Pages

Saturday, April 8, 2017

ధర్మం విషయంలో మూడు రకాల ప్రవర్తనలు

శ్రీ గురుభ్యోనమః
 
ధర్మం గురించి మూడు రకాల వ్యక్తుల గురించి వారి పరిస్థితి గురించి రామాయణం నుండి.
 
దశకంఠుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు, తపస్సంపన్నులు, సాక్షాత్ బ్రహ్మ వంశస్థులు. ధర్మం విషయంలో ముగ్గురూ మూడు రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. దాని వలన ఎవరేం ఫలితం  పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా...!
 
ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ఆచరించడు :-
1] దశకంఠుడు (రావణుడు) - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు. ఎవరైనా తనకు ధర్మబోధ చేసినా వినడు, సహించడు తనకు నచ్చినట్లుగా ఉండడమే ధర్మం అని బుకాయిస్తాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, కానీ ఆచరించడు :-
2] కుంభకర్ణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు, అధర్మం ఐనా సరే అన్నకోసం చేసేస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని కోపంతో ధర్మబోధ చేసాడు, కానీ అన్నకోసం అధర్మం వైపే ఉన్నాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు:-
3] విభీషణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరిస్తాడు, భూతదయఉన్నవాడు, అధర్మం ఐతే అన్నైనా సరే విభేధిస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని ధర్మబోధ చేసాడు. మహాశక్తివంతుడు మహైశ్వర్యవంతుడైన రావణుణ్ణి ఎదిరించి, వానరాలతో వచ్చిన సాధారణ మానవుడు శ్రీరాముని శరణు జొచ్చాడు. ఐశ్వర్యమూ, బలమూ ఎక్కడ ఉన్నదో అని కాదు ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. రామునికి ప్రాణ మిత్రుడైయ్యాడు.
 
-శంకరకింకర


Friday, April 7, 2017

తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

శ్రీ గురుభ్యోనమః


...నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

ఫేస్ బుక్లోనూ, వాట్సప్లోనూ ఒక రావణుడికి సంబంధించి ఒక కథ చక్కర్లు కొడుతోంది. యుద్ధరంగంలో పడిఉన్న రావణుడు రాముణ్ణి పిలిచి నేను నీకన్నా అన్నింట్లోనూ గొప్ప కానీ నీ చేతిలో ఎందుకు ఓడి చనిపోయాడని అడుగుతాడట (ఇలా రామాయణంలో లేదు, రాముడు కొట్టిన బ్రహ్మాస్త్రానికి రక్తం కక్కుకుని మాట్లాడకుండా కుక్కిన పేనులా చచ్చాడు మరి.) అప్పుడు రాముడంటాట్ట నా తమ్ముళ్ళు నాదగ్గరే ఉన్నారు నీ తమ్ముడు నీదగ్గరలేడు అని. అందుకే నువ్వు చచ్చిపోయావ్ నాచేతిలో అని. అంటే సీతమ్మని అపహరించినందుకూ, దేవ మనుష్యాదులను అందరినీ హింసించి అధర్మ కార్యాలు చేసి పాపం మూటగట్టుకున్నందుకూ కాదుట. తమ్ముడు పక్కనలేడు కాబట్టి చచ్చిపోయాట్ట.



నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు అన్న సూక్ష్మమైన విషయాన్ని పైన పోస్ట్ చేయబడ్డ కథనం రచించిన రచయిత మరిచాడు. అన్నదమ్ములతో కలిసుండండం శ్రేయోదాయకమే, కానీ అలా కలిసి ఉండీ కూడా ధార్మికమైన జీవితంలో లేకుండా ఉంటే 100 మంది అన్నదమ్ములైనా (కౌరవులు) మడిసిపోయారు. అర్థాత్, దీనిలో ఉన్న కీలకం ఏంటంటే! కేవలం అన్నదమ్ములు కలిసి ఉండడమే కాదు, అ అన్నదమ్ములు ధర్మంతో కలిసి ఉండడం ముఖ్యం. అదీ ఇతిహాసం కానీ, పురాణం కానీ 14 ధర్మ స్థానాలు కానీ చెప్పేవి.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం!
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!

అందంగా ఉందని అబద్ధాలు కలిపించి చెప్పకూడదు. సత్యమే సనాతనమైన ధర్మము. ఆ సత్యమే భగవత్స్వరూపము. ఆ భగవంతుని విషయంలోనే అసత్య ప్రచారం చేయకూడదు.

పురాణేతిహాసాలను ప్రక్షిప్తం చేసి వాని పవిత్రతను పాడుచేసే అధికారం మనకు లేదు. మనకు ఎంత స్వచ్చంగా పురాణేతి హాసాలివ్వబడ్డాయో అంతే స్వచ్చంగా రాబోవు తరాలకు మనం అందించాలి. పురాణేతిహాసాలపై, పౌరాణిక పాత్రలపై తప్పుడు రచనలు చేయకూడదు.
స్వస్తి"

-శంకరకింకర