Pages

Wednesday, June 15, 2016

ద్రావిడ బ్రాహ్మణులు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

      తెలుగునాట ఉన్న వివిధ బ్రాహ్మణ శాఖలలో ద్రావిడ శాఖ దాని చరిత్రకు సంబంధించి ప్రస్తుతం కొంత అస్తవ్యస్తమైన కథనాలు కనబడుతున్నాయి. అసలు విషయం తెలియని కొత్తతరం కొంత పాత తరంతోపాటు అపఖ్యాతితోకూడిన కథనాలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఐతే శోచనీయం ఏమంటే పెద్దలైనవారే తప్పుడు చరిత్రను తెలియక ప్రచారం సాగించడంలో ముందున్నారు. "ప్రమాదో ధీమతామపి" అని కదా ఆర్యోక్తి, బహుశా అది ఇక్కడ కూడా పని చేస్తున్నట్లున్నది.

      సరే విషయానికి వస్తే, చరిత్రపుటలనాధారం చేసుకుని తెలుగు బ్రాహ్మణుల చరిత్ర, వెలంగమాన్ అగ్రహారీకులకు సంబంధించి దొరికిన కొన్ని వ్యాసాలు, చరిత్ర అధారంగారాజరాజ నరేంద్రుని చరిత్ర, నన్నయభట్టారకుని మిత్రుడైన నారాయణభట్టుగారు మొదలైన అంశాలను పరిశీలించడం జరిగింది. ఆమేరకు లభించిన విషయాలని క్రోడీకరించి పంచే ప్రయత్నం ఇది.

ముందు అపప్రదలను దూరం చేసుకుని, తరవాత మనం మన్ పూర్వీకులు ఎవరో వారి వైభవమేమిటో వివరించే ప్రయత్నం చేస్తాను.
ద్రావిడులు రాక్షస జాతి - రావణ వంశం అనేది సాధారణంగా కొన్ని చోట్ల వినిపిస్తూ వస్తున్నది. అది నిజమే కాదు. విచారణ చేద్దాం.. నిజానికి రామాయణం ఎఱిగిన వారు ఎవరూ వ్యాఖ్య చేయరు. పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రావణుడు రాముడిచేతిలో మరణించాడు. మిగిలింది విభీషణుడు అతని మంత్రులు, కుటుంబం ఒక్కటే. ఒకవేళ అలా అనుక్కున్నా విభీషణుడి వంశం అని అన్నా కాస్త గౌరవంగా ధార్మికుడి వంశం అని గొప్పగా చెప్పుకున్నారు అనుకునే అవకాశం ఉండేది. కానీ దిక్కుమాలిన రావణుడి వంశస్థులం అని చెప్పుకోవడం దారుణమైన స్థితి. అసలు రావణుడి వంశం మిగలనే లేదు. కాబట్టి రావణుడి వారసులం అనే ప్రసక్తే లేదు.

      భారతీయులను విడగొట్టి పాలించడం కోసం బ్రిటీషువారు పుట్టించి తీసుకువచ్చిన ఆర్య ద్రావిడ కాన్సెప్టుతో పాటు అప్పట్లో వారు లేవనెత్తిన శైవ వైష్ణవ మతాల గొడవలకి కలిపి సిద్ధాంతాన్ని కొందరు దక్షిణాత్యులకు ఔతరాహికులకు ఆపాదించి రుద్దడంలో మ్లేచ్ఛులు విజయం సాధించారు. దాని పర్యవసానంగా ద్రావిడులు (కేవలం తెలుగు ద్రావిడ బ్రాహ్మణులే కాదు దాక్షిణాత్యులందరినీ ద్రావిడులని పిలిచారు) అంటే దాక్షిణాత్యులు శ్రీలంకతో కలిపి ద్రావిడులనీ వారికి అధిపతి రావణుడనీ కొత్త చెత్త సిద్ధాంతాలు చేసారు. సాధారణంగా ఇటువేపు వారు అప్పట్లో శైవ మతానుయాయులెక్కువ కాబట్టి వాళ్లందరూ రావణ బ్రహ్మ వంశీకులని ఆపాదించుకున్నారు. దీనికి రావణుడు అనే ఋషి కూర్చిన మహన్యాసం (ఇప్పటికీ సింహభాగం రావణుడు రాముని చేత నిహతుడైన దశకంఠుడే అని నమ్ముతారు, ఒక వేళ నిజమైనా కాకున్నా మనకి అప్రస్తుతం) తో పాటు రావణుని శివభక్తితత్పరతను తోడు తెచ్చుకుని ద్రావిడులందరూ ప్రత్యేకంగా రావణవంశంవారు ముఖ్యంగా ద్రావిడ బ్రాహ్మణులు అని ఒక అపప్రదని గొప్పగా చెప్పుకోవడం జరుగుతోంది. అందులో నిజంలేదు. ద్రావిడ బ్రాహ్మణులు (ముఖ్యంగా తెలుగునాట ఉన్న ద్రావిడ బ్రాహ్మణులకి) పూర్వాపరాలు విచారణ చేద్దాం.


ద్రావిడ బ్రాహ్మణులు వైదిక నిష్ఠ కలిగి వేద సంపత్తి కలిగినవారు
      కావేరి నది ఒడ్డున తంజావూరు, కుంభకోణం పట్టణానికి దగ్గరలో కావేరి ఉత్తర తీరంలో ఉన్న వెలంగమాన్ అగ్రహారంలో ఉన్న కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు  దాదాపు 10 శతాబ్దాల క్రితం రాజ రాజ నరేంద్రుని కాలంలో తెలుగునాటికి చేరాయి వారిని గుర్తించడంకోసం ద్రవిడ (తమిళ /అరవ/దాక్షిణాత్య) దేశంనుంచి వచ్చారు కాబట్టి ద్రావిడులు అని పిలిచారు. సరే అంతకు ముందు వారెక్కడివారు అని విచారణ చేస్తే అంతకు ముందు 400/500 సంవత్సరాల క్రితం వారు సౌరాష్ట్ర దేశం నుండి అంతకు ముందు సరస్వతీ నదీ పరీవాహక ప్రాంతం నుండి వలస వచ్చారని చరిత్ర వ్యాసాల ద్వారా తెలుస్తున్నది. మన పూర్వీకులు బ్రాహ్మణులకుండవలసిన ముఖ్యమైన 6 లక్షణాలనూ పుణికి పుచ్చుకుని జీవనం సాగించేవారు. వేదాధ్యయనం - అధ్యాపనం, యజ్ఞం చేయడం - చేయించడం, దానం ఇవ్వడం - పుచ్చుకోవడం చేస్తూ వేదాధ్యయన అధ్యాపనంలో ఎక్కువ ఆసక్తి కనబరిచి కదులుతున్న నడుస్తున్న సరస్వతులవలె జీవించారు. సరస్వతీ నదీ ప్రాంతంనుండి విద్యనూ, జ్ఞానాన్ని పంచుతూ సౌరాష్ట్రమీదుగా కొన్నాళ్ళకు కావేరీ తీరం చేరి అక్కడ వాసం ఏర్పరచుకున్నారు. వారి వల్ల అక్కడం వేదం బ్రాహ్మణ్యం మరింత శోభాయమానంగా పరిఢమిల్లింది. ఇతర రాజ్యాలు రాజులు కూడా వారిని ఆహ్వానించేంతగా అనుష్ఠాన బలం వేదాధ్యయన అధ్యాపనం యజన యాజనాలు చేసేవారు. యజ్ఞాలు చేయించడంలో దిట్టలని పేర్గాంచారు.

      అలా ఎంతో కాలం గడిచాక, రాజమహేంద్రవరాన్ని పాలించే రాజ రాజ నరేంద్రుడు లుప్తమైన తన ధనాగారం నింపి ప్రజలరక్షణకూ, రాజ్యాలను గెలిచి కీర్తిని పొందడానికీ, ధనార్జనకై దండయాత్రలు చేసి ఇతరులను సామంతులుగా మార్చుకొని కప్పం పుచ్చుకునేవాడు అలా తంజావూరు రాజ్యంపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ముసలివాడైన రాజేంద్ర చోళుడు కయ్యంకన్నా వియ్యం మేలని తన కూతురిని రాజరాజ నరేంద్రునికిచ్చి వివాహం చేశాడు. ప్రతిగా రాజ రాజ నరేంద్రుడు మామూలు కానుకలు అడగలేదు. ఆయన కొంత ఆలోచించి అక్కడ రాజ్యం తిరిగి చూసి బ్రాహ్మణులను చూసి అబ్బురపడి తన రాజ్యంలోనూ అటువంటి వైదిక నిష్ఠ కల వారుండాలని కాంక్షించి "బ్రాహ్మణ భిక్ష"ను కోరాడు.

{ఐతే మరొక వృత్తాంతం ప్రకారం కేవలం 500 సంవత్సరాల క్రితం తంజావూరి పాలకులతో మనస్పర్థలు వచ్చి పద్దెనిమిది కుటుంబములు ర్యాలి గ్రామమునకు అటుపిమ్మటి మరికొన్ని గ్రామములలోనూ వసించారనీ, పెద్దాపురం రాజావారు వీరి వర్ఛస్సు, వైదిక నిష్ఠ ఎరిగి సంతోషపడి అగ్రహారాలిచ్చి అక్కడనే ఉండమన్నారనీ కథనం బహు ప్రాచుర్యంలో ఉన్నది. ఐతే చారిత్రక ఆధారాల ప్రకారం రాజ రాజ నరేంద్రుని కాలంలోనే వారు ఇక్కడకు వలసవచ్చారనేది సరిపోతున్నది.}

      వెంటనే రాజేంద్ర చోళుడు బిత్తరపోయి నేను నీకు కూతురితోపాటు సేవకులను పంపడం పరిపాటి కానీ బ్రాహ్మణులను అలా పంపలేను, వారిని శాసించలేను. వారికి నీ కోరిక చేరవేస్తాను ఎవరు నీ రాజ్యానికి వస్తే వారిని చేరదీయమని చెప్పడం జరిగింది. అలా రాజేంద్ర చోళుని మర్యాద కాపాడడానికీవైదిక ధర్మం పరిఢమిల్లాలనే ధార్మికమైన  రాజ రాజ నరేంద్రుని కోరికనూ మన్నించి 6 వంశాలకి చెందిన, 18 కుటుంబాలు 18 గోత్రీకులు బయలుదేరి రాజ రాజ నరేంద్రుని రాజ్యానికి చేరడం జరిగింది. అక్కడనుంచి ర్యాలి అగ్రహారం, పుదురు అగ్రహారం ఇలా ఇంకా కొన్ని చోట్ల కోనసీమలో  వసించారు.

      అప్పట్లో ద్రావిడులలో బాగా ఖ్యాతి పొందినవారు నారాయణ భట్టుగారు వారు రాజ రాజ నరేంద్రుని ఆస్థానంలో మంత్రిగా చేశారు నన్నయ్యభట్టారకుని మిత్రులు. భారతం తెనిగించడంలో నన్నయగారికి చేదోడు వాదోడుగా ఉండు సంస్కృత  భారత అనువాదం మరియు తెనిగించే విధంలో సహాయపడ్డారు. అయ్యగారి దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన వంశస్థులు అయ్యగారి వారయ్యారు. ఉపాధ్యాయ వృత్తిని చేసినవారు ఉపాధ్యాయుల వారు, కంచినాథుడైన ఏకామ్రేశ్వరుని సేవించినవారు కంచినాథం వారయ్యారు. సోమయాగం చేసిన అయ్యగార్లు అయ్యలసోమయాజులైయ్యారు, దక్షిణగా వడ్లు, నూకలు పుచ్చుకునేవారు వడ్లమాని, నూకల అయ్యారు, గంటి వంటి ఊర్లలో స్థిరపడ్డవారు ఆయా ఊరి పేర్లతో పిలువబడ్డారు. వేదంలో నిష్ణాతులు వేదుల వారయ్యారుతెలుగులో అగ్రహారం తమిళంలో పెరియఊరు  అదే పేరూరయ్యింది. పెద్దింటివారు కాబట్టి పెరియ వారయ్యారు కాలక్రమంలో పేరి వారయ్యారు.. కాశీలో చదువుకొచ్చిన భట్టారకులు కాశీభొట్లవారయ్యారు. ఇలా సాగుతుండగా ముందొచ్చిన 18 కుటుంబాలవారి అనంతరం మరికొంతమంది వెనకొచ్చినవారు కొంత కాలం నల్గొండ జిల్లాలో పేరూరులో వాసం చేసి అట్నుంచి ఖాళీ చేసి గోదావరీ తీరం చేరారు. ఇందులో కాల క్రమేణా కొంత మంది ఆరామాలు / వనాలలో ఉండడం కోసం మరికొంత ముందుకి సాగారు. ఇందులో మళ్ళీ 3/4 తెగలుగా విడారు. వేషభాషలలో తెలుగుదనం మొత్తం జీర్ణమైనా అక్కడక్కడా కొంత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాలు ఇంకా సజీవంగా కొనసాగుతూ ఉన్నాయి తెలుగు ద్రావిడ బ్రాహ్మణులలో...

          కానీ.... మన పూర్వీకులు ఉద్దేశ్యంతో దేశసంచారం చేశారో పరమ పావనమైన సరస్వతీ నదిని వదిలి , సౌరాష్ట్ర దేశం వదిలి, కావేరీ తీరం వదిలి గోదావరితీరం చేరారో ఉద్దేశ్యం లక్ష్యం మాత్రం కొనఊపిరితో మాత్రమే ఉంది. వేదవేదాంగాలు, శాస్త్రాధ్యయనం, యజన-యాజనాదులు, వైదిక నిష్ఠ చూసి పొంగి పోయి రాజ రాజ నరేంద్రుడు భిక్షగా మన పూర్వీకులని పొందాడో లక్ష్యం ఆయనకు నెరవేరి ఉండవచ్చుగాకకానీ ప్రస్తుతం ప్రత్యేకత మనకుండేదో అది మనలో లుప్తమైయ్యింది అనడంలో సందేహం లేదు... కించిత్ లజ్జతోనే వాక్యం వ్రాస్తున్నాను. ఏధర్మం చెప్పినా, శాస్త్ర ప్రమాణం చూపినా, వైదిక నిష్ఠ కలిగిన పూర్వీకుల వారసులమైన మనం పెక్కు చోట్ల  "మా ద్రావిళ్ళకిదిలేదు, అది లేదు అని చెప్పుకుంటూ శాస్త్రవిహితమైనవి వదిలేస్తూ మనకి అనుకూలమైనవి మాత్రమే ఆచరించే స్థితికి వచ్చాం... అది లేదు ఇది లేదు అని చర్చించి సిద్ధాంతీకరించే స్థితికొచ్చేసాం ధర్మ భ్రష్టత్వం, శాస్త్ర భ్రష్టత్వం కానిస్తున్నాం, కనీసం సంధ్యావందనం గాయత్రి స్వరంతో చెప్పే కుటుంబాలే వెతుక్కునే పరిస్థితి, అటువంటి వారు ఆచార్య వ్యవహారాలు నిర్థారిస్తున్న ప్రతుత పరిస్థితి ద్రావిడులది..." వేదమాత తిరిగి ద్రావిడ బ్రాహ్మణశాఖకు పునర్వైభవాన్ని అందించుగాక అని కోరుకుంటూ...

శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్
శంకరకింకర
ఒక మామూలు ద్రావిడ బ్రాహ్మణుడు

Tuesday, June 14, 2016

పరిణతి


గురుభ్యోనమః
పరిణతి పొందడం చాలా గొప్ప విషయం, కానీ ఆస్థాయి పొందనివారిని లేక నిజాయితీతో భగవంతుణ్ణాశ్రయించేవారిని వెర్రివారిలాగానో, అవివేకిగానో, మూర్ఖుడిగానో మరోటిగానో కించపరచడానికి కాదుగా.. పరిణతి, జ్ఞానం సంపాదించేది లోకుల్ని ఎంచడానికి కాదు, లోక ప్రియత్వం అలవర్చుకోవాలి. భగవంతునియెడ వారినమ్మకాన్ని గౌరవించగలగాలి. అందరినీ ఒక గాట గట్టడానికీ, తక్కువ చేసి నవ్వుకోడానికో, గేలి చేసి లూజ్ వర్డ్స్ వాడటానికో కాదు జ్ఞానం సముపార్జించాల్సింది. వీలుంటే అనునయించి చెప్పాలి. పండితుడన్న అహంకారం వదిలి జ్ఞానం పంచాలి. పండావు అన్నదానికి గుర్తేమిటంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు. ఆ మాటల్లో కరకుదనంలేక ఎంత విజ్ఞతతో 'పండు'తనంతో మాట్లాడావా అన్నది కొలబద్ద.

-శంకరకింకర

Sunday, June 5, 2016

రామాయణమునేఎక్కువ గా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు ...?

ఎవరు వ్రాసారో తెలియదుగానీ, వాట్సప్లో ఫార్వర్డ్ గా వచ్చింది... బావుంది విషయం.
------------------------
రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబల ను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆలా ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతనిఅగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా?
పతివ్రత అయిన సీత తన తపో శక్తితో రావణు ని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా!!?
...... ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్నిఅవసరమైనవి,  కొన్నిఅనవసరమైనవి, మరికొన్నితలా తోక లేనివి. 

ప్ర:రామాయణమునేఎక్కువ గా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు ఈ ఆస్తిక నాస్తికులు?
జ:ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంథం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

ప్ర: అంత ఆదరణ కలగడానికి రామాయణం లో ఏముంది?
జ: రామాయణంలో ఏముంది? అనికాదు, ఏది లేదు?అని ప్రశ్నించు కోవాలిమనం.రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గదర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి. తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః ।।

సకలసద్గుణసంపన్నుడు ఎట్టి విపత్తులకు చలించ ని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్ని టినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు?

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కఃకస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |

సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమునుకూర్చువాడు ఎవరు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |

ధైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతోవిలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేని వాడును, రణరంగమున కుపితుడై నచో దేవాసురులను సైతము భయకంపితు లను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?

ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసు కోవాలని నాకు కుతూహలముగాఉన్నది

అందుకు నారదుడు  పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన శ్రీరాముని తెలుపుతాడు. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసి గాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయో జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు,గొప్ప పరాక్రమ వంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి,జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడు టలో నేర్పరి, షడ్గుణ ఐశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించు వాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గల వాడు,అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థ చంద్రాకారములోఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీర మైననడకగలవాడు .......ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని తెలిపి అతని దివ్య కథను వాల్మీకికి వివరిస్తాడు.

పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములేఅనుకుందాము రామాయణము కేవలము ఒక (చరిత్ర అని గాక) కథ అనుకుందాము. ఈ గుణములన్నీకథా ప్రారంభముననేప్రస్థావించబడ్డాయి అంటే ఇంతటి గుణములుకలనాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!

అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించబడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామిభక్తి పరాయణు డైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బంధం ( రామ సుగ్రీవులు) ఉంది.  పిత్రు వాక్యపరిపాలకుడు గా, శిష్యుడిగా, సోదరుడి గా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్య గుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రావణుని వంటి వారికి కలిగే గతీ వివరించబడింది. ఇది కేవలం ఒక చరిత్ర ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలన లో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామిభక్తిలో హనుమంతుడు, అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింపబడినది. రామాయణంలో ఈ పై పాత్రలన్నీఆయా గుణములలోఅత్యున్నత మైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయా గుణములలో అంత కంటే  ఉదాత్త పాత్రలను సృష్టించలేక పోయారు. అటువంటి పాత్రలను పరిచయం చేసినవాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణము లు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్నఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశ మైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో!! అందుకే మన భారతీయ  లకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

ప్ర: మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

జ: ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయ మైన ఈ రచనలో, అందు లోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.

రామాయణమును గురించి సరైనఅవగాహన లేకపోవడం:
మనకు అనేకరామాయణ ములు వచ్చినవి.వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పు దోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైనఅవగాహన ప్రజలకు లేదు. పైగా పాఠ్యపుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణ మును ఎక్కడాపరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు.అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవు తున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.

గుర్తింపు కోసం: 
అవును.!!గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచువారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టా మనుకోండి వాడికీ వీడికీ ఏదో గొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్యమంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు,వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు. టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదర గొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపుమనకిలభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒకవార్త అవుతుంది. కొన్నిరోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు? కొన్నిరోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు.పైగా మనం అనవసరంగా ఆరాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్నోతిట్టామని తెలిసినా, మనఐడెంటిటీ క్రైసిస్ బయటపడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.

మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన: 
మత వ్యతిరేకతతోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈవిమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వారు ఇందులోనిమంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమంజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా వీరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు,తమదే సరిఅయినమార్గమన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అనిపించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమై నమార్గంలోఉన్నామన్నది వీరి ఆలోచన.తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.

ఋషుల భావం గ్రహించలేకపోవడం: మన పురాణములన్నీ ఋషులచే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు. 
ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసిధనవంతుడైపోతాడుఅలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింపబడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు.సరిగ్గాఇటువంటి సందర్భాలు విమర్శ చేయడానికి అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగానే ధనవంతుడైపోతాడా!!? లేదా పూజ చేయగానే పాపాలన్నీతొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి!!?. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీఎలా సాధ్యం!!?? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా!!? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం.కానీఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? {నన్నుతప్పుగా అనుకోకండి.} నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చిక్రుంగి, కృశించిపోతాం. అంటే తిండి మనకు శక్తిని ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మేసిద్ధాంతం కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమే మైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆ పరిశోధనలను పుస్తకాల లో చదువుకున్నాము కనుక దానినిఅందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే.మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడంతెలుస్తోంది, శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయగలుగు తున్నాం కనుక)మధ్యలో జరిగే గ్లూకోజ్గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికికనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీకొందరు చింతన ద్వారా గ్రహించి (పరిశోధించి) వాటి సారాన్నిమనకు అనేక కథలుగా వ్రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థం కాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.

ఇలా అనేక కారణముల తో రామాయణాదిపురాణ ఇతిహాసములువిమర్శల కు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికి మార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

1. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణా లను (మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.
2. ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చబడినవి ఏమిటో తెలుస్తుంది.
3. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమను కుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండాఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజం ఏమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచకపోతే సరిఅయిన అవగాహన లేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణ ములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

4. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయసాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించపరచ డమే. కనుక చట్టపర మైన, న్యాయపరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి.  అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్నిఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురి నీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నేమనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.

। జై శ్రీరామచంద్ర ప్రభు। 🙏🙏🙏