Pages

Monday, May 18, 2026

బృందావన కథలు - 3 (బిహారిన్దాస్ తిలకం)

జై రాధే కృష్ణ

బృందావనంలో శ్రీకృష్ణుడితో కూడి, బరసానాలో విరాజిల్లే లాడ్లీ రాధారాణి  లీలలు అమోఘమైనవి, అనిర్వచనీయమైనవి. నేటికీ ఆ లాడ్లీ (గారాల పట్టి) తన భక్తులను ప్రేమతో కాపాడుతూ, అనేక లీలలతో వారిని ఆనందింపజేస్తూనే ఉంది.

పూర్వం అన్యమత రాజులు పాలించిన కాలంలో, ఒక పాదుషా ఇలా ఫర్మానా జారీ చేశాడు:

“రేపటి నుండి రాజోద్యోగులెవరూ తిలకం, చందనం, విభూది, బొట్టు వంటి ధార్మిక చిహ్నాలు ధరించకూడదు. ఎవరైనా తమ ఇష్టదేవతా చిహ్నాలతో వస్తే, వారికి కఠినమైన మరణ శిక్ష విధించబడుతుంది.”

అక్కడ రాజసేవలో ఉన్న రాధారాణి భక్తుడు బిహారిందాస్ ఈ వార్త విని తీవ్రంగా కలత చెందాడు. ఈ రాజాజ్ఞ రాజ్యమంతా ప్రకటించారు. బిహారిన్దాస్ ఇంటికి చేరగానే అతని తల్లి ప్రేమతో, “నాయనా, ఇకపై తిలకం ధరించకు; ప్రాణాపాయం ఉంది” అని హెచ్చరించింది.

బిహారిందాస్ బాధతో ఏమీ పలకకుండా ధ్యానంలో మునిగిపోయాడు. కళ్లలో కన్నీళ్లు ధారగాపోతూనే ఉన్నాయి. ఆ వేళ రాధారాణి ప్రత్యక్షమై, “ఏమిటి ఈ బాధ? ఎందుకు ఇంత వేదన?” అని మృదువుగా అడిగింది.

అప్పుడు బిహారిందాస్ వినమ్రంగా అన్నాడు:

“అమ్మా! ప్రియురాలి అలంకారం ప్రియునికోసం అయినట్లే, 

పతివ్రతా స్త్రీ అలంకారం తన భర్తకోసం అయినట్లే, 

భక్తుని అలంకారం భగవంతునికోసమే కదా! 

నేను ప్రతిరోజూ నీకోసం చందనం తిలకం ధరిస్తాను. ఇక అది చేయలేనని బాధపడుతున్నాను.”

రాధారాణి సానుభూతితో, “ఎందుకు చేయలేవు?” అని అడిగింది. బిహారిందాస్ పాదుషా ఆజ్ఞను వివరించి కన్నీళ్లతో తన బాధను తెలియజేశాడు.

అప్పుడు రాసేశ్వరి రాధారాణి తన కుడికాలి బ్రొటనవేలితో అతని నుదుటిపై, ఆజ్ఞా చక్రం నుండి నొసటిపైవ్వరకూ ఉన్న చందన తిలకాన్ని ముక్కు చివరి వరకు పొడవుగా లాగి చందన తిలకం దిద్దింది.

“ఇప్పుడు ఇది ఇంతకుముందు కంటే మరింత విశిష్టంగా రెండింతలు పొడవుగా ఉంది. ధైర్యంగా వెళ్ళు— ప్రేమాస్పదమైన నీ భక్తిని ఎవరూ అడ్డుకోలేరు” అని ఆశీర్వదించి అంతర్ధానమైంది.

బిహారిందాస్ కళ్లుతెరిచి చూసినప్పుడు, అది కల కాదని గ్రహించాడు. తన నుదుటిపై అద్భుతమైన చందన తిలకం ప్రకాశిస్తోంది. రాధారాణి ప్రత్యక్షమై తన కాలి బ్రొటనవేలితో తన నుదురు స్పర్శించిన అనుభూతి మళ్ళీ మళ్ళీ నెమరువేసుకోసాగాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఇంకా ఉన్నప్పటికీ, అవి ఇప్పుడు భయం వల్ల కాదు—ఆనందం, ప్రేమ, ధైర్యం వల్ల.

మరుసటి రోజు ఉదయం, అదే తిలకంతో రాజసభకు వెళ్లగా, భటులు అతన్ని పట్టుకొని పాదుషా ముందుకు తీసుకువచ్చారు. పాదుషా గంభీరంగా, “నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు?” అని ప్రశ్నించాడు.


బిహారిందాస్ తన అనుభవాన్ని భక్తి పరవశంతో వివరించాడు.

అది విన్న పాదుషా నవ్వుతూ అన్నాడు:

“ఇదే నిజమైన భక్తి! మేము భగవంతుని పట్ల మీ అందరి నిష్ఠను పరీక్షించడానికి మాత్రమే ఈ ఫర్మానా జారీ చేశాము. మీరు అందరూ మీ ఇష్టదేవతా చిహ్నాలను భగవంతుని ప్రీతికోసం ధరించండి—ఆడంబరం కోసం, మీ అలంకారం కోసం కాదు.” అని చెప్పి బిహారిందాస్‌ను ఘనంగా సత్కరించి పంపించాడు.


బిహారిందాస్ గోస్వామికి జై!

(ఈ రోజుకూడా ఆయన పరంపరలోని భక్తులు నుదుటంతా చందనం అలంకరించి, ముక్కు వరకు విస్తరించే తిలకాన్ని రాధారాణి కృపగా ధరిస్తుంటారు.)

జై శ్యామా ప్యారీ కుంజ్ బిహారీ

-శంకరకింకరః

No comments:

Post a Comment