Pages

Monday, March 5, 2012

బొట్టు

శ్రీ గురుభ్యోన్నమః
 
నమస్తే
బొట్టు పెట్టుకోవడం
బొట్టుపెట్టుకోవడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. బొట్టు పెట్టుకుని ఉన్న వ్యక్తియొక్క ముఖవర్చస్సు ముఖంలో కళ వేరు. అంతర్జాలంలో ఒక ఘన పండితుడు వ్రాసిన సందేశం చూసాను, ఆయన ఎవరో ఒకరిద్దరు కార్య కర్తలు బొట్టు పెట్టుకోమన్నందుకు తిరిగి వారికి తత్త్వోపదేశాలు వేదాంతం, షడంగాలు, మహర్షులు, సంస్కృతం పాండిత్యం వగైరాల గురించి లెక్చర్ ఇచ్చి పిచ్చుకలమీద బ్రహ్మాస్త్రంలాగా వేసి అదేదో ఘనకార్యంలా ఆ కథను చెప్పుకుంటూ హిందుత్వానికీ (సనాతన ధర్మానికి) బొట్టుపెట్టుకోవడానికీ సంబంధం లేదన్నంతగా తీర్మానం చేసేశారు.
అసలు బొట్టెందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకుంటేనే హిందువా? ఐతే ఏ బొట్టు అడ్డమా నిలువా వగైరా వితండ వాద ప్రశ్నలు కోకొల్లలు. పైగా దానికి తోడు శుశ్కమొకటి. మాకంతా తెల్సు మేం చాలా క్లెవర్, బొట్టు పెట్టుకోవడం పెద్దగొప్పా అని.
 
సనాతన ధర్మానికి ఆయువుపట్టైన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడన్నదానికి గుర్తుగా భ్రూమధ్యంలో బొట్టుపెట్టుకుంటారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం అంటే, కర్మ ఫలాన్ని, దాన్ని అనుభవించడాన్నీ, దానిని ఇచ్చేవాడొకడున్నాడన్న సత్యాన్ని,  ఇత్యాది విషయాలున్న సనాతన ధర్మాన్ని అవి ప్రతిపాదిస్తున్నవేదాలను నమ్ముతున్నామనీ, ఆ సనాతన ధర్మంలో చరిస్తున్నామనీ గుర్తే బొట్టు పెట్టుకోవడం. సనాతన ధర్మపు సార్వభౌమికం మనిషి పెట్టుకునే బొట్టులోనూ, దేవాలయ ధ్వజస్థంభంలోనూ, ఇత్యాది ఇతరములలోనూ ఉంది. ఒక దేశ సార్వభౌమత్వం ఆదేశ పతాకంలో ఆదేశపు చిహ్నంలో ఉన్నట్టే సనాతన ధర్మంలో చరిస్తున్న వారు వారి ధర్మం యొక్క సార్వభౌమ చిహ్నంగా బొట్టు ధరిస్తారు. బొట్టు పెట్టుకోవడమే అంత నామోషీ ఐతే అదే స్థానంలో వేడి కురుపో, లేక ఏ పురుగో కుట్టి పుండై మచ్చైతే ఏం చేస్తారో మరి?
 
ఇక ఏది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి? అది ప్రశ్నేకాదు, తప్పించుకోడానికి, వివాదం చేయడానికి, వారికి వారు తెలివిగలవారనిపించుకోడానికి తెలివిగా అడుగుతున్నామనుక్కుని మూర్ఖంగా అడిగే ప్రశ్న అది. బొట్టులావాడడానికి కుంకుమ, చందనం, విభూతి, కస్తూరి ఇత్యాది పదార్థాలను శాస్త్రం నిర్దేశించింది, వాటినే వాడాలి. నుదురు మీద ఏ నామాలైనా నీ మతమును (షాణ్మతములగురించే మాట్లాడుతున్నాను సుమా) అనుసరించి, అడ్డనామాలో, నిలువు నామాలో పెట్టుకో కానీ బొట్టు మాత్రం భ్రూమధ్యంలోనే పెట్టుకోవాలి. బొట్టు భ్రూమధ్యంలోనే ఆజ్ఙా చక్రం మీద పెట్టుకోవాలి అన్నప్పుడు ఏది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్న ప్రశ్న మూర్ఖపు ప్రశ్న (నిజంగా తెలియని వారు అడగడంలో తప్పు ఏమాత్రమూ లేదు) బొట్టు అన్ని రకాల నామాలు పెట్టుకునేవారూ పెట్టుకుంటారు, పెట్టుకోవాలి. దీనిని సాకుగా చూపి బొట్టుపెట్టుకోనివాడు సనాతన ధర్మంలో ఉన్నానని చెప్పి, ఎన్ని శాస్త్రాలు చదివినా వేదాలు నేర్చినా ఏం లాభం. ఆచరణ లేని విద్య ఎందుకు నాలిక గీసుకోడానికి కూడా పనికిరాదు, పైన చెప్పినట్టు ఏదో కొద్ది ఆసక్తితో సనాతన ధర్మంలో చరిస్తూ కనీసం బొట్టు పెట్టుకుని ఉండాలన్న ఇంగితముండి పెట్టుకోని వాణ్ణి బొట్టుపెట్టుకోమన్నవారే నయం. అన్ని తెలుసుకునీ తెలియని వారిమీద సెటైర్లు వేసి తెలివైనవాణ్ణనే ఫోజు కొట్టటం ఎందుకు? ఎవరిని ఉద్ధరించటానికి? క్రింది వారిని ఉద్దరించే ముందు అన్ని తెలుసుకునీ మనమేం ఉద్దరించామో తెలుసుకోవటం ఉత్తమ లక్షణం. లేకపోతే, అన్నీ చదివి, తెలిసుకుని ఆచరించని రావణుడు చేసిన పనుల్లానే ఉంటాయి.
 
బొట్టుపెట్టుకోమన్నందుకు అకృత్యం చేయమన్నవాళ్ళని కడిగేసినట్టు, ఉన్న పాండిత్యంతో హడావుడి చేసి వారిని బెదరగొట్టింది చాలక, ఇలా చేసానన్న ప్రచారం గొప్ప దేనికోసమో?
 
బొట్టు పెట్టుకోనివాడు సనాతన ధర్మంలో ఉన్నానని చెప్పటానికీ, అందులోని వేదా, వేదాంగ శాస్త్ర పరిజ్ఙానం సంపాదించుకోడానికీ అనర్హుడు. ఒక దేశంలో ఉండి ఆదేశ పతాకాన్ని గౌరవించనివాడితో లెక్క.
 
కాస్త ఆవేశం పాలు ఎక్కువైనట్టుంది కానీ, తెలిసినవాడే తప్పుచేస్తుంటే చెప్పవలసి వచ్చినప్పుడు నిష్కర్షగా ఖండిస్తూ చెప్పాలి. లేకపోతే మనం తెలుసుకుని ఏం లాభం. అదే తెలియని వారికైతే చక్కగా అందంగా బోధించాలి కదా!!! శాస్త్ర పరిజ్ఙానం తక్కువైనా సనాతన ధర్మంలో (రాజకీయ వర్గీకరణలో హిందూ మతం) చరించే వారు, ఇది చదివినవారు తప్పక బొట్టు పెట్టుకుంటారని ఆశిస్తూ, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అని అడిగేవారికి కూడా చెప్తూ ఉంటారని ఆశిస్తూ..