Pages

Thursday, June 2, 2016

ఆస్తిక్య బుద్ధి.... అనుకున్న పని జరిగితే ఒకలాగ లేకపోతే మరోలాగా..

శ్రీ గురుభ్యోనమః
శుభం

      పొద్దున్న చూసిన ఒకానొక పాత సినిమాలోని రామాయణ వక్రీకరణ చూసి ఖేదం పొంది శ్రీరామాయణం చదువుతుంటే.. శ్రీ సీతారామ కళ్యాణానంతరం, అయోధ్యకాండలో వారి సుఖజీవన వివరణానంతరం దశరథుడు తలపెట్టిన శ్రీరామ పట్టాభిషేకం, కైకేయీ మాత వరాలు సందర్భంలోని కొన్ని విషయాలు మరింత గట్టిగా రామ పాదాలు పట్టుకునేలా చేసాయి. ఘట్టాలు చదువుతూ మదిలో మెదిలిన భావాలతో ....

      మహర్షి రామాయణం చెప్తూ, దశరథుడు రాజ్యాభిషేకం చేసుకోవలసిన రాముణ్ణి పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్తే, ఆయన ముఖంలో మార్పు కనపడిందో చుట్టూ ఉన్నవాళ్లలో ఏమార్పు కనపడిందో చెప్తారు. లక్ష్మణుడుట వేడి ఊపిరులు వదిలి పెద్ద నిట్టూర్పులు వదులుతూ కళ్లనిండా నీళ్ళు పెట్టుకున్నాడట. కానీ, రాముడు గురించి చెప్తూ మహర్షి అంటారు...

వనం గన్తుకామస్య త్యజతశ్చ వసుంధరామ్,
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా!”
రాజ్యాన్ని విడిచి, అరణ్యానికి వెళ్ళనున్న రాముడిలో, లోకంలో ఉండే సుఖదుఃఖాలకు అతీతుడైన యోగిచిత్తం వలె, రాముని చిత్తంలో వికారమేమీ కనపడలేదట. అద్ది కదూ రాముడంటే! నాలక్షయత రామస్య కిమ్చిదాకారమాననే...” రాముని ముఖంలో కొంచెంకూడా ఎటువంటి మార్పూ చూడలేదట.. ఉచితం మహాబాహుర్నజహౌ హర్షమాత్మనః...” తనకు సహజముగా ఉండే చిరునవ్వుని కాంతిని చిత్తానందాన్ని విడువలేదట మృధువుగా మాట్లాడాడట. ఒక్క గుణం మనం అలవర్చుకుంటే ప్రపంచంలో ఎంత శాంతి!?..

      ఆ రాముని గురించి చెప్తూ స్వభావవినీతశ్చ గౌరవాచ్చతదా నతః...” అంటూ స్వభావముచేతనే వినయవంతుడైన రాముడు... అని చెప్పారు. స్వాభావికంగా రాముడు వినయవంతుడు. అంతటి రాముణ్ణి ప్రేమించని వాడెవ్వడు. ఆయన కష్టపడుతున్నాడని చూడలేకపోయాడు లక్ష్మణుడు.
మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ,
కః సమర్థోఽధికం కర్తుం కృతాన్తస్యేవ తిష్ఠతః! అంటూ....
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్!
రామా! ధనుర్థారినై నేను పక్కన ఉండి నిన్ను రక్షిస్తుండగా యముని వల నిలిచి ఉన్న నీలో ఎక్కువ తక్కువలు చేసేవాడెవడు? ... గురువైనా మంచి చెడ్డలు తెలియక అపమార్గం అవలంబిస్తే అతనిని శిక్షించాలి అంటాడు.. అని కోపంలో తప్పులు చెప్తాడు... లక్ష్మణునికి నిజంగా కోపముండి కాదు రాముని మీద ప్రేమతో...

      అప్పుడు రాముడు లక్ష్మణుని మందలించి చెప్పిన మాటల సారాంశం ఏమంటే? "నిన్న రాత్రి పట్టాభిషేక సంబారాలు ఏర్పాటు చేసి నాకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నదీ దశరథడే, ఇవ్వాళ సంబారాలకి బదులు అరణ్యవాస సంబారాలేర్పాటు చేసి వనవాసం చేయమన్నదీ దశరథుడే. నిన్న ఆయన యందు ఎంత ప్రీతి ఉందో ఇప్పుడూ అంతే ప్రీతి ఉంది. రాజ్యమిస్తానన్నప్పుడూ ఆయన పూజ్యుడే, వద్దని వనవాసం చేయమన్నప్పుడూ పూజ్యుడే" అని ఎన్నో విషయాలు చెప్తూ...
నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే
పూర్వైరయమభిప్రేతో గతో మార్గోఽనుగమ్యతే!”
పూర్వాచార విరుద్ధమైన కొత్త ధర్మమును దేనినీ నీకొరకై చెప్పట్లేదు పూర్వులందరూ అంగీకరించి అనుసరించిన మార్గాన్నే  నేను అనుసరిస్తున్నాను అని. చెప్పి, లక్ష్మణుడైతే రాముని వనవాసానికి అడ్డుగా నిలిచాడో అతనితోటే ఒక పని చేయిస్తాడు
సౌమిత్రే! యోఽభిషేకార్థే మమ సంభారసంభ్రమః
అభిషేకనివృత్త్యర్థే సోఽస్తు సమ్భారసంభ్రమః
లక్ష్మణా! ఇంతవరకూ నా పట్టాభిషేక సంబారములను కూర్చడానికి ఎంత ఉత్సాహాన్ని చూపావో అంతే ఉత్సాహంతో సంబారములచేత నా అభిషేకజరగకుండుటకై చూసి వాటిని తొలగించడంలో అంతే ఉత్సాహం చూపుఅని చెప్తారు.
 
      అలాగే ధర్మాన్ని పాలించడంలో తన తండ్రిని సత్యంలో నిలబెట్టడంలో తనకడ్డురావద్దనీ కాళ్లలో కఱ్ర పెట్టవద్దనీ సున్నితంగా చెప్తారు...
కృతాన్తస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ర్పవాసనే
రాజ్యస్య వితీర్ణస్య పునరేవ నివర్తనే
లక్ష్మణా! ఇచ్చిన రాజ్యమును వెనక్కి తీసుకుని నన్ను అరణ్య వాసం పంపుటకు దైవమే కారణము అని తెలుసుకో. కైకేయీ మాతను కానీ, తండ్రిని కానీ, భరతునికానీ నిందింపవద్దు అని చెప్తారు.


      ఆహ్... ఆధృతి కదూ మనం అలవరచుకోవలసినది. నేటికీ మనందరకు, ఆధ్యాత్మిక సాధకులా లేక లౌకికంలో ఉన్నారా పక్కన పెడితే కార్యంలో ఉన్న సాధకులకైనా పైవాక్యాలు ఎంత స్ఫూర్తినిస్తాయి. అనుకున్న పని జరిగితే ఒకలాగ లేకపోతే మరోలాగా ప్రవర్తించక చక్కని వ్యవసాయాత్మక బుద్దిని పెంపొందించుకోవడానికి అంతా భగవన్నిర్ణయం అన్నది మాటలకు కాదు చేతలలో ప్రవర్తనలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఘట్టాలు. తరవాత 14 ఏళ్ళ అనంతరం పట్టాభిషేకం సుఖాంతం అందరికీ విదితమే. ఆస్తిక్య బుద్ధి అంటే చదువుకోడానికో చెప్పుకోడానికో కాదు అన్నిటికీ కారణం దైవమే అని తెలుసుకుని రాముడు నమ్మినట్లుగా నిజంగా ఎప్పుడు నమ్ముతామో కదా...!!!
శం

శ్రీరామార్పణం

Wednesday, June 1, 2016

నువ్వింకా ఇలాగే ఉండిపోయావ్... ఇన్నాళ్ళూ ఏం చేశావ్?



శ్రీ గురుభ్యోనమః
ఉద్ధరేదాత్మానా ఆత్మానం నాత్మానమవసాదయేత్ !
అత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః !!

అతను అప్పట్లో ఎలా ఉండేవాడు అని కాదు, ఇప్పుడెలా ఉన్నాడన్నది ముఖ్యం. వాడా! అప్పుడెలా వుండేవాడనుక్కునారూ.. అని బుగ్గలు నొక్కుకోవడం కాదు. అప్పుడతనూ నువ్వూ ఒకేలా ఉంటే ఇన్నేళ్ళయ్యింతరవాత చూస్తే ఇప్పుడెందుకు అతనంతవాడయ్యాడు నువ్వింకా ఇలాగే ఉండిపోయావ్... తేడా ఎక్కడుందో చూసుకో... ఎవరో ఎప్పుడో ఎలాగో ఉన్నారని కాదు..... ఇప్పుడునువ్వెలా ఉన్నావ్.. ఇన్నాళ్ళూ ఏం చేశావ్ అన్నది చూసుకో...

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి...

-శంకరకింకర


Thursday, May 26, 2016

ప్రవచనం - వ్యాఖ్యానం


శ్రీ గురుభ్యోనమః
పురాణేతిహాసాలు ప్రవచనం చేస్తారు - అంటే అందరికీ అర్థమయ్యేలా బోధ చేస్తారు.


ఉపనిషత్తులు వ్యాఖ్యానం చేస్తారు - అంటే ఏ శిష్యుడైతే బ్రహ్మమును గురించి తెలుసుకోవాలనుక్కుంటాడో ఆ శిష్యుని దగ్గరగా (ఉప) కూర్చోబెట్టుకుని (నిషత్) పాఠం చెప్పి బోధిస్తారు. గుంపులు గుంపులుగా బహిరంగ వేదికలమీద కాదు.
-శంకరకింకర


Friday, May 20, 2016

చర్చకి తీసుకున్న ఆరోపణలే తప్పు మహానుభావా!

శ్రీ గురుభ్యోనమః

చర్చకి తీసుకున్న ఆరోపణలే తప్పు మహానుభావా! అంటుంటే దాన్ని దాటి అభిమాన దృష్టితో అక్కడక్కడ ముక్కలు శ్లోకాలు చేర్చి ప్రమాణం చూపుతాననడం ఏం ప్రమాణం వైపు శాస్త్రం ఉందనీమరోవైపు శాస్త్రం లేదనీ కలగాపులగం చేస్తే.... చర్చలో తర్కంలో అభిమానానికి ద్వేషానికి తావుండనప్పుడే సిద్ధాంతం సాధింపబడుతుంది. లేకపోతే శంకురుల సోపాన పంచకంలో వద్దన్న చర్చ అవుతుంది. పోనీ చర్చిద్దామంటే, విషయం, తర్కం, ప్రమాణం ఏదీ సరిగా చెప్పరు అటంటే ఇటు ఇటంటే అటు శాస్త్రంమీద అభిమానం ఉండాలి కానీ చర్చా విషయం మీద కాదు..అటువంటి చర్చలకి మీరు నన్ను దూరం చేయడం కాదు, శంకర కింకరుడిగా అటువంటివాటిని నేనేదూరం. నేనేకాదు వ్యాస శంకర వాఙ్మయాన్ని నిజంగా ప్రమాణంగా ఉన్న ఎవరైనా అంతే! నిష్పక్షపాతంగా పాత్రల తీరుతెన్నులెండకట్టగలగాలి, తప్ప కొన్ని పాత్రల మీద అభిమానం కాదు.,

-శంకర కింకర

Friday, May 13, 2016

ఓ హిందువా! మేలుకో!


శ్రీ గురుభ్యోనమః
శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు పిచ్చిరాతలు రాయడమేమిటి?

 హిందువా! మేలుకో! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.

శంకర జయంతి శుభాకాంక్షలు.

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః !
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః !!

జయ జయ శంకర హర హర శంకర
-శంకరకింకర