Pages

Monday, June 17, 2013

అన్ని భూమికలలోని వారినీ ఉద్ధరించేది సనాతన ధర్మం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
  
సనాతన ధర్మం చాలా మంది అనుక్కునట్లు ఒక్కరిద్దరినో లేదా ఒక వర్ణం వారినో ఒక ఆశ్రమం వారినో మాత్రమే ఉద్ధరించేది కాదు. తత్వ్యతిరేక భావనలు సిద్ధాంతాలు ప్రచారం చేసే మతాలు అందరినీ ఉద్ధరించేవి కావు. సనాతన ధర్మంలో ఫలానా వ్యక్తి ఉద్ధరణకి పనికిరాడు అన్న విధానము సిద్ధాంతము లేదు, నువ్వు ఇలా లేవు కాబట్టి నిన్నస్సలు ఉద్ధరించడం నువ్వు ఉద్ధరణవేపుకి వెళ్ళడం కుదరదు ధర్మంలో అని లేదు. అన్ని రకాల విభిన్న విశేషాలున్న వ్యక్తులైనా సరే  అన్ని భూమికలలోని వారిని ఉద్ధరించగలిగే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం అందుకే దానికి సార్వభౌమ ధర్మం అని పర్యాయం.

సనాతన ధర్మంలో ఖచ్చితంగా
-ఒక పండగ చేసుకోవలసిన తీరులో చేసుకొని ఉన్నతిని పొందవచ్చు, ఒక్క ఏకాదశి, ఒక్క శివరాత్రి చాలు.
-నిరంతరం ఒక స్తుతి చదివుతూ ఉన్నతిని పొందచ్చు, ఏమీ వద్దు కేవల భగవన్నామ స్మరణం చాలు.
-ఎన్ని తప్పులు చేసినా తప్పు తెలుసుకొని సంపూర్ణ ప్రాయశ్చిత్త చిత్తంతో శరణాగతిద్వారా ఉన్నతిని పొందచ్చు, దీన్ని కన్ఫెషన్స్ తో పోల్చడం కన్నా తెలివితక్కువతనం లేదు.
-మరణం తరవాత చేసుకొన్న మంచి, చెడు కర్మలను బట్టి ఊర్థ్వ/అధోలోకాలుంటాయి. అది ఆశచూపడం కాదు అది సనాతన ధర్మ మూల సిద్ధాంతాలలోఒకటైన కర్మ సిద్ధాంతం. దీన్ని ప్రశ్నించేవాడు ధర్మంలో చరించేవాడే కాదు. అవైదిక మతంలో చరిస్తూ ప్రచారం చేస్య్కొనేవాడికన్నా అసలు వాడే ధర్మానికి బద్ధవిరోధి కూడా.
-జీవన్ముక్తులు అనే పదం లేదా పదం అన్వయమయ్యేది సనాతన ధర్మంలోని వారికే, అక్కణ్ణుంచే ఇతర మతాలు అరువెత్తుకెళ్ళాయి. ఇక్కడే ఇప్పుడే బ్రతికుండగానే ఆత్మ స్వరూపుడవు కావచ్చు, సత్యం తెలుసుకొవచ్చు అనేది కేవల సనాతన ధర్మ సిద్ధాంతమే, ఇతరత్రా మనిషి బుద్ధిలోంచి పుట్టినది కాదు.
-తెలిసో తెలియకో మహాత్ములు తిరుగాడిన ప్రదేశాలలోగానీ, ఆశ్రమాలలోగానీ, వారు వసించిన ప్రదేశాలలోగానీ, పుణ్యక్షేత్రాలలోగానీ ఎందుకు తిరిగినా ఎప్పుడు ఎలా తిరిగినా అది కేవల భగవత్సంకల్పం దానివల్లనూ ఉన్నతమైన ఫలితాలుంటాయి, ఒక్క నదీ స్నానం చాలు, ఒక్క తీర్థ నమస్కారం చాలు ఉద్ధరింపబడడానికి. తప్ప అది గొఱ్ఱెలు, పందులు రొచ్చులోపడి తిరిగేలాంటి చందంకాదు.
-హాస్యోక్తులలో భగవన్నామం తలచుకున్నా భగవంతుడుద్ధరిస్తాడు
- ఇంకా ఎన్నో రకాలు, ఒకటి కాదు రెండుకాదు ఎంతమంది ఎలా ఉద్ధరింపబడ్డారో అని తెలుసుకోవడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు
-ఎన్నో ఎన్నో విధాల అందరినీ ఉద్ధరించగలిగే ధర్మం నా సనాతన ధర్మం - సార్వభౌమత్వం ఉన్న ఏకైక ధర్మం

భగవత్తత్వం పరిశీలించి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే తత్త్వజ్ఙ్యుడైనా, అపార భక్తి విశేషం కలిగిన వాడైనా, తీర్థయాత్రా సేవనం చేయగలిగే వాడైనా, ఏమీ లేకపోతే రోజూ నియమంగా నమస్కారం పెట్టుకునేవాడైనా సరే... ఆఖరికి జీవిత పర్యంతమూ ఎటువంటి భగవత్ సంబంధ విశేషంమీద అనురక్తి లేకున్నా వ్యక్తి జీవితంలోని నీతి నిజాయితీలనుబట్టి ఉత్తరజన్మోద్ధరణం సూచిస్తుంది మన ధర్మం. మన ధర్మం, మన ఆలయాలు, తీర్థ క్షేత్రాలు వాటి సందర్శనం చేసేవాళ్ళని చులకన చేయడం వాళ్లని బుద్ధిహీనులుగా చిత్రీకరించడంలేదా అలా అనుక్కోవడం అదీ పెద్దలుగా చెలామణీఅవుతూ చేస్తుంటే అది కుపాండిత్యమేతప్ప ఉపాధిలో పండిందిఏమీలేదు అంతా అపక్వమైన జ్ఞానమని తెలుస్తుంది. ’జ్ఞానఖలుని యోని శారదయోలెఅన్నట్లు ఉన్నత విషయాలు తెలుసుకోవడం కాదు అది ఆచరించి అడుగున ఉన్నవారి భావనా సౌకుమార్యాన్ని గ్రహించి వారినీ కలుపుకుని వెళ్ళలేకపోలేని వాళ్ళని చూస్తే ఉన్నతుడుగా కనపడుతున్నా స్థితిలోఉన్నారో అర్థం అవుతుంది. తక్కువ స్థాయిలో ఉన్న జనాలని చూసి పై స్థాయిలో ఉన్నవాడు చీదరించుకోనక్కరలేదు అలా అని తలకెత్తుకుని తిరగక్కరలేదు. వారి భావనలని ఉన్నతివేపుకు నడిపించే విధంగా మాట్లాడగలిగి మంచి పంచుకోగలగాలి. వినక మొండిగా వాదిస్తే ఊరుకోవాలి.
 గుళ్ళూ గోపురాలు పూజలు ఎందుకున్నాయో తెలియకుండానే జనాలున్నారని చెప్పేటప్పుడు అవి ఎందుకున్నాయో విప్పి చెప్పగలిగేంత సమర్థత ఉండీ చెప్పక, అన్యులని మనుష్యులకన్నా తక్కువ జాతి జీవులతో పోల్చి అవమానిమ్చడం హేయం. వాళ్ళను చూసి చీదరింపులెందుకు? అదేదో సినిమాలోలాగ దీన్నే మా ఊళ్ళో..... ’అహంకారంఅంటారు. పుంఖాలు పుంఖాలు రాతలు కాదు చేతలేవీ? నీకంత విషయ పరిజ్ఞానం ఉంటే పంచుకో ఓపికలేకపోతే నీ అనుష్ఠానం నువ్వు చేసుకో తప్ప సామాన్య జనాన్ని వెర్రి వెర్రి భావజాలంతో పదజాలంతో గుళ్ళూ గోపురాల్ని తీర్థాల్ని రొచ్చుల్తో పోల్చడం ఖచ్చితంగా నేరం.

గుళ్ళూ గోపురాలు పూజలు మనిషిలో మార్పును, తద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యాలను పెంపొందించే కేంద్రాలు. మానవజాతి ఉన్నతికి పాటుపడేవి గుళ్ళు గోపురాలు పూజాదులేనని మాత్రం తెలివున్నవారికైనా స్పష్టంగా ప్రకటంగా కనపడుతుంది. అవి అంతర్లీనం కావు. సనాతన ధర్మంలో రెండు రకాల ఉపాసనలూ ఉంటాయి ఒకటి అంతర్ముఖత్వంతో చేసేవి, రెండు బహిర్ముఖంగా సామూహికంగా చేసేవి. తప్పబద్ధకపుసిద్ధాంతాలు ప్రకటించే మతంతో పోల్చవలసిన దుస్థితి సనాతన ధర్మానికి లేదు, అలా చేసే తేడాబుద్ధిఉన్నవారుండొచ్చు.

సాటి మనిషిని సాధనలోఉన్నవాణ్ణి కనీసం వాడి స్థాయికి తగ్గట్టు చూడక, వాళ్ళు తెలిసో తెలియకో చేసే తప్పులో పొరపాట్లో చూసి వీలైతే నచ్చచెప్పి మార్పించాలి, వినకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి, తప్ప కలిసిన ప్రతివాడినీ, వాణ్ణి ఇలా తిట్టాను వీణ్ణి ఇలాదులిపాను అనే హక్కెక్కడిది. సనాతన ధర్మంలో ఒకరిని అలా తిట్టాలంటే కేవలం తల్లి దండ్రులయ్యుండాలి లేదా గురువైయుండాలి లేదా అవతలి వ్యక్తికి గురుతుల్యుడయ్యుండాలి. అనవసరంగా లేని పెద్దరికాన్ని అన్యమతంలోని నాలెడ్జితో తెచ్చిపెట్టుకొని ఈధర్మంలోని వారిని కడగక్కరలేదు అవసరమైతే నీ బుద్ధితో నీకు నచ్చిన మతావలంబనం చేస్కోవచ్చు మా సనాతన ధర్మానికి ఏం నష్టం లేదు. పనికిరాని బుద్ధి ప్రోది చేసుకున్నవారికి ఇవన్నీతెలియంది కాదేమో బహుశా...

ఐనా బుద్ధిలేని ఆచరణ శూన్యమై, అర్థరహితమైన సిద్ధాంతలతో ఉన్న మతాలని పొగిడేవారికేంతెలుస్తుంది సనాతన ధర్మ ఔన్నత్యం............... అదేదో పాండ్స్ పౌడర్ వాసన సామెత లాగ.

ధర్మస్య జయోస్తు - అధర్మస్య నాశోస్తు
వేదమే ప్రమాణం - సనాతన ధర్మం సార్వభౌమికం
హర హర శంకర - జయ జయ శంకర

Wednesday, June 12, 2013

అవైదికమైన మతాలు ఏవిధంగా సనాతన ధర్మంకన్నా ఉన్నత ప్రమాణాలు కలవి?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నుండి కొద్దిగా సంగ్రహించి, ఇతర పెద్దల వల్ల తెలుసుకొన్నది, విచారించి తెలుసుకొన్నదీ

జగద్గురు ఆది శంకరులు అవైదికమైన బౌద్ధాది మతాల సిద్ధాంతాలను ఖండించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారని అందరికీ తెలిసినదే, ఐతే ముఖ్యంగా ఎంతో ఉన్నత ప్రమాణాలున్నాయని కొందరు భావించే బౌద్ధమతంలోని పరస్పర విరుద్ధ సిద్ధాంతాలవల్లనూ, మతంలో ఉన్న ఆయా సిద్ధాంతాల అనాచరణల వల్లనూ వేద భూమినుండి బయటకెళ్ళవలసి వచ్చిందన్నది సత్యం.

శ్రీ శంకరులు ఏ సిద్ధాంతాన్ని ఖండించినా అందులోని మంచిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకునేవారు గౌరవించేవారు అనాచారాన్ని అవైదికవిధానాన్ని ఖండించేవారు. ఉదాహరణనకి వైదిక సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నా సాంఖ్య, మీమాంసాలలో ఉన్న ఈశ్వరుని యొక్క ఉనికిని నిరాకరించే సిద్ధాంతాలని ఖండించారు. శంకరుల వాదన వారి ప్రతిపాదన ఏమంటే అపౌరుషేయములైన వేద పదములకర్థం ప్రకారం, బ్రహ్మసూత్రానుసారం గల ఈశ్వర నిర్వచనాన్ని గానీ, ఈశ్వరుడు సృష్టి కర్త అని గానీ, ఫలదాత అని గానీ నిరాకరించటం సమంజసం కాదు. వేదములో చెప్పినదే సత్యం, ఈశ్వరుడు లేకుండా జగత్సృష్టి లేదు, అంతే కాదు కర్మాచరణమే వ్యక్తికి ఫలితాన్నిస్తుందని చెప్పటం కుదరదు. ఈశ్వరుడే ఫలదాత, ఫలనియంత, ఈశ్వరుని చైతన్యమే సంకల్పమే జగత్సృష్టికి కారణం. కార్యానుసారం ఫలితాలేర్పడడం, సుఖదుఃఖాలు కలగటం కూడా ఈశ్వరుపు కల్పించినకర్మవల్లనే. శంకరులు ఏది ఖండించినా వేదములు, బ్రహ్మసూత్రాదులను దాటలేదు వాటిని, ఈశ్వర ఉనికిని ప్రశ్నించి అనుమానించిన భాగాలనెప్పుడూ ఖండించారు.

శంకరులకన్నా ముందే ఉదయనాచార్యుడనే నైయాయికుని (న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు) వాదనల వల్లనూ కుమరిలభట్టు (మీమాంసకుడు) కర్మ ప్రచారం వల్లనూ బౌద్ధం వేద భూమి దాటిపోయింది.
బౌద్ధమతం చెప్పే ఈశ్వర రాహిత్యం లేదా ఈశ్వరుడు లేదా భగవంతుడు లేడని చేసిన ప్రచారాన్ని ఉదయనాచార్యులు ఖండించారు.
అలాగే మీమాంసకులు కర్మలు ఫల ప్రదాతలని నమ్మినా, వేదాన్ని వేద విహిత కర్మలను శ్రద్ధగా నమ్మి ఆచరించాలనీ కర్మలే ఫలదాతలనీ నమ్మిన కుమరిలభట్టు ఆ వేద విహిత కర్మలనాచరించవలసిన అవసరంలేదని ప్రచారం చేసిన బౌద్ధాన్ని ఖండించి వేద విహిత కర్మలను నిలబెట్టారు. వారి వారి సిద్ధాంతాలముందు బౌద్ధం నిలవలేకపోయింది.
బౌద్ధమతాన్ని, దాని నాస్తికత్వాన్ని (వేదాన్ని నమ్మని వారిని నాస్తికులంటారు, నమ్మే వారిని ఆస్తికులంటారు) ఉదయనాచార్యుడూ, వేద కర్మాచరణ విముఖతని కుమరిలభట్టూ ఖండించారు. వీరి తరవాత వచ్చిన శంకరులు బౌద్ధంతో పాటు పాఖండ మతాలలోని విపరీత ధోరణులను ఎత్తి చూపించ వలసిన కష్టం లేకుండానే మిగిలిన తప్పులను చూపి ఖండించడంతోటే ఆయన పని సుగమం అయ్యింది.

అసలుగా బౌద్ధం, వేదాంగాలలోని న్యాయ, మీమాంసలముందే నిలువలేకపోయింది అటువంటిది వేదం ముందు ఆ సిద్ధాంతాలేమి నిలుస్తాయి?

బుద్ధుడు ఈ దేశస్థుడే, ఆయనకి తగిన గౌరవం ఇవ్వబడింది. కానీ ఆయన సూత్రాలు ఆచరణ దూరాలు సత్య దూరాలవడం చేత, ఆయనని గౌరవించిన వారే ఆ మతాన్ని ఆయన సూత్రాలను పాటించలేదు. ఉదాహరణకు పాలీలో మాత్రమే వారి గ్రంథ రచన చేసేవారు కానీ తరవాత వచ్చిన వారు పాలీ వదిలి సంస్కృతంలో చేసారు పోనీ భాషదేముంది అంటారా.. అసలు ఈశ్వరుడే లేడని బల్ల గుద్ధిన బౌద్ధం గ్రంథాలన్నీ సరస్వతీ స్తోత్రం తో మొదలు... కాస్త అయోమయం కదూ... నీలాధార ( నీల సరస్వతి, లేదా రాజ శ్యామలా దేవి అని మనమారాధించే అమ్మవారు) స్తోత్రం తో మొదలు. అలానే ఇతర ఎన్నో దేవతల మూర్తులను అర్చిస్తారు. తంత్ర విద్యలూ చేస్తారు. అయోమయంగా ఉంది కదూ చెప్పే సూత్రాలకీ, చేసే ఆచరణలకీ సామ్యంలేకుండా. గౌతమ బుద్ధుని బోధలు విని బౌద్ధంలో ఉన్నా వారి జీవనంలో వైదిక ఆచారాలెన్నో పాటిస్తారు. కానీ వేదం తప్పంటారు ఈశ్వరుడు లేడంటారు. వివాహాది కార్యాలు కొన్ని సంస్కారాలు వైదికంగానే జరుగుతాయి. కర్మ కాండను బుద్ధుడు ఖండించినంత మాత్రాన అప్పటి ప్రజలు, బౌద్ధులు దాన్ని వదలలేదు. ఆయన చెప్పిన శాంతి, అహింసా మంత్రాలూ అనుష్టించలేదు, ఎక్కడిదాకానో ఎందుకు కుమరిల భట్టు  వృత్తాంతమే చూడండి అంత అహింస బోధించే వారు కుమరిలభట్టును హతమార్చదలచారు. అసలు సంపూర్ణ అహింస అన్నది కుదరని పని. వేదాలూ అహింసని బోధించాయి. అపరిగ్రహము కానంతవరకూ హింసనంగీకరించాయి. గురువు శిష్యుణ్ణి సన్మార్గంలో పెట్టడం కోసం మందలించడం హింసకాదుగా...? అసలు మన పుట్టుకే హింసతో కూడుకున్నది, తల్లిని హింసించకుండా ఏజీవి పుట్టగలదు? హింసలేనిదే మానవజీవితంలేదు. మనిషి ఊపిరి తీస్తే ఎన్నో కోట్ల క్రిములు నశిస్తున్నాయి, ఎంత శాఖాహారమైనా తిండి కోసం ఎన్నో చెట్లు చేమలు నరకట్లేదా అది హింస కాదా... ఐతే అది ధర్మబద్ధమై తాను దానిని మీరలేని స్థితిలో ఉన్నాడా అని చూసుకోవాలి.  ధర్మబద్ధమైన అటువంటివి ఎన్నడూ హింసగా పరిగణింపబడవు. ఊరికెనే ఉత్త హింస చేయడం వేదమూ అంగీకరించలేదు. అంతే కాని మతం పేర ఎదుట వారిని హింసించడాన్నివేదం ఒప్పుకోలేదు. ఆచరణంలోకి తీసుకురాలేని ఆచరణదూరమైన బోధలవల్లనే అది నిలబడలేదు అందునా అది కేవలం ఒక మనిషి మతినుండి పుట్టినది...అక్కడే అసలు తేడా! ఆచరణకి - బోధనకి తేడా ఉండబట్టే కనీసం వేదాంగాలముందు కూడా నిలవలేకపోయింది బౌద్ధం. అశోకుడే బౌద్ధం తీసుకున్నా సనాతన ధర్మ విలువలని వదలలేదు ఆ పద్ధతిలోనే పాలించాడు అతని శాసనాలే అందుకు ఋజువు.

ఈ దేశంలో బుద్ధ భగవానుడు తాను పొందిన సిద్ధిచేతనూ, తన గొప్పనైన జీవితం చేతనూ అమిత కీర్తిని గడించాడన్నది సత్యం. ఏ మహనీయుడుగా తలచిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు లేదా అనుచరులైనా ఆయా సంస్థలు లేదా వ్యవస్థలలో వైదిక ఆచారాలను కొద్దితేడాలు చేసి పాటిస్తుంటారు కానీ వారి ఇళ్ళల్లో అవి పాటించరు. గాంధీమతం అని గాంధీగారి సమయంలో వచ్చింది, గాంధీగారి బోధనలు లోకోద్ధరణ, మానవ సేవ, ఆయన గొప్ప గుణాలు చూసి ఆయనను అందరూ గౌరవించారు అంత మాత్రాన అందరూ వారి వారి ధర్మాలు వదిలి గాంధీ మతం తీసుకోలేదుగా, అంత మాత్రాన ఆయన మాటల్ని యథాతథంగా ఆచరించలేదుగా... బుద్ధుని విషయంలోనూ జరిగిందదే, బుద్ధుని జీవితం గొప్పగా ఉన్నా బోధలు ఆచరణదూరాలు కావడం సత్య దూరాలు (సత్యం అంటే ఈశ్వరుడు అని అన్వయం చేసుకోగలరు) కావడం వల్లనూ, కర్మ కాండను బుద్ధుడు ఖండించినా ప్రజలు వైదిక మతానురక్తులవ్వడం వల్లనూ, బౌద్ధంలో ఉన్న పరస్పర విరుద్ధమైన “కర్మ ఖండన మరియు తంత్ర విద్యాసాధన” , “నిరీశ్వర వాదన అదే సమయంలో దేవతార్చనగా మూర్తులను సేవించడం” అనే పద్ధతులవల్లనూ ఆ మత బోధలన్నీ నేతి బీరకాయ చందంగా ఉండడం వల్లనూ నిర్ద్వంద్వంగా బౌద్ధ సూత్రాలు ఖండించబడ్డాయి.


ఎప్పుడో ఖండించబడిన, పరస్పర విరుద్ధ భావాలను బోధించిన సిద్ధాంతాలను, సనాతన ధర్మ సిద్ధాంతములకన్నా ఉన్నతములను కీర్తించడంఅయ్యిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలవంటివేమో... లేక కిందపడ్డా పైచేయి మాదే అనే వాదనో

ధర్మస్య జయోస్తు - అధర్మస్య నాశోస్తు
వేదమే ప్రమాణం - శంకరులే గురుమూర్తి
హర హర శంకర - జయ జయ శంకర