Pages

Monday, March 7, 2016

ఈ అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

శివరాత్రి వ్రతం ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, మహాలింగేష్టి ఎన్నో ఎంతో హడావుడి చేస్తాం. భక్తి శ్రధాసక్తులతో చేసే కార్యాలు అనంత ఫలదాలు. నిస్సందేహం. ఐతే శివరాత్రి ఒక గొప్పనైన ఉపకారపు సందేశాన్నిస్తున్నది. అది అందుకున్నవారికి అందుకున్నంత... టూకీగా ఇందులోని ముఖ్యవిషయాలు తీసుకుంటే

) పరబ్రహ్మము సృష్టిలో మొదట చేసిన ఉపదేశంతపించు’ - తపస్సు చేయడం. ఏపని చేసినా తపస్సు చేయడం. తపస్సెప్పుడూ పక్కవాణ్ణి మెప్పించడానికో, పరపతి పెంచుకోడానికో కాదు అదెప్పుడూ ఆత్మానందానికే
) వేరే వ్యక్తి, పెద్దవాడు, భగవదనుగ్రహం ఉన్నవాడు కనిపిస్తే వినయంతో ప్రవర్తించక, తనకన్న అధికుడు కాదని లేదా అల్పుడని ఎంచి అహంకరించవద్దు.
) పేరు, పరపతికోసం, అసత్యమాడవద్దు, అసత్యమాడించవద్దు.
) లేని పెద్దరికం, లేని అర్హతలతో సత్యాన్ని మరుగునపెట్టి నేనధికుణ్ణని బీరాలు పోవద్దు.
) నాకు తెలుసు, నాకే తెలుసు, అవతలి వారెంత అని ఇచ్చవచ్చినట్లు ఎంచవద్దు.
) నేను గొప్ప అని అహంకరించి నువ్వు చెప్పడం చెప్పించుకోవడంకాదు, వినయశీలివైన నీ సుగుణాలను పెద్దలైన వారు గుర్తించాలి.

చూడండి అగ్నిస్తంభ ఆవిర్భావఘట్టంలో పైవన్నీ కనిపిస్తాయి. అది సృష్టి కర్త లోకానికి నేర్పే గుణపాఠమే ఐనా తానే మూడుగా మారి పాఠం చెప్తాడు. అందుకోవలసినవాడందుకోకపోతే రజోగుణ తమోగుణాలు పెచ్చరిల్లి జరగవలసినది జరుగుతుంది. శివరాత్రి నాడు ఓహ్ గొప్ప గొప్పవి బ్రహ్మాండమైనవి ఐన పూజలు, ఉపవాసాలు, జాగరణ చేసి నేర్చినదేమైనా ఉందా? అన్న విచారణ ముఖ్యం. అది అత్యంత ఉద్ధరణ కారకం. అప్పుడు పెల్లిబికే భక్తి శ్రద్ధలు వాటి స్థాయి ఉత్తమం.

ఎంత బ్రహ్మగారైనప్పటికీ విష్ణువు ఆధిక్యమేమి అని ప్రశ్నించారు అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. చిన్నపెద్ద అంతరం లేకుండా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న విష్ణు మూర్తితో తలపడ్డారు. కారణం ఏమిటి దీనికి, నేను గొప్ప, నేను అధికుణ్ణి అని నిరూపించుకోవడం తప్ప వేరు కారణమూ కనపడదు (భగవంతుని లీల మాయ అన్నది పక్కనపెట్టండి). మన జీవితంలోనూ ఎందరినో చూస్తుంటాం ఎన్నో పటాటోపాలూనేనది నేనిది వాడెంత వీడెంత నాఅంత వాణ్ణి నేను అనే వాళ్ళు కోకొల్లలు అది రంగమైనా సరే అలాంటి వాళ్ళు చాలా కనపడుతుంటారు.

ఇక విష్ణు మూర్తో తన మానాన తాను తపస్సు చేసుకుంటుంటే వచ్చిన బ్రహ్మగారితో అలాకాదురా అబ్బాయి ఇదీ విషయం అని చెప్పారు, బ్రహ్మగారు విన్నారా లేదు. పోనీ వెళ్ళిపోయారా విష్ణుమూర్తిని ఆయన తపస్సుకి ఆయనని వదిలి అంటే అదీలేదు. కయ్యానికి కాలు దువ్వారు. మొదట బ్రహ్మగారికి అహంకారం పెచ్చుమీరింది, నేనెందుకు తగ్గాలని విష్ణుమూర్తి కయ్యానికి సిద్ధపడ్డారు. చూడండి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుక్కునే మనస్తత్త్వం వల్ల ఎంత ప్రమాదం వాడు ఆవేశకావేశాలకి లోనై ప్రశాంతంగా ఉన్నవాడినీ పాడుచేస్తాడు. ఎంత భయంకరమైన అహంకారపుటజ్ఞానం!!! అప్పుడే కదా జ్ఞానం కావాల్సింది.

కథగా, లోకులకి పాఠంగా చెప్పాలంటే, పరబ్రహ్మం ఊరుకోదు కదా సాధుజనులవద్దకెవరైనా వస్తే... సరే ఇద్దరి మధ్యలో అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడా ఇద్దర్లో ఎక్కూ తక్కూలే... సరే ఒకరు హంస రూపమై ఆది చూస్తానన్నారు మరొకరు సూకరమై అంత్యం చూస్తానన్నారు... ఇద్దరివల్లా కాలేదు.

సత్వగుణ ప్రధానుడు, వినయంతో పరబ్రహ్మం చెప్పిన మాటవింటూ తపస్సు చేసుకునే విష్ణుమూర్తికి అర్థం అయ్యి తేరుకొని స్వస్థితికి వచ్చి ఎక్కడమొదలైయ్యారో అక్కడికి వచ్చారు. మరి బ్రహ్మగారు ఉక్రోషం పెరిగి ఎక్కడ విష్ణుమూర్తి ఆధిక్యాన్ని ఒప్పుకోవాల్సొస్తుందో అని ఎదురుగా వచ్చిన మొగలి పువ్వుని, ఆవుని అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే ఎవరితో కూడాలి ఎవరిని వదలాలి అని. మొగలి పువ్వు, ఆవు ఏది ఏమైనా  పరవాలేదు మేము అబద్ధం చెప్పము, మాకు పరమేశ్వరుడున్నాడు అని నమ్ముకుంటే సరిపోయేది, కానీ మొహమాటానికి లేని గౌరవాలకో అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నాయి.

సర్వజ్ఞుడు ఆయనకి తెలీదూఎంత వేదాలని గడగడా వల్లించి సృష్టి చేసే బ్రహ్మైనా... ఇంత అహంకరించినందుకు ఫలితంగా ఒకకుత్తుకతెగింది తస్మాత్ జాగ్రత్త ఎదుటివారి ఔన్నత్యాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే ఆతల ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని పరమేశ్వరుని తీర్పు శిరోధార్యంగా ఇందులోంచి తీసుకోవాలి. ఎంత బ్రహ్మగారైనా ఆలయమేలేకపోయింది. అంటే పదిమందీ పూజించడానికి అర్చించడానికీ కుదరకుండా ఐంది.   అటువంటి వారికి సహకరించినందుకు ఎంత గొప్పనైన గుబాళింపుంటేనేమి? మొగలికి స్వామి పాదాలు చేరే అర్హత జీవితంలో కోల్పోయింది. ఎంత పవిత్రమైన దైనా అమ్మా అని అందరూ పిలిచినా గోమాత తన ముఖానికి పూజా కోల్పోయింది.

అహంకారులు, గొడవలు పెట్టుకునేవారు, చులకన చేసి గేలిచేసేవారున్నా తనకు విధించిన తన కర్తవ్యం చేస్తూ ఉన్నవాడు లోకానికి నాథుడైయ్యాడు పరమపూజ్యుడై జగన్నాథుడై అనంత నామాలతో కొడియాడబడుతూ సృష్టిలో ఆలయాలలో ఇళ్లలో పూజలనందుకొంటున్నారు. ఒక్క అహంకారం ఎంత పని చేస్తుందో మనం ఎరగాలి. వినయంగా మౌనంగా ఉన్నవాడు ఎదురుగా మాటలు భరిస్తున్నవాడు అశక్తుడు కాదు సాధువు అని గుర్తెరగి జాగ్రత్తగా మసలుకోగలగాలి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

ఇలాంటి మూర్తీభవించిన అజ్ఙానపు అహంకారపు తలపులతో ఉన్నవారు కోకో..... కో కొల్లలు... ఎంతమందిని చూస్తుంటాం  ఏ సాహితీరంగమైనా, ఏ కార్యాలయాలైనాఏ రాజకీయ రంగమైనా, ఇక్కడా అక్కడా కాదు ఆధ్యాత్మిక రంగమైనా సరే బహుశా ఇక్కడే కాస్త ఎక్కువేమో ఇది... వాళ్ళు వీళ్ళుకాదు ఇది వ్రాస్తున్న నాతో సహా ఎందరో... అది పోగొట్టుకునే భాగంగా ఈ చిన్ని ప్రయత్నం.. పరమేశ్వరునికి ఈ నివేదనం..

Tuesday, December 1, 2015

దుస్సంగమును వర్జించాలి

జగద్గురు భారతీ తీర్థ స్వామి బోధ

మానవ మేధస్సు, బుద్ధి జీవితంలో గొప్ప పాత్రని పోషిస్తాయి. దానిని అదుపులో ఉంచుకోవడం ద్వారా వ్యవసాయాత్మిక బుధ్దిని ఎప్పుడూ ప్రోది చేసుకోవాలి. దానివల్ల నిత్యము సంతుష్టులై ఉండగలరు. లేకపోతే దుఃఖములు లేదా చెడుఫలితములను పొందగలరు. 

ఒకానొక రాజు వద్ద కొందరు మంత్ర్రులు, సేవకులు ఉండేవారు వారిలో ఉత్తముడైన భర్ఛు అనే సేవకుడు ఆ రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రుడు రాజుమెచ్చినవాడు ఆరాజు ఆంతరంగికుడూనూ. ఈ విషయం మంత్రులకి గిట్టేది కాదు. ఒకనాడు పథకం వేసి బెదిరించి ఆ సేవకుణ్ణి ఎత్తుకు పోయి అడవిలో వదిలి వచ్చేసారు. రాజుగారికి ఆ సేవకుడు అడవిలో క్రూర మృగాల వల్ల చనిపోయాడని చెప్పి కట్టుకథ అల్లి నమ్మించారు. ఆ రాజు కూడా నిజమని నమ్మి మంత్రుల సహచర్యంలో రాజ్యం నిర్వహిస్తూండేవాడు. ఒకనాడు ఆ రాజు అడవికి వేటకెళ్ళాడు. వేటలో తిరిగి తిరిగి ఎన్నో మృగాలను చంపి అలసిపోయి విశ్రమిస్తూండగా అక్కడ అడవిలో మంత్రులచే వదిలివేయబడ్డ సేవకుడు తారసపడ్డాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు తేరుకొని ఆ సేవకునితో మాట్లాడకుండా అతనిని పలకరించకుండా తిరిగి తనతో తీసుకెళ్ళకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కారణం తన మంత్రులు చెప్పినదే నమ్మి ఆ కనపడ్డది తన సేవకుని ప్రేతాత్మగా తలవడం.

ఒక్కసారి దుస్సాంగత్యానికి అలవడ్డామా ఎంత సద్విషయమైనా తలకెక్కదు. దీన్నే సహవాస దోషం / దుస్సంగం అంటారు. దుస్సంగత్వం వల్ల శ్రుతి బోధలూ , గురు బోధలూ కూడా పెడచెవినపెట్టే విషయములుగా తోస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రయత్న పూర్వకంగా దుస్సంగమును వర్జించాలి!

Thursday, November 26, 2015

దేవుళ్లను చంపి పండగ చేసుకుంటూనే ఉంటారా...!

మీ పండగలు, మీ మత ప్రవర్తకులు / మీ దేవుళ్ళు చచ్చినప్పుడొచ్చాయని.. కాదు కాదు మీ పూర్వీకులు వాళ్లని చంపినప్పుడొచ్చాయని.. ఇప్పుడు మీలో కొందరు మా దేవతనీ చంపి పండగ చేసుకుంటారా!?

ఎప్పుడూ సాధు, సంతులనీ చంపి పండగ చేసుకునే మనస్తత్వమేనా మీది? ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా ఇంతేనా? ఆ కౄరత్వం వదలరా! నాగరిక సమాజంలోకి రారా!  ఇంత దారుణమైన మానవత్వం లేని మనుష్యులా మీరు!?

పవిత్రమైన కార్తీకంలో గోష్టాష్టమి, ధేను ద్వాదశి అనే గోమాతను పూజించే పండగలు జరుపుకొని వృషోత్సర్జనం అని ఈ నెలంతా ఆబోతులను ఎద్దులను వదిలి ఉత్సవం చేసుకుంటుంటే.. మేం పవిత్రంగా కొలుచుకునే మా దేవతని ఈ పవిత్ర కార్తీకంలో చంపి తిని పండగ చేసుకుంటారా... పురాణాలలో రాక్షసులింకా చావలేదని నిరూపిస్తున్నారు మీరు...!!! #stopcowslaughter . save article 48.

Monday, November 9, 2015

దీపావళి విధులు

శ్రీ గురుభ్యోనమః

అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళిగూర్చి  చిన్న వివరాన్ని  రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పొందుపరిచాను.

"ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి" - విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్కపవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధినికలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దానిఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే  రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు  సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈసమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడుపైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వంరమారమి 4-4:30 మధ్యలో)  ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

 స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అనిశాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో  మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ  క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు  అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్నిహరించు అని చెప్తూ చేయాలి.

ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాతయమధర్మరాజుగారికి నమస్కరిస్తూ  క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారుమాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినేకొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీకమాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.

దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధురపదార్థం తినాలి.  దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

ముఖ్యంగా  దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు,  రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి  మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.

దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం,ఆచారమైంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన  దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.



దీపావళి పర్వదినం మూడు రోజులు పాటు ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి. ఈ మూడు రోజులూ తెల్లవారు ఝాముననే తైలాభ్యంగన స్నానం చేసి కులదేవతారాధనం చేసి, యమధర్మరాజుని పితృదేవతలను, ఇష్టదేవతల స్మరించి పూజించడం భగవదనుగ్రహానికి మార్గం. దరిద్రనివారణకు ఈ దీపావళి త్రిరాత్ర ఉత్సవం చక్కని మార్గం. దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్ర్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్నిఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు. అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని వదిలి ప్రవర్తించిన అనాచారాన్ని ప్రవర్తింపచేసిన కంసకౌరవాదులు పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు. భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, గురుపాద సేవనం ఐశ్వర్యం, తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం. 

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు