Pages

Monday, May 2, 2016

సనాతన ధర్మం మీద మరోదాడి - సెల్ఫ్ గోల్

శ్రీ గురుభ్యోనమః
ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న మరోదాడి. ఇదెలా ఉంటుందంటే చాలా చక్కగా, అందంగా, అంతా మన పరిథిలోనే ఉన్నట్టుంటుంది. ఫుట్బాల్ లో సెల్ఫ్ గోల్ వంటిదిది. సరి వివరంలోకి వెళ్తే...  మనకే తెలియకుండా మనకంట్లో మనమే వేలు పెట్టి పొడుచుకునే చందంగా కొందరు పండితులు తయారయ్యారు. వారికున్న పాండిత్యాన్ని ఎంచట్లేదు ఎటువంటి అగౌరవాన్నీ ప్రకటించబోవట్లేదు. వాస్తవంగా జరుగుతున్న, లేదా వారి మాటల ప్రాచుర్యం వల్ల జరగబోయే పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించి పరాకు చెప్పుకోవడం నా ఉద్దేశ్యం

సనాతన ధర్మం మరోపేరే వేదధర్మం. వేదంలో ఆచారకాండ, జ్ఞాన కాండ రెండూ ఉంటాయి. దీన్ని సరి ఐన రీతిలో అర్థం చేసుకోవడానికి దానికి అంగాలు అంగాలకి ఉపాంగాలూ ఇవన్నీ ఉన్నవన్న విషయం అందరికీ విదితమే. ప్రవృత్తి, నివృత్తి రెండు మార్గాలు. మన ధర్మానికి కర్మ-ఆచరణ, జ్ఞాన సముపార్జన రెండూ రెండు పాదాలవంటివి. రెంటి పాదాలతో చేసిన నడకయే చివరగమ్యమైన అద్వైత స్థితికి తీసుకెళుతుంది (సర్వ సామాన్యులైన అందరికీ ఇదే దారి, అవతార పురుషుల గురించి, అటువంటి విషయాలలో విశేష విభూతి కలిగిన వారి గురించి కాదు). ఐతే పండితులు యోగ వాశిష్ఠాన్నో, భగవద్గీతనో, రెండుమూడు ఉపనిషత్తులనో పట్టుకుని వాటినే బోధిస్తూ కర్మలను, ఆచారాలని తూలనాడడం లేదా వాటిని తుచ్చమైనవిగా చూడడం జరుగుతోంది. ఐతే అవి వారు వ్యక్తిగతంగా వారి వారి శిష్యులను ఆస్థాయిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పడంలో ఇబ్బంది ఉండదు. కానీ సార్వజనీకంగా చెప్పినప్పుడే ఇబ్బంది. వేద విహితమైన కర్మలనాచరించి చిత్తశుద్ధిని పొంది ఔపనిషద్ సార జ్ఞానాన్ని పొంద వలసిన విషయాన్ని. తేలిగ్గా సార్వజనీకంగా చెప్పి జాతిని కర్మ భ్రష్టత్వం వేపు, ఆచార భ్రష్టత్వం వేపు ప్రేరేపిస్తే రేపొద్దున్న జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఇప్పటికే పలు మహిమాన్విత అవధూతల అనుయాయులవల్ల ఆచారభ్రష్టత్వం మొదలైంది.. కాదా..?

అవధానిగారు సంధ్యావందనం అక్కరలేదు, మనం అర్ఘ్యమిస్తేనే సూర్యుడుదయిస్తున్నాడా! ఏం అక్కరలేదు.. స్నానం చేసి తువ్వాలు కట్టుకుని పదకొండు మాట్లు గాయత్రి చెయ్ చాలు అని టీవీలో ఉవాచ. ఆశ్చర్యం!! ఏం చెప్తున్నామ్ మనం? బహుశా ఆయన కూడా ఏం చెప్పారో ఆయనకే తెలియకుండా చెప్పుంటారు మరి అని నా భావనప్రమాదో ధీమతామపికదా. ఎవరైనా అలా కాదు తప్పకుండా విహిత కర్మ చెయ్యండి అని చెప్తే కండువాగాళ్లంతా అంతే అని ఆయన ఎవర్ని అంటున్నారు. ఉత్తరీయం / కండువా శ్రామికుడి దగ్గరనుంచి పండితుడివరకూ అందరూ వేసుకునే అలవాటు భారతీయ వస్త్రధారణది. పట్టణాల్లో కరువైందేమో కానీ, ఊళ్ళలో ఇంకా ఉంది. నీకు కర్మాచరణ అలవాటుందో లేదో తెలీదు , నోటికి అమ్మవారు విభూతినిచ్చింది.. కర్మలక్కరలేదు కర్మలక్కరలేదు అని నోరేసుకు పడిపోవడం. కర్మ చేయమని చెప్పినవాడిమీద కుళ్ళుకోవడం.. ఇదేనా జ్ఞానం. యోగవాసిష్టం ఇదా చెప్పింది, ఉపనిషత్తులివా చెప్పాయి? సత్యం బ్రూయాత్ .. నిజం చెప్పు, పబ్బం గడుపుకోడానికి ఉనికి కాపాడుకోడానికి లేనిపోనివి కల్పించి స్వబుద్ధి స్వప్రమాణం చెప్పకు. చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివేసాక కీకరకాయ అన్నాట్ట ఇలాంటి పండితుడు..

జ్ఞానం పంచాలి, జ్ఞానం పొందాలి తప్పని ఎవరూ చెప్పరు, ఐతే కర్మలను వదలమని చెప్పడానికి, తద్విధంగా శాస్త్ర ప్రమాణాన్ని మార్చాలని , లేదా వాటిని  వదిలి ముందుకు సాగమనీ ఎలా చెప్తున్నారో అర్థం కావట్లే. అపర శంకరులు అని పేర్గాంచి, ప్రతివాదభయంకరులై సర్వవిద్యలకు తానే ఆలవాలం అయిపోయిన సార్వభౌమ పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత భారతీ తీర్థ స్వామి అంతటివారు వేద విహితమైన కర్మలను మార్చే అధికారం ఎవరికీ లేదు ఆచరించవలసినదే అని చెప్తే, సంధ్యావందనం వదిలేయమని చెప్పే అవధాన్లు మరి వారిని మించిపోయారో అర్థం కావట్లేదు.  రకం ప్రచారం, బోధలు ఎంత దారుణమైనవంటే... కాయలని తీసుకొచ్చి కాభొహైడ్రేట్స్ వాడి పండేలా చేయడం వంటి దారుణ నేరం. పువ్వు పుట్టాలి, పిందె అవ్వాలి, కాయ అవ్వాలి, దోరగా మాగాలి, రంగు మారాలి, పండి కొమ్మనుండి విడివడాలి. తప్ప కర్మలక్కరలేదు జ్ఞానం ఒక్కటీ చాలు అని చెప్పడం ఇంతే దారుణమైన నేరం. ఆవ్యాపారులు తినే తిండి కాలుష్యం చేస్తే, ఇలాంటి పండితులు అవధానులు బుద్ధి కాలుష్యం, భావ కాలుష్యం ప్రసరింపజేసి సనాతన ధర్మ ప్రచారం అనుక్కుని  ద్రోహం చేస్తున్నారు. నాకు ప్రమాణం శంకరుల వాఙ్మయం. ప్రతీదానికీ రండి చర్చకి అంటారుగా నేను రెడీ, శంకరుల సోపాన పంచకం మొదటి శ్లోకం నా ప్రమాణం మీకు అవునా కాదా తేల్చండి.

అసలు ప్రతిదానికీ శంకరుల అద్వైత సిద్ధాంతం... స్నానం వద్దు జ్ఞానం కావాలి అని... అనేటప్పుడు శంకరుల ఉపదేశం ఎందుకు గుర్తు రాదు. శంకరులు కర్మ వదిలెయ్యమన్నారా? అత్యంత శ్రద్ధతో కర్మలనాచరించవలె కాదా, అది కానప్పుడు శ్రద్ధయొక్క అవసరమేమి? వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్ తేనేశస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతామ్ పాపౌఘః పరిధూయతాం భవ సుఖే దోషో 'నుసంధీయతామ్ ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్...  "కర్మలని చక్కగా చేయమని శంకరాచార్యులు చెప్తే వ్యతిరిక్తంగా నోటితో చెప్తున్నారు?" కర్మలని శాస్త్ర ప్రమాణాలని వదలమని ఎవరైనా సనాతన ధర్మంలో చరిస్తున్నవారు చెప్తే... ధర్మ ప్రచారం ముసుగులో ద్రోహం చేయడమే. నా దృష్టిలో ఖచ్చితంగా ఎంత పాండిత్యం ఉన్నా వర్జించవలసినవాడు. నాస్తికుడు, శాస్త్రం మీద, తద్విహిత కర్మాచరణం మీద నమ్మకం లేని వాడు ధర్మంలో ఉండి చేసే పని, చెట్టులోపల ఉన్న అగ్ని చేసేపని ఒక్కటే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా నాస్తికుడే.


కామాక్షీ పాదార్పణమ్

Sunday, May 1, 2016

ఈశ్వరుడు సతీదేవితో చెప్పిన మాటలు


నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్లస త్కీర్తి గొం
దరు కామించి యశక్తులై మనములన్ దందహ్య మానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముండీ శ్వరుండైన  యా
హరితో బద్ధ విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
అహంకారమూ, దోషములు లేనివారు కావటం చేత సజ్జనులకు గొప్ప కీర్తి లభిస్తుంది. అట్టి కీర్తి తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ, వారు అసమర్ధులు కావటం వల్ల వారికి ఆ కీర్తి రాదు. అందుచేత మనసులో కుతకుత ఉడికిపోతారు. భగవంతుడైన విష్ణుమూర్తిపై రాక్షసులు పగను పెంచుకున్నట్లు, కారణం లేకుండానే దుర్జనులు సజ్జనులపై అసూయను పెంచుకుంటారు. (పోతన భాగవతం - ఈశ్వరుడు సతీదేవితో చెప్పిన మాటలు)                                

Friday, April 15, 2016

అమ్మా! కామాక్షీ! నీ కరుణా కటాక్షము రాముడే!

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కుంఠీకరోతు విపద్మమ కుంచిత భ్రూ
చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః!
రక్షోపకార మనిశం జనయన్ జగత్యామ్
కామాక్షి! రామ ఇవతే కరుణా కటాక్షః!! (మూక మహాకవి)

అమ్మా! కామాక్షీ! నీ కరుణా కటాక్షము రాముడే. రాముడు వంచిన ధనస్సు కలిగినవాడు. నీ కటాక్షము వంచిన కనుబొమలు కలది. కటాక్షము సంసారులలో దేహ అనుభవ అనురాగ రాహిత్యాన్ని పొందింపచేస్తుంది. రాముడు ’విదేహ’ రాచకన్య సీతమ్మను పొందినవాడు. కటాక్షము అనునది జగత్రక్షణమునకు ఉపకారము చేస్తుంది. రాముడు జగద్రక్షణోపకారమొనర్చినవాడు. ఈ నీ కరుణా కటాక్షమే రాముడు రాముడే నీ కరుణా కటాక్షము.

Monday, March 7, 2016

ఈ అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

శివరాత్రి వ్రతం ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, మహాలింగేష్టి ఎన్నో ఎంతో హడావుడి చేస్తాం. భక్తి శ్రధాసక్తులతో చేసే కార్యాలు అనంత ఫలదాలు. నిస్సందేహం. ఐతే శివరాత్రి ఒక గొప్పనైన ఉపకారపు సందేశాన్నిస్తున్నది. అది అందుకున్నవారికి అందుకున్నంత... టూకీగా ఇందులోని ముఖ్యవిషయాలు తీసుకుంటే

) పరబ్రహ్మము సృష్టిలో మొదట చేసిన ఉపదేశంతపించు’ - తపస్సు చేయడం. ఏపని చేసినా తపస్సు చేయడం. తపస్సెప్పుడూ పక్కవాణ్ణి మెప్పించడానికో, పరపతి పెంచుకోడానికో కాదు అదెప్పుడూ ఆత్మానందానికే
) వేరే వ్యక్తి, పెద్దవాడు, భగవదనుగ్రహం ఉన్నవాడు కనిపిస్తే వినయంతో ప్రవర్తించక, తనకన్న అధికుడు కాదని లేదా అల్పుడని ఎంచి అహంకరించవద్దు.
) పేరు, పరపతికోసం, అసత్యమాడవద్దు, అసత్యమాడించవద్దు.
) లేని పెద్దరికం, లేని అర్హతలతో సత్యాన్ని మరుగునపెట్టి నేనధికుణ్ణని బీరాలు పోవద్దు.
) నాకు తెలుసు, నాకే తెలుసు, అవతలి వారెంత అని ఇచ్చవచ్చినట్లు ఎంచవద్దు.
) నేను గొప్ప అని అహంకరించి నువ్వు చెప్పడం చెప్పించుకోవడంకాదు, వినయశీలివైన నీ సుగుణాలను పెద్దలైన వారు గుర్తించాలి.

చూడండి అగ్నిస్తంభ ఆవిర్భావఘట్టంలో పైవన్నీ కనిపిస్తాయి. అది సృష్టి కర్త లోకానికి నేర్పే గుణపాఠమే ఐనా తానే మూడుగా మారి పాఠం చెప్తాడు. అందుకోవలసినవాడందుకోకపోతే రజోగుణ తమోగుణాలు పెచ్చరిల్లి జరగవలసినది జరుగుతుంది. శివరాత్రి నాడు ఓహ్ గొప్ప గొప్పవి బ్రహ్మాండమైనవి ఐన పూజలు, ఉపవాసాలు, జాగరణ చేసి నేర్చినదేమైనా ఉందా? అన్న విచారణ ముఖ్యం. అది అత్యంత ఉద్ధరణ కారకం. అప్పుడు పెల్లిబికే భక్తి శ్రద్ధలు వాటి స్థాయి ఉత్తమం.

ఎంత బ్రహ్మగారైనప్పటికీ విష్ణువు ఆధిక్యమేమి అని ప్రశ్నించారు అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. చిన్నపెద్ద అంతరం లేకుండా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న విష్ణు మూర్తితో తలపడ్డారు. కారణం ఏమిటి దీనికి, నేను గొప్ప, నేను అధికుణ్ణి అని నిరూపించుకోవడం తప్ప వేరు కారణమూ కనపడదు (భగవంతుని లీల మాయ అన్నది పక్కనపెట్టండి). మన జీవితంలోనూ ఎందరినో చూస్తుంటాం ఎన్నో పటాటోపాలూనేనది నేనిది వాడెంత వీడెంత నాఅంత వాణ్ణి నేను అనే వాళ్ళు కోకొల్లలు అది రంగమైనా సరే అలాంటి వాళ్ళు చాలా కనపడుతుంటారు.

ఇక విష్ణు మూర్తో తన మానాన తాను తపస్సు చేసుకుంటుంటే వచ్చిన బ్రహ్మగారితో అలాకాదురా అబ్బాయి ఇదీ విషయం అని చెప్పారు, బ్రహ్మగారు విన్నారా లేదు. పోనీ వెళ్ళిపోయారా విష్ణుమూర్తిని ఆయన తపస్సుకి ఆయనని వదిలి అంటే అదీలేదు. కయ్యానికి కాలు దువ్వారు. మొదట బ్రహ్మగారికి అహంకారం పెచ్చుమీరింది, నేనెందుకు తగ్గాలని విష్ణుమూర్తి కయ్యానికి సిద్ధపడ్డారు. చూడండి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుక్కునే మనస్తత్త్వం వల్ల ఎంత ప్రమాదం వాడు ఆవేశకావేశాలకి లోనై ప్రశాంతంగా ఉన్నవాడినీ పాడుచేస్తాడు. ఎంత భయంకరమైన అహంకారపుటజ్ఞానం!!! అప్పుడే కదా జ్ఞానం కావాల్సింది.

కథగా, లోకులకి పాఠంగా చెప్పాలంటే, పరబ్రహ్మం ఊరుకోదు కదా సాధుజనులవద్దకెవరైనా వస్తే... సరే ఇద్దరి మధ్యలో అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడా ఇద్దర్లో ఎక్కూ తక్కూలే... సరే ఒకరు హంస రూపమై ఆది చూస్తానన్నారు మరొకరు సూకరమై అంత్యం చూస్తానన్నారు... ఇద్దరివల్లా కాలేదు.

సత్వగుణ ప్రధానుడు, వినయంతో పరబ్రహ్మం చెప్పిన మాటవింటూ తపస్సు చేసుకునే విష్ణుమూర్తికి అర్థం అయ్యి తేరుకొని స్వస్థితికి వచ్చి ఎక్కడమొదలైయ్యారో అక్కడికి వచ్చారు. మరి బ్రహ్మగారు ఉక్రోషం పెరిగి ఎక్కడ విష్ణుమూర్తి ఆధిక్యాన్ని ఒప్పుకోవాల్సొస్తుందో అని ఎదురుగా వచ్చిన మొగలి పువ్వుని, ఆవుని అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే ఎవరితో కూడాలి ఎవరిని వదలాలి అని. మొగలి పువ్వు, ఆవు ఏది ఏమైనా  పరవాలేదు మేము అబద్ధం చెప్పము, మాకు పరమేశ్వరుడున్నాడు అని నమ్ముకుంటే సరిపోయేది, కానీ మొహమాటానికి లేని గౌరవాలకో అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నాయి.

సర్వజ్ఞుడు ఆయనకి తెలీదూఎంత వేదాలని గడగడా వల్లించి సృష్టి చేసే బ్రహ్మైనా... ఇంత అహంకరించినందుకు ఫలితంగా ఒకకుత్తుకతెగింది తస్మాత్ జాగ్రత్త ఎదుటివారి ఔన్నత్యాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే ఆతల ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని పరమేశ్వరుని తీర్పు శిరోధార్యంగా ఇందులోంచి తీసుకోవాలి. ఎంత బ్రహ్మగారైనా ఆలయమేలేకపోయింది. అంటే పదిమందీ పూజించడానికి అర్చించడానికీ కుదరకుండా ఐంది.   అటువంటి వారికి సహకరించినందుకు ఎంత గొప్పనైన గుబాళింపుంటేనేమి? మొగలికి స్వామి పాదాలు చేరే అర్హత జీవితంలో కోల్పోయింది. ఎంత పవిత్రమైన దైనా అమ్మా అని అందరూ పిలిచినా గోమాత తన ముఖానికి పూజా కోల్పోయింది.

అహంకారులు, గొడవలు పెట్టుకునేవారు, చులకన చేసి గేలిచేసేవారున్నా తనకు విధించిన తన కర్తవ్యం చేస్తూ ఉన్నవాడు లోకానికి నాథుడైయ్యాడు పరమపూజ్యుడై జగన్నాథుడై అనంత నామాలతో కొడియాడబడుతూ సృష్టిలో ఆలయాలలో ఇళ్లలో పూజలనందుకొంటున్నారు. ఒక్క అహంకారం ఎంత పని చేస్తుందో మనం ఎరగాలి. వినయంగా మౌనంగా ఉన్నవాడు ఎదురుగా మాటలు భరిస్తున్నవాడు అశక్తుడు కాదు సాధువు అని గుర్తెరగి జాగ్రత్తగా మసలుకోగలగాలి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

ఇలాంటి మూర్తీభవించిన అజ్ఙానపు అహంకారపు తలపులతో ఉన్నవారు కోకో..... కో కొల్లలు... ఎంతమందిని చూస్తుంటాం  ఏ సాహితీరంగమైనా, ఏ కార్యాలయాలైనాఏ రాజకీయ రంగమైనా, ఇక్కడా అక్కడా కాదు ఆధ్యాత్మిక రంగమైనా సరే బహుశా ఇక్కడే కాస్త ఎక్కువేమో ఇది... వాళ్ళు వీళ్ళుకాదు ఇది వ్రాస్తున్న నాతో సహా ఎందరో... అది పోగొట్టుకునే భాగంగా ఈ చిన్ని ప్రయత్నం.. పరమేశ్వరునికి ఈ నివేదనం..

Tuesday, December 1, 2015

దుస్సంగమును వర్జించాలి

జగద్గురు భారతీ తీర్థ స్వామి బోధ

మానవ మేధస్సు, బుద్ధి జీవితంలో గొప్ప పాత్రని పోషిస్తాయి. దానిని అదుపులో ఉంచుకోవడం ద్వారా వ్యవసాయాత్మిక బుధ్దిని ఎప్పుడూ ప్రోది చేసుకోవాలి. దానివల్ల నిత్యము సంతుష్టులై ఉండగలరు. లేకపోతే దుఃఖములు లేదా చెడుఫలితములను పొందగలరు. 

ఒకానొక రాజు వద్ద కొందరు మంత్ర్రులు, సేవకులు ఉండేవారు వారిలో ఉత్తముడైన భర్ఛు అనే సేవకుడు ఆ రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రుడు రాజుమెచ్చినవాడు ఆరాజు ఆంతరంగికుడూనూ. ఈ విషయం మంత్రులకి గిట్టేది కాదు. ఒకనాడు పథకం వేసి బెదిరించి ఆ సేవకుణ్ణి ఎత్తుకు పోయి అడవిలో వదిలి వచ్చేసారు. రాజుగారికి ఆ సేవకుడు అడవిలో క్రూర మృగాల వల్ల చనిపోయాడని చెప్పి కట్టుకథ అల్లి నమ్మించారు. ఆ రాజు కూడా నిజమని నమ్మి మంత్రుల సహచర్యంలో రాజ్యం నిర్వహిస్తూండేవాడు. ఒకనాడు ఆ రాజు అడవికి వేటకెళ్ళాడు. వేటలో తిరిగి తిరిగి ఎన్నో మృగాలను చంపి అలసిపోయి విశ్రమిస్తూండగా అక్కడ అడవిలో మంత్రులచే వదిలివేయబడ్డ సేవకుడు తారసపడ్డాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు తేరుకొని ఆ సేవకునితో మాట్లాడకుండా అతనిని పలకరించకుండా తిరిగి తనతో తీసుకెళ్ళకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కారణం తన మంత్రులు చెప్పినదే నమ్మి ఆ కనపడ్డది తన సేవకుని ప్రేతాత్మగా తలవడం.

ఒక్కసారి దుస్సాంగత్యానికి అలవడ్డామా ఎంత సద్విషయమైనా తలకెక్కదు. దీన్నే సహవాస దోషం / దుస్సంగం అంటారు. దుస్సంగత్వం వల్ల శ్రుతి బోధలూ , గురు బోధలూ కూడా పెడచెవినపెట్టే విషయములుగా తోస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రయత్న పూర్వకంగా దుస్సంగమును వర్జించాలి!