Pages

Friday, July 19, 2013

ఏకాదశీ వ్రతం-1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఒకానొక నాడు దశరథ మహారాజు చెప్పినట్లు తెల్లగొడుగు కింద ఎన్ని ఏళ్ళు రాజ్య పాలనం చేసానో తెలియలేదు తీరా చూసుకుంటే ముడతలు పడ్డ శరీరం, నెరసిన జుట్టు, బడలిన ఇంద్రియాలు ఉన్నాయి అని.

 కాలంతో పోటీగా పరిగెడుతూ కాలంలో అన్నీ అనుభవిస్తూ సుఖిస్తూ దుఃఖీస్తూ సాగుతున్న లౌకిక + అలౌకిక జీవన పయనంలో మరో మారు కాలం రూపాంతరం చెంది శ్రీ విజయ నామ సంవత్సర దక్షిణాయనంగా ప్రారంభమై మనముందుకు వచ్చింది. బలవత్తరమైన కాలంలో గొప్పనైన ఉపాసనకు అతిశక్తివంతమైన ఎంతో ఉపయుక్తమైన కాలం దక్షిణాయణ పుణ్యకాలం. అందులో ముఖ్యంగా ఎన్నో నైమిత్తిక తిథులు అన్నీ తొలి ఏకాదశితో ప్రారంభం తరవాత వ్యాస పౌర్ణమి  నుండి మకర సంక్రాంతి వరకు ఎన్నో ఎన్నో నైమిత్తిక తిథులు ఎన్నో ఉపాసనా పద్ధతులు. ఇంతటి ఉపాసనాకాలమూ పద్ధతులూ అన్నీ పర+అపర జ్ఞానాన్ని పంచేవే పెంపొందించేవే.

ఇక మనకి రేపు తొలి ఏకాదశి దీన్నే శయనైకాదశి అని అంటారు, రేపటినుండి భగవానుడు యోగ నిద్ర పొందుతాడు అని పురాణ వాక్కు. ఏకాదశీ తిథి నాడు విష్ణు అర్చనం శివ దర్శనం పరమపావనమని ఊర్థ్వలోకవాసానికీ, ఉత్తమ గతులకూ అలాగే ఐహికమూ,పారమార్థికమూ ఐన కామ్యములు తీరడానికీ కూడా విశిష్టమైన తిథి. ఏకాదశీ తిథినాటి వ్రతం గూర్చి ఇలా చెప్పబడింది.


రుక్మాంగద చరిత్రమను ఏకాదశీమహాత్మ్యం తెలుగు గ్రంథంలోని ఏకాదశిని గూర్చిన పద్యం సులభ గ్రాహ్యమే కనుక అర్థం ఇవ్వలేదు.

ధరామండలిన్ గల్గు ధర్మవ్రతంబుల్
పురాణంబులన్ శాస్త్రపుంజంబులందున్
గరంబింపు సొంపారఁగాఁ గాంచి మౌనుల్
పొరిం బల్కిరిట్లంచు భూపాలుతోడన్

అమితపాపౌఘవంశాటవీఘనదాహ
          శిఖికీల యేకాదశీవ్రతంబు
దర్పితాహితదైత్యదళనోగ్రవిష్ణుకౌ
          క్షేయకం బేకాదశీవ్రతంబు
కఠినపాతకసముత్కరభేకలోకభు
          గ్జిహ్మగం బేకాదశీవ్రతంబు
సంసారసంతాపసంతస్తమానసో
          జ్జీవనం బేకాదశీ వ్రతంబు
సువ్రతాకల్ప మేకాదశీవ్రతంబు
వరశుభాకారమేకాదశీవ్రతంబు
చిన్మయానందమేకాదశీవ్రతంబు
శ్రీసమంచిత మేకాదశీవ్రతంబు

పుణ్యభూవులలోనఁబురుషోత్తమమువోలె
          గ్రహములలో దివాకరుఁడువోలె
నంభోనిధులలోన నమృతార్ణవమువోలె
          నగములలో మేరునగమువోలె
నాశ్రమంబులలో గృహస్థాశ్రమమువోలెఁ
          దరువులలోఁ గల్పతరువువోలె
నధికదానములలో నన్నదానమువోలె
          మణులలోఁ గౌస్తుభమణియుఁబోలె
స్వర్గమున భూమియందు రసాతలమున
బ్రతి యొనర్పఁగ రానిసువ్రతము సకల
మంగళాస్పద మఖిలసంపత్కరంబు
క్షితితలేశ్వర! యేకాదశీవ్రతంబు


అలానే
దాని విధి విధానమెట్టిది నియమములెట్టివో చూద్దాం

స్నానమొనర్చి ధౌతపరిధానములన్ ధరియించి యంటఁగాఁ
గానిమనుష్యులం గనక కల్లలు వల్కక ఉగ్రకృత్యముల్
మాని వినిద్రుఁడై నియతమానసుఁడై తమలంబుఁ దక్కి శ్రీ
జానిపురాణముల్ వినుట సంగతి శ్రీహరివాసరంబునన్

దశమినాఁడేకభుక్తము సేసి మఱునాఁడ
          హోరాత్రముల భక్తి నుపవసించి
హరిమందిరమున జాగర మొప్పఁ గావించి
          వేగిన ద్వాదశివేళయందు
విప్రోత్తములకు షడ్విధరసోపేతంబు
          గా భుజింపఁగఁ బెట్టి కనక నిష్క
తతులు దక్షిణ లిచ్చి తదనంతరము సుహృ
          జ్జనులతో నామిషక్షౌద్రశాక
విరహితంబుగఁ బారణ వేడ్కఁ జేసి
నిద్ర దివ మెల్ల వర్జించి నియమపరత
మాపు భుక్త్యంగనాసంగమంబు లుడిగి
యుచితగతి నుండి మది యుత్తమోత్తమంబు

కరణి జరుపనోపక
యేకాదశిదివస మైన నిరుప్రొద్దు నిరు
త్సేకమున నుపవసించిన
శ్రీకాంతుండుత్తమముగఁ జేకొను నధిపా!
అప్రహతి నినరించెనే నదియుఁ గొఱఁత
గాదు నక్తంబు నేక భుక్తమున ననుచి
తంబు కావించుటయును దూష్యంబు గాదు
కాదు స్వేచ్ఛావిహారమేకాదశులను

మహిమ మీఱంగ నాషాడమాసముఖ్య
భాద్రపదమాసకార్తికభవ్యమాస
రమ్యసితపక్షహరి వాసరములయందు
వలయు శుష్కోపవాసంబు సలుప నరులు

విధములలో నొక్కటి
గావించినఁ బుణ్యమట్లు గాక యథేచ్చన్
గావరమున భుజియించిన
వైవస్వతలోకమును నవశ్యతఁ బొందున్

Thursday, July 11, 2013

కార్తీక శుక్ల పంచమి అలమేలు మంగత్తాయార్ ఆవిర్భావం

కార్తీక శుక్ల పంచమి అలమేలు మంగత్తాయార్ ఆవిర్భావం
వేంకటాద్రి స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి చేసిన చేష్టితానికి అందుకు విష్ణుభగవనాడు మిన్నకుండటాన్ని చూసి (పతికి/ గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) దుఃఖితవతియై పాతాళానికెళ్ళిపోయిందనీ, తరవాత సూర్య విష్ణుమూర్తి భూలోకంలో తపస్సుచేసుకునే సమయంలో సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో తిరిగి ఆవిర్భవించి, కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు.
పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు. అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు పరమ ప్రహృష్ఠంగా ఉంటారిద్దరూ. తిరుమలనుంచి ప్రత్యేక సారె తిరుచానూరుకి వస్తుంది ఏనుగులపై ఊరెరిగించి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఆ సారెను ఈ తిథినాడు.
ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆదీక్ష తీసుకునేవారు కూడా ఈ నాడు తీసుకుంటూంటారు.
తన పతి ఏ చోట అవమానింపబడ్డాడో ఆ చోటు విడిచిన అమ్మవారిని సంతుష్టురాల్ని చేయటానికి అయ్యవార్ని అమ్మవార్ని కలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం/ గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుష సూక్త, శ్రీ సూక్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా హయిగా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం.
అందరికోసం సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్రం పొందుపరుస్తున్నాను, ఇతర లక్ష్మీ స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇక ఈ పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు, ఈ రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని విశ్వసిస్తారు. జనపదాల్లో ఇదే నాగపంచమిగా కూడా జరుపుతుంటారు.


-శంకరకింకర

Monday, July 1, 2013

శివాదేవి కొప్పులోని పూలవాసన

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కాంతా కచ ప్రచయ పుష్ప సుగంధి గంధ
లుబ్ధ భ్రమద్భ్రమర కర్బుర కంధరాయ!
గంధర్వ యక్ష సుర సిద్ధ కిరీట కోటి
సంఘట్ట ఘృష్ట చరణాయ నమః శివాయ!!

శివ-శివా... అభేధరూపమైన శక్తి తో కూడిన అర్థనారీశ్వరుని స్తుతిస్తున్న స్తుతి మల్హణకవి కృతమైన శివస్తుతిలోని మంగళశ్లోకం.

శివునికి ఉండేది బ్రహ్మాండమైన జటాజూటము ఇక్కడ కవికాంత కచ’.. అని మొదలెడుతూ స్తుతించి మనకి ఉపాసనా మార్గంలో శక్తి యుతుడైన భగవన్మూర్తి అర్చన పరంపరను ప్రమాణాన్నీ మరోసారి నొక్కి చెప్తున్నారు.

శివాదేవికి లేదా అర్థనారీశ్వరునకు కుడివేపున ఉన్నది బ్రహ్మాండమైన జటాజూటము, ఎడమవైపున ఉండేది కొప్పు. కొప్పుకో దేవతాస్త్రీలే చెలికత్తెలుగా మారి స్వర్గాది లోకాలలో ఉండే పారిజాతాది పుష్పముల మాలలను తెచ్చి అలంకరించారు. పుష్పాల మనోహరము సువాసన ఇంతింతేమి మానవులమైన మనకు తెలియనిది ఐనా ఒక గొప్ప సువాసనను మనసా ఊహిద్దాం. మనసుని షట్పది అంటారు కదా అంటే తుమ్మెద అన్నమాట మనమూ ఒక తుమ్మెదలా మారి అంత గొప్ప సువాసనలు తెలిసిన స్వర్గలోకపు తుమ్మెదలతో కలిసి అక్కడ తిరుగుతున్నామనుక్కోండి  ఆపువ్వుల వాసన వదలలేక శివాదేవి కొప్పును మెడను వదలేల అక్కడే ఝుమ్ఝుమ్మని తిరుగుతూ గంగా జలమౌలతో తడిసిన శివాదేవి యొక్క ఘనమైన ఎఱ్ఱని జటాజూటమును దేవతా స్త్రీలచే అలంకరించబడిన నల్లనైన కొప్పును చూస్తూ లోభత్వమును పొందిన వారిలా శివాదేవి మెడ వద్ద కొప్పులవద్ద సువాసనలు ఆఘ్రాణిస్తూ తిరుగుతున్న తుమ్మెదలతో కలసి తుమ్మెదా తిరుగుతున్నది.

అలా శివాదేవి కొప్పులవద్ద మెడ చుట్టూ తిరుగుతూ ఉండగా... మూర్తి యొక్క మెడ/కంఠం దర్శనమైనది... దాని నిండా సుగంధ భరితములైన గంధములు అలది ఉన్నవి. శివుడు తనకి తానే పూసుకొన్నాడో మరి అమ్మవారో, పరిచారకులు పూసారో లేక భక్తుడు ఎక్కడ ఏమూర్తిగానెంచి పూస్తే తన మెడకు అలదుకున్నాడో తెలియదుకానీ, అయ్యది అసలే తెల్లని మెడ అమ్మవారిది ఎర్రని మెడ రెండూకలిసి బంగారు వర్ణమా అందామంటే కుంకుమ పువ్వు, కస్తూరి,  ఎన్నో రకకాల చందనం వంటి ఎన్నో రంగు రంగుల సుగంధ ద్రవ్యాలు అలది ఉన్నది. అసలే మెడ మీద కాలకూట విషం సేవించిన గుర్తుగా నల్లని మచ్చ ఒకటి ఉంది. ఇలా కర్బురమైన కంఠమును చూసి ఆనందించి మరింత లోభపడి విడివడలేక తిరిగిరాని రీతిగా తుమ్మెద అక్కడే తిరుగుతున్నది. (కర్బుర కంధరం =అనిర్వచనీయమైన రకరకాల వన్నెలతో కూడిన మెడ/కంఠము)

శివదేవుని సకల దేవతలూ దేవజాతులూ సేవించడానికి వస్తూంటారు. వీళ్ళు రెండు రకాలు అజానదేవులు అంటే సృష్టిలో దేవతల్లాగా పుట్టినవాళ్ళు. ఇంకొకరు కర్మదేవుళ్ళు అంటే మనలా మనుషుల్లా పుట్టి సుకర్మలు చేసుకొని పుణ్య ఫలముతో దైవత్వాన్ని పొందినవారు. ఇద్దర్లో ఇంకా కొన్ని తెగలు, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ ఇత్యాది. నానా తెగల దేవతలూ శివుని ప్రత్యక్షముగా చూసి కొలవాలని నిత్యమూ ఆయన సన్నిధికి వస్తూంటారు. వారు వారి వారి స్థాయీ బేధాములను, అధికారములను బట్టి బంగారు తాపడములతో వివిధ రకములైన మేలన కఠినమైన వజ్రాది వివిధ రత్నములతో తయారైన రక రకములైన కిరీటములను ఆభరణ ఆహార్యములనూ ధరిస్తారు.  వారు శివుని దర్శించగానే శివుని పాదాలవద్ద సాష్టాంగ పడి నమస్కరిస్తారు. అలాంటి కిరీటముల కొనల రాపిడిచే కందిపోయిన చిగురుటాకులవంటి పాదముల వేళ్లు కలవాడయ్యె ఐననూ చిద్విలాసుడై వచ్చిన ప్రతివారిని సంతుష్టుల గావించి పంపసాగెనని తెలిసి అక్కడే తిరుగుతున్న తుమ్మెదలలో ఉన్న మన మనసనే తుమ్మెద తిరిగి వచ్చి. ’అహో! శివామూర్తి ఎంత బాధపడుతున్నాడు . ఎడతెరిపిలేక ఎందరో దేవ సంఘములవారు ఆయనకు నమస్కరిస్తూ ఆయన వేళ్ళు కందిపోయేటట్లు చేస్తున్నా దేవతలనే భక్తులమీది కరుణచే బాధను ఓరుస్తున్నాడు. అంతటి దయామయుడు ఇతః పూర్వమెన్ని పాపములు చేసినా మన తప్పులు మన్నించి  అనుగ్రహించడా! అటువంటి మహానుభావుడైన శివునకు నమస్కారము

అని కవి మన మనస్సునే షట్పదివోలె చేసి శివుని, శివామూర్తిని ఆయన జటాజూటము, అమ్మవారి కబరీబంధము/కొప్పు అందులోని రకరకములైన పారి జాతపుష్పపు వాసనలు, ఆయన తెల్లని ఎఱ్ఱని మెడ అందులో నల్లని మచ్చ, చుట్టూ పూసిన రకరకములైన గంధములు, వాటి సువాసనలు, స్వామి వారి లేతని పాదములు వాటికున్న తెల్లని సుకుమారమైన వేళ్ళు, రక రకములైన ఎంతో వైభవోపేతమైన దేవతల కిరీటపు వెలుగులు కిరీటములు స్వామి కాలి వేళ్ళ చివర్లను తగలడం అందుచే తెల్లని వేళ్ళు ఎఱ్ఱగా కందినట్లు అవ్వడం అన్నీ చక్కగా మనకళ్ళకి కట్టినట్లుగా చిన్ని శ్లోకం లో ఇమడ్చారు. ధ్యానంలో నల్లని ఎఱ్ఱని రకరకరకమైన రంగుల గంధములు పుష్పములు, గొప్పనైన కిరీటములు మనకి అందిస్తూ, పుష్పపు, గంధపు సువాసనలని కూడా పొందేటట్టు చేసారు అంతేనా తుమ్మెదల ఝంకారం, కిరీటాల రాపిడులవంటి శబ్దాలు కూడా మనచెవికి అందించారు.  స్తోత్రం ప్రార్థనా శ్లోకంగా చాలా మంది పెద్దలు ఇప్పటికీ వాడుతూంటారు.