Pages

Thursday, July 14, 2022

*వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

 *వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

(బ్రహ్మశ్రీ రేమిళ్ల వేంకటరామకృష్ణశాస్త్రిగారు)
_______________________________
व्यासं वशिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषम्
पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ।।
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ..
వేదవ్యాసమహర్షి వశిష్ఠునికి మునిమనుమడు,
శక్తికి పౌత్రుడు, పరాశరుని కుమారుడు, శుకమహర్షికి తండ్రి. అకల్మషుడు. భారతీయులకు మానవాళికి జ్ఞానభిక్షపెట్టిన పరమేష్ఠిగురువు.
వీరిని త్రిమూర్త్యాత్మకముగా మనం ప్రార్థిస్తూ ఉంటాం.
త్రిమూర్త్యాత్మక గురుస్వరూపుడు -
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః..
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః.
ఇక్కడ మొదటి శ్లోకంలో గురువును బ్రహ్మవిష్ణుస్వరూపంగా, పరబ్రహ్మస్వరూపంగా భావించి నమస్కరిస్తూన్నాం. రెండవ శ్లోకంలో వ్యాసుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తూన్నాం.
రెండిటి సమన్వయంచేత గురువుగా వ్యాసమహర్షిని భావించాల(భావిస్తున్నామ)న్నమాట.
సాక్షాత్ శ్రీకృష్ణస్వరూపుడు-
అభ్రశ్యామః పింగల జటాబద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః .
సర్వాన్ లోకాన్ ప్లావయమానః
కవిముఖ్యః పర్వసు రూపం వివృణోతు.
ఇది వ్యాసులవారివర్ణన. ఆయన మేఘమువలె నల్లనైనవాడు. పింగళవర్ణంలో జటలుకలవాడు.పొడగరి.చేతిలో దండముకలవాడు. కృష్ణమృగాజినం ధరించినవాడు. కవిముఖ్యుడు.
ఇవి బదరికాశ్రమంలో తపస్సుచేసినప్పటి శ్రీకృష్ణునుకి కూడా వర్తిస్తాయి. ఇంతే కాక ఈక్రిందిశ్లోకం వ్యాసనారాయణుల అభేదాన్ని తెలుపుతోంది-
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వన్దే భగవన్తౌ పునః పునః।
ఇది బ్రహ్మసూత్రకర్త వ్యాసునికి శ్రీకృష్ణునికి, భాష్యకర్త శంకరాచార్యునకు సంకరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తోంది. భగవద్గీతనందించిన కృష్ణుడూ కవే.
అనేక పురాణాలను,మహాభారతాన్ని అందించిన వ్యాసుడూ కవే.పైగా వ్యాసుడు కవిముఖ్యుడు.
ఆయన మానవజాతికందించిన సాహిత్యం వెలకట్టలేనిది. అందుకే ఆయన కవిముఖ్యుడు.
ఆదిత్యసదృశుడు వ్యాసుడు -
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్యధాతార మచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
పెనుచీకటికవ్వలి పరతత్త్వాన్ని ఆదిత్యవర్ణునిగా,
కవిగా ఈశ్లోకం చెపుతోంది. నన్నయగారి ఈ పద్యాన్ని గమనించండి-
భారత భారతీ శుభగభస్తి చయంబుల ఘోర సం
సార వికార సంతమసజాల విజృంభము వాపి సూరి చే
తోరుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాం
భోరుహమిత్రు గొల్చి మునిపూజితు భూరి యశోవిరాజితున్.
(ఆం.మ.భా.అవ.22ప.)
ఇందులో వ్యాసుని అంభోరుహమిత్రునిగా అంటే సూర్యునిగా అభివర్ణించాడు.
సూర్యుడు పద్మాలకు వికాసం కలిగించినట్లే వ్యాసుడు పండితులమనఃపద్మాలను వికసింపజేస్తాడు.
సూర్యునివల్ల చీకటితొలగినట్లే వ్యాసునివల్ల మన అజ్ఞానతిమిరం తొలగిపోతుంది.
కాబట్టే ఆయన మునిపూజితుడు, గొప్పకీర్తిచే ప్రకాసించువాడూ అయ్యేడు.
జనహితప్రారంభుడు –
ఎవరే పనిచేసినా అది జనాలకు హితాన్ని కూర్చేదైతే అంతకుమించిన గొప్పపని ఏమీ ఉండదు.
వ్యాసుడు కురువంశాన్ని నిలబెట్టినా, మహాభారతాన్ని, హరివంశాన్ని, అష్టాదశపురాణాల్ని, మహాభావగతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ... రచించినా జనహితంకోసమే.
తాను తరించడం కాదు, శిష్యులను తరింపజేయడమే ఉత్తమగురులక్షణం.
అదే వ్యాసులవారి లక్ష్యం. నన్నయగారి ఈ పద్యం గమనించండి.
పరమబ్రహ్మనిధింబరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా
పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారమ్భుఁ గృష్ణాజినాం
బరు నీలాంబుదవర్ణదేహు ననురూప ప్రాంశు నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్ .
(ఆం.మ.భా.ఆది.3ఆ.3ప.)
వ్యాసులవారు వేదాలకునిధి, పరమబ్రహ్మకునిధి(పరతత్వాన్ని ఎరిగినవారు) బ్రహ్మర్షులలో ముఖ్యుడు, దయాపరుడు,జనహితానికే ప్రయత్నం చేసేవాడు, రాగద్వేషాలు లేనివాడు,
మాత్సర్యం లేనివాడు.
ఇవి సద్గురువుకు ఉండవలసిన లక్షణాలు.
శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడు
రామాయణకాలంలో రాముని పరతత్త్వంగా తెలిసినవారు మహర్షులు మాత్రమే. కాని మహాభారతంలో వ్యాసుని గొప్పతనం చాలమందికి తెలుసు.
కాని ఆయన కథలో ప్రత్యక్షంగా పూనుకున్న సందర్భాలు చాలతక్కువ. తిక్కనగారు వ్యాసుని ఎలా ఆవిష్కరించారో చూడండి -
విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁ గృ
ష్ణద్వైపాయను నీవెఱుంగుము విభున్ నారాయణుంగా విప
శ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధ
ర్మాద్వైతుండు సరోజలోచనుఁడ కాకన్యుండు తద్వాచ్యుఁడే.
(ఆం.మ.భా.శాంతి.6ఆ.476ప.)
విద్వన్మోదవిధాయి - పండితులకు , జ్ఞానులకు ఆనందం కలిగించేవాడు, నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁడు, కృష్ణద్వైపాయనుడు, ధర్మాద్వైతుడు, సరోజలోచనుడు, తద్వాచ్యుడు,మోక్షప్రదాత. ఈవిశేషణాలను గమనిస్తే వ్యాసుడు నారాయణాభిన్నుడని వేరే చెప్పనవసరం లేదు.
నిర్వాణదానక్రియాశీలుడు -
బాలార్క ద్యుతి పుంజ పింజర జటా భారంబుఁ బ్రావృట్ఘన
శ్రీలీలం బ్రహసించు నింగమును రోచిస్స్ఫారదండంబు ను
న్మీలన్నీల మృగాజినాంబరమునై నిర్వాణదానక్రియా
శీలుండైన పరాశరాత్మజుఁడు విచ్చేసెం గృపాలోలుఁడై.
(ఆ.మ.భా.అశ్వ.3ఆ.147ప)
పాండవులకు ఏసమస్య వచ్చినా అక్కడ వ్యాసులవారు ప్రత్యక్షంకావడం చూస్తూ ఉంటాం. అదే ఆయన కృపాలోలత.నిర్వాణదానక్రియాశీలత.
యోగామృత స్ఫీతస్వాంతుడు – వ్యాసుడు
వ్యాసుని జీవితాన్ని పరికిస్తే ఆయన ఎంతటి స్థితప్రజ్ఞడో తెలుస్తుంది.అది యోగంవల్లకాని సాధ్యంకాదు. అందుకే ఎఱ్ఱన గారు ఆయన్ని యోగామృతస్ఫీత స్వాంతుడు అని వర్ణించారు ఈ పద్యంలో -
ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్ట క్రియాశీలుఁ డు
ద్గీతామ్నాయుఁడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత-
స్ఫీతస్వాంతుఁ డనంత సంతత సమావిర్భూత కారుణ్య ధా
రా తోయస్నపనైకశీలుఁడగు పారాశర్యుఁడచ్చోటికిన్ .
(ఆ.మ.భా.అరణ్య.6ఆ.103ప.)
ఒకకసారి ఆ విశేషణాలను గమనించండి. ఆశ్రితజనాభీష్టక్రియాశీలుడు, నిర్విధూతదురితక్లేశుండు, యోగామృతస్ఫీతస్వాంతుడు,
సంతత.... కారుణ్యధారా స్నపనైకశీలుడు.
ఆయన కృపావృష్టిని కురిపించే స్వభావంకలవాడు.
తన జ్ఞానంచే పాపాలను పోగొట్టగలవాడు. (జ్ఞానవిధూతపాప్మా—భగవద్గీత)
ఆగమ పదార్థతత్త్వవిదుడు- వేదవ్యాసుడు
ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటాచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశ వందితు సాత్యవతేయుఁ గొల్చెదన్ .
(ఆ.మ.భా.భీష్మ.1ఆ.71 ప.)
ఆయన వేదాలను విభజించేడంటే పేజీలు చూసి బైండింగు చేయించలేదు. వాటితత్త్వాని ఎరింగిన మహానుభావుడు. అందుకే ఆపనికి పూనుకున్నాడు.
విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం
పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృష్ణ ద్వైపాయనుఁ డర్థిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
(ఆ.మ.భా.విరాట.1ఆ.3ప.)
ఆయన అర్థిలోకహితనిష్ఠను పూని భారతరచన చేసాడు. మొదట అనుకున్నట్లుగా జనహితప్రారంభుడన్నమాటను గుర్తుచేసుకోవాలి.ఈ పద్యలను ఇంకా విస్తృతంగా వ్యాఖ్యానింపవచ్చు. కాని నిడివి పెరుగుతుందని విరమిస్తున్నాను. మన్నించండి.
ఇటువంటి మహానుభావును మనం గురుపూర్ణిమరోజున గురువుగా ఆరాధించాలి,ధ్యానించాలి, పూజించాలి.
🙏శ్రీగురుచరణారవిందాభ్యాం నమః।।🙏

No comments:

Post a Comment