప దానికి వ్యతిరేకంగా ప్రవర్తించను.

సీతా! విను, 
తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్, 
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః. 
ఋషులు, తాపసులు అడగకపోయినా వారిని రక్షించి పరిపాలనము చేయవలెను, ఇక ప్రతిజ్ఞ చేసిన నేను అందుకు వ్యతిరిక్తముగా చేయగలనా అని పలుకుతాడు. (10)
(శంకరకింకర)

సరే, మరో దృష్టాంతం చూద్దాం, అరణ్యకాండలోనే 73, 74 సర్గలు

కబంధుడు మతంగముని ఆశ్రమము గురించి చెప్పుచూ అందరూ ఊర్ధ్వలోకాలకేగారు వాళ్ళ పరిచారిణి, శ్రమణి (సన్యాసిని, తపస్విని) ఐన శబరి నీకు ఆతిథ్యమివ్వగలదు అని చెప్తాడు. శాబర జాతికి చెందిన స్త్రీ మతంగ మునిని,  సేవించి ఆయన పరివారంతో కలిసి తపస్సు చేసి సిద్ధిపొందుటకు శ్రీ రాముని దర్శనానికై ఎదురుచూస్తుంటుంది. శ్రీరాముడు,  శబరిని కలిసినప్పుడు, ఆతిథ్యం స్వీకరించిన సమయంలో వారి సంభాషణ చూద్దాం!

పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి,
తామువాచ తతో రామః శ్రమణీం సంశితవ్రతామ్!
కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః,
కచ్చిత్తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే!
కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖమ్,
కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి!!

శబరి ఇచ్చిన పాద్యాచమనాదులు యథాశాస్త్రంగా స్వీకరించిన తరవాత, రాముడు తీవ్రమైన వ్రతనియములు పాటించుచూ, "తపస్సు చేయుచున్న ఆ తపస్విని", సన్యాసిని ఐన  శబరి (శాబర స్త్రీ) తో మాట్లాడుతూ " ఓ తాపసురాలా!  నీ తపస్సునకు విఘ్నములేవీ కలుగుటలేవు కదా? నీ తపస్సు వృద్ధి పొందుతున్నదా? నీవు క్రోధమును నిగ్రహించుకొన్నావు కదా? ఆహార నియమాదులందు కూడా నిగ్రహము పొందినావు కదా? చక్కగా మాట్లాడే ఓ శబరీ! నీవు కృచ్చచాంద్రాయణాది నియమములన్నీ పూర్తి చేసుకొన్నావా? నీ మనస్సుకు సుఖము కలిగినదా? నీవు చేసిన గురు శుశ్రూష సఫలమైందా?" అని అడగగా ప్రత్యుత్తరము ఇస్తూన శబరి మాటలు శబరి గురించి మూలంలో ఇలా ఉన్నవి...

రామేణ తాపసీ పృష్టా సా సిద్ధా సిద్ధసంమతా
శశంస శబరీ వృద్ధా రామాయ ప్రత్యవస్థితా!
అద్య ప్రాప్తా తపఃసిద్ధిస్తవ సందర్శనాన్మయా
అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః!

తపస్సంపన్నురాలు, తపస్సిద్ధి పొందినది , తపస్సిద్ధిసంపన్నుల గౌరవము పొందినది, వృద్ధురాలు ఐన ఆ శాబర స్త్రీ రాముని మాటలు విని అతని ముందు నిల్చొని,  ఈనాడు నేను చేసిన తపస్సు సిద్ధిపొందినది, నేను చేసిన గురు శుశ్రూష కూడా సఫలములైనవి అని బదులిస్తుంది.

------------

సత్యవాక్పాలకుడైన శ్రీరాముడు, దణ్డకారణ్యంలో ఉండే అందరు ఋషులు తాపసులను రక్షిస్తానని, వారడగకుండానే వారిని రక్షించవలెనని కానీ ప్రతిజ్ఞాబద్ధుడైనందున తాపసులను రక్షించుట అను విషయమునుండి వెనుకకు మరలననీ రాముడు ఒకటీకి రెండూమాట్లు చెప్తాడు అది రాముని స్వభావం.

అలానే, అరణ్య కాండ చివర్లో మతంగముని ఆశ్రమంలో ఉండే సేవకురాలు, శాబరజాతి స్త్రీ ఐన శబరి సన్యాసియై తాపసియై గురుశుశ్రూష చేసి, తోటి తపస్వులచేత కలిసి ఎన్నియో వ్రతములు, తపస్సులు చేసి సిద్ధిపొందినది, ఆమె క్షేమమును, ఆమె తపస్సిద్ధిని విచారించి ఆతిథ్యం స్వీకరించిన శ్రీ రాముడు తపస్సు కొన్ని వర్ణాలవారికే పరిమితము కొన్ని వర్ణాలవారు తపస్సు చేయరాదు అను నిర్ణయమును అంగీకరించి అమలు పరచునా? లేక మతంగ ముని మరియు ఆయన ఆశ్రమములో ఉండు ఇతర మహర్షులందరూ దణ్డకారణ్యములో ఇతర ఋషులు కొన్ని వర్ణాలవారే తపస్సు చేయవలెనని నిర్ణయించగలరా. నిర్ణయించిన శబరి ఆసమయములో తపస్వినియై శ్రమణియై ఎట్లు జీవనము కొనసాగించగలదు?


ఈ విషయములు విచారణ చేస్తే, శ్రీ రాముడు తరువాతి కాలంలో దణ్డకారణ్యంలో చెట్టుకు వేలాడి తపస్సు చేస్తున్న తాపసిని ఖడ్గ ప్రహారం చేసి చంపెను అని అనడం కానీ, తమను రాక్షసులనుండి రక్షించమని కోరుకున్న బ్రహ్మర్షియైన వశిష్ఠుడు, ఇతర ఋషులు, బ్రాహ్మణులు మరొక తాపసిని చంపమని చెప్పడం కానీ కుదిరే పనేనా?  దాన్ని రాముడంగీకరించునా.  రామాయణాన్ని చిన్నబుచ్చితే, రాముణ్ణి చిన్నబుచ్చితే బ్రాహ్మణులను, బ్రాహ్మణ్యాన్ని చిన్నబుచ్చడమనే సంకుచిత భావంతో రామాయణ ద్వేషంతో , వైదిక ధర్మ ద్వేషంతో చేర్చిన ప్రక్షిప్త గాథ అని తెలియడంలేదూ! అదేదో బ్రాహ్మణులు రాముణ్ణి నిలదీసినట్లూ, అదీ తాపసి, బ్రహ్మర్షివశిష్ఠుడు ,  ఒక శూద్రుడు తపస్సు చేస్తుంటే చంపమంటాడా? ఇది బ్రాహ్మణులకు, ఋషులకు అంటగట్టి, ఆపై శ్రీరాముడిచేత చంపించారు అని ప్రక్షిప్తం చేసి రామాయణం మీద, రాముడిమీద, బ్రాహ్మణవర్ణం మీద సనాతన ధర్మం మీద విషం కక్కడం ఎంత అమానుషం, ఎంత అవివేకం.

శ్రీ రామ జయం
బలం విష్ణోః ప్రవర్థతామ్ (౩)

(శంకరకింకర)