Pages

Saturday, May 11, 2013

జ్ఞానిని అనుకరించరాదు - అజ్ఞానిని అనుగమించరాదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఇతః పూర్వం వాచ్యార్థము - లక్ష్యార్థము అన్న పేర ఈ బ్లాగులో కొంత వ్రాసుకున్నాను, దానికి పొడిగింపుగా నాకు నేను పరాకు చెప్పుకోవటం కోసం ఈ విషయం వ్రాసుకుంటున్నాను.

ఎందరో మహానుభావులు, గురువులు, ఆచార్యులు, పరమహంసలు ఎందరో మన జాతిలో నడయాడి ప్రతి ఒక్కరు ఆత్మోన్నతిని పొందడానికి కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అందించారు. అందుకున్న వారు అదృష్టవంతులైయ్యారు, అందుకోలేని వారు ప్రయత్నిస్తున్నారు. ఈ రెంటికీ మధ్య ఉన్నవారు సందిగ్ధావస్తకి గురయ్యారు ఇంకా గురౌతూ ఇతరులనీ గురి చేస్తూనే ఉన్నారు. ఒక మహా పురుషుడు ఒక పని చేసాడు
అంటే అది బాహ్యంలో ఒకలా కనపడినా ఆంతరంలో ఒకలా ఉంటుంది, ఒక్కోసారి ఒక పది మందికి పది రకాలుగా చెప్పవలసిన దాన్ని ఒకే పనిలో చేసి చూపిస్తారు అది ఆ పదిమందికీ వారి వారికున్న స్థాయీ బేధాల్ని బట్టి లేదా ఆ సందర్భాన్ని బట్టి ఆ మహాత్ముడు చేసిన పని వారికి పరిష్కారంగా ఉంటుంది. అది కేవలం శిష్యుల మానసిక దౌర్భల్యాన్నో, లేక శంకనో, లేక మరోటో దూరం చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే మహాత్ములు చేసే లీల యొక్క పరమ ప్రయోజనం అంతే కానీ అదే ఇక ప్రతిదానికీ పరిష్కారం కాదు (it is not to be set as precedence for every situation across all times and to all beings).

చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ మొన్న ఒక సంభాషణలో గుర్తొచ్చింది, ఎవరితోనో మాట్లాడుతూ మీరు అన్నీ నియమాలు అదీ ఇదీ అంటారు ఏది ఆ మహానుభావుడు అలా చేయలేదా, ఈ మహానుభావుడు ఇలా చేయలేదా వాళ్ళే చెప్పగా లేనిది మీరంతా ఎందుకు కాదంటారు అదీ ఇదీ అని... అప్పటికీ చెప్పబోయాను వాళ్ల స్థాయి వేరు జ్ఞానికి విధినిషేధాలుండవు కదా, లోకోద్ధరణకై అపోహలు పోగొట్టటానికి ఆ సమయంలో వారిని చేరిన వారి బుద్ధిమాంద్యం పోగొట్టటానికో మరోదానికో ఒక ప్రత్యేక పరిస్థితులలో కొన్ని కొన్ని సార్లు మహాత్ములలా చేస్తారు. దాన్నే ప్రామాణికంగా తీసుకొని, ఆయన చెప్పాడు, మేమూ చేసేస్తాం అంటే ఎలా ? అది ఎందుకు చెప్పారో! ఎందుకు చేసారో! కూడా బేరీజు వేసుకోవద్దా అని... కానీ గుల్లగా ఉన్నగోడమీదే కదా మేకు దిగుతుంది, కాంక్రీటు పిల్లర్ లో మేకు మామూలుగా దిగదు కదా అని మిన్నకున్నాను.. చెప్పే స్థాయిలో మనం లేకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో కొంత మంచి చెప్పగలరు వారిలోంచి మంచితీసుకుందాం అనే వ్యవసాయాత్మక బుద్ధి ఎంత అవసరమో మరోసారి అర్థం అయ్యింది నాకు.

ఉదాహరణకి, కిరాతుడైన కన్నప్ప అడవిలో తిరుగుతూ శివలింగం కనపడితే శివయ్య అని తెలుసుకుని అడవిలో ఒక్కడే ఉండిపోయాడనీ స్నాన పానాదులు లేవనీ వేదన పడి ఏదో పూజ చేస్తున్నాననుక్కొని చేయకుండా సేవ చేస్తున్నానని చేసిన పూజ స్వామి స్వీకరించాడు, ఏదో పుక్కిట్లో పట్టిన నీరు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే అభిషేకంగా స్వీకరించాడు స్వామి, అడవిలో తిరిగి జంతువుల మలమూత్రాలతో సహా అడవంతా తొక్కిన చెప్పులతో నిర్మాల్యం తీస్తే అదే కూర్చతో చేసిన నిర్మాల్య విసర్జనగా తీసుకున్నాడు స్వామి. నా స్వామి అడవిలో ఎన్నాళ్ళనుంచో ఆకలితో ఉండిపోయాడని అడవి పందిని వేటాడి దాన్ని కాల్చి అందులో మంచి రుచిగా కాలిన మాంసపు ముక్కేదో నోటితో కొరికి బాగున్నదాన్ని తీసుకొచ్చి స్వామికిస్తే విషాన్నే ద్రాక్షపండులా చేసి గొంతులో పెట్టుకున్న స్వాంఇ అమృతం కన్నా ఇష్టంగా స్వీకరించాడు.. భక్తికి పరీక్షగా కళ్ళు పాడైనట్లు చూపిస్తే తన కళ్ళనే సమర్పించాడు స్వామికి.. కదిలిపోయాడు స్వామి అప్పట్నుంచి ఆ కిరాతుడు కన్నప్ప అయ్యాడు. ఆయన సంస్కారబలం ఏకాగ్ర చిత్తంతో చూపిన ఆయన భక్తి తీవ్రత స్థాయి వేరు. ఆయన భక్తికి మెచ్చిన ఆశుతోషుడైన శివుని లీలా వినోదమది.

కన్నప్ప అలాచేసాడు కాబట్టి మనమూ అలానే చేద్దామంటే అంతకన్నా అపచారం లేదు, తెలుసుకోవడానికి తెలుసుకున్నదాచరించటానికి మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు దానితో సంస్కారం పెంచుకొని అంతే మర్యాదతో నడచుకోవాలి. ఎవరిదాకానో ఎందుకు ఉదాహరణకి కన్నప్ప వారసులే ఉన్నారనుకుందాం ఇప్పుడు వారు ఇప్పటికీ కన్నప్పగారిలానే చేస్తారా? ఒక వేళ వాళ్ళు చక్కగా అర్చనాదులు వైదికంగా ఎలా చేయాలో పద్ధతులు తెలుసుకుని మేము ఇలా కార్యక్రమం జరిపిద్ధాం అనుక్కుంటున్నాం అంటే, మనం వాళ్ళని అబ్బే వీల్లేదు మీ పూర్వీకుడైన కన్నప్పగారు ఇలా చేసారు మీరూ అలానే చేయాలి మీకదే ఆనందం అంటామా? తెలియకపోతే వాళ్ళకి పద్ధతి చెప్పి చక్కగా అందంగా భక్తిగా నిష్ఠతో వైదికంగా కార్యక్రమం చేయమని చెప్తామా?

ఈ ఆలోచనా పరంపరలోనే చిన్నప్పటి ఒక చిన్న కథ గుర్తొచ్చింది
ఒక మహానుభావుడు పరమ జ్ఞాని ఐన గురువు ఆయనని అనుగమిస్తూ ఎంతో మంది శిష్యులు ఉండేవారు. ఒక సారి ఆ గురువుగారు తమ శిష్యులకి పాఠం చెప్పాలనుక్కున్నారు నడచి వెళ్తూంటే ఒక కల్లు దుకాణం కనపడింది వెంటనే వెళ్ళి గడగడా ఒక కుండ కల్లు తాగేసి పక్కన కూర్చున్నారు ముందందరూ నోళ్ళు వెళ్ళబెట్టి అరే గురువుగారు తాగేసారు మననీ తాగమన్నట్లే అని అందరూ కడవలకి కడవలు తాగి తూలి పడి గోల గోల చేసారు గురువుగారు అందరినీ గమనిస్తున్నారు ఒకరిద్దరు తప్ప అందరూ తాగి పడిన వాళ్ళే కొంత సమయం గడిచింది అందరికీ మత్తు దిగడం మొదలైంది. తరవాత వాళ్ళలో వాళ్ళు సమర్థించుకోవడం మొదలెట్టారు, ఒరేయ్ కళ్ళు టాగడం టప్పు కాడురా.. అండరూ కళ్ళు టాగత్సు, మాంషం టినొట్శు గురూవ్ గారే టాగి శూపింఛారు అని సిద్ధాంతం చేసారు. ఆ సదరు గురువుగారు తాగని ఒకరిద్దరు ఇతర శిష్యులు వీరందరికీ మత్తు దిగేదాకా వేచి ఉండి మత్తు దిగాక మర్నాడు విహిత కర్మానుష్ఠానానంతరం తిరిగి ప్రయాణం మొదలెట్టారు ఈ సారి ఇంకో ఊరిలో ఒక కమ్మరి కర్మాగారం ముందునుంచి వెళ్తూండగా ఆ గురువుగారు ఆగి ఒక్క ఉదుటున అక్కడ ఒక పాత్రలో లోహాలను శుద్ధి చేయడానికై ఉన్న అత్యంత భయంకరమైన ద్రావకాన్ని (Acid) కమండలంలో తీసుకొని తాగేశారు. తాగేసి శిష్యుల వంక చూశారు... ఒక్క శిష్యుడూ కిక్కురుమనలేదు. తాగడానికి ముందుకు రాలేదు.

ఇతః పూర్వం కల్లు తాగని ఒకరిద్దరు శిష్యులు గురువుగారి లీలకు ఇతరులకు చెప్పిన పాఠానికి గురువుగారికి ఏమన్నా జరిగిందేమోనని ఒకింత కంగారుకు గురై ఏమీ కాలేదని నిశ్చయంతో ఉండి గురువుగారిని సేవించి ఉత్తమ శిష్యులైనారు, పరంపరలో వారూ గురుస్థానాన్ని అలంకరించారు. మరి ఆ గురువుగారి సంగతి. ఆయన జ్జాని అన్నిటినీ ఒకేలా చూసేవాడు, ద్రావకమైనా, కల్లైనా, నీరైనా, విషమైనా ఆయనకి సమం, ఆ పదార్థం దోష భూయిష్టమైనా ఆయన చేయి తాకగానే దోషాలు ఎగిరిపోయేంత పరమ విరాగి, జ్ఞాన సంపన్నుడు. గురువులు ఆచార్యుల లీలలు కేవలం శిష్యోద్ధరణకే. గురువుగారు చేసింది నేను చేస్తాను అంటే ముందు ఆ నిష్ఠ అనుష్ఠానం పెంచుకోవాలి కదా.. అప్పుడు ఆస్థాయి దానంత అదే వస్తుంది.

ఏదైనా ఒక గురువు లేదా మహాత్ముడు ఒక కర్మయందు ఎవరికైనా మినహాయింపు ఇచ్చాడు అన్నా లేక అందరూ చేయకూడని పనిని చేసి చూపించినా అది సార్వజనీకం కాదు. సాయిబాబా గారి విషయంలోనూ అంతే ఆయనకి మాంసం ఇష్టం అని తీర్మానించారు కొందరు, ఆయన మాంసమూ తినగలడు అవసరమైతే సంవత్సరాల ఉపవాసమూ చేయగలడు ఆయనది అద్వైత స్థితి ఆయనకి అందులో రెండు కనబడవు. అది అర్థం చేసుకోకుండా బిర్యానీలు, పులావులు, మాంసాహారం సాయి ప్రసాదం సాయికిష్టం, సాయిబాబా చుట్ట, బీడీ కాలుస్తాడు అంటూ సిద్ధాంతం చేసినవారెందరో. సాయి బాబా గారు చేసినవి సార్వజనీకం ఐతే ఎవరూ ఏ ఒక్కరూ ఏదీ నీళ్ళతో దీపాలు వెలిగిం చరేం, చేతినే గరిటలా వాడి వందమందికి వండి వడ్డిం చరేం. ఇలాంటివి మాత్రం కుదరవు అబ్బే అవి బాబాగారు కదండీ చేసిందీ అని ఒక దీర్ఘం....

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతో స్వామి వారు ఒక పూర్వ సుహాసినికి శ్రీచక్రం ఇచ్చారు, అది ఎందుకిచ్చారో, ఎవరికిచ్చారో, ఆ తల్లి పూనికేమో వారికి తెలుసు, ఇప్పటికీ ఆ శ్రీ చక్రం తీసుకున్న వారి వంశం వారిచే గొప్ప పూజలందుకుంటోంది. అది తెలిసి అందరూ చేస్తామంటే అపహాస్యం పాలౌతారు.

రమణులు సంధ్యావందనం నిత్య కర్మానుష్ఠానం చేయరు అరుణాచలంలో ఏ దీక్షానియమాలు లేవుట అని నిత్య కర్మ మానేసిన వారున్నారు, అప్పట్లోనే రమణులు చెప్పారు మీరూ జ్ఞానిస్థాయికి చేరితే కర్మ పరిత్యాగం చేయొచ్చని. దీక్షానియమాలు లేవని నిత్యకర్మానుష్ఠానం మానేస్తే మరి రమణులలా బ్రతకగలమా శరీర భ్రాంతి లేక, తిండిలేకున్నా, తేళ్ళు, జెర్రులు కుట్టినా అలా ధ్యానంలో ఉండగలమా? అన్నది ప్రశ్నించుకోవాల్సి ఉంది

గురువుల, ఆచార్యుల పేర్లు వాడుకొని వారు చేసిన లీలలు ఎందుకో దేనికో తెలీకుండా తత్త్వం తెలుసుకోకుండా అవసరం మేర మన సౌకర్యార్థం సగం సగం అన్వయించుకొని మిగిలింది వదిలేయ డమంత గురుద్రోహం మరోటి లేదు (నా భావన మాత్రమే) . మహానుభావులు చేసిన లీలలను మనం స్వంత తెలివితో మనకి అన్వయించేసుకొని దాన్ని దృష్టాంతంలా చూపి దాన్ని అనుకరించటం కన్నా అథమం మరోటి లేదు.

అందుకే పూజ్య గురువులు ఈ మాట పదే పదే చెప్తూంటారు

"జ్ఞానిని అనుకరించరాదు - అజ్ఞానిని అనుగమించరాదు"

ఏమైనా! ఎక్కడైనా దోష భూయిష్టంగా వ్రాసి ఉంటే గురుమండల స్వరూపిణి ఐన పరాదేవతను క్షమించమని కోరుకుంటూ

సర్వం శ్రీ పరబ్రహ్మర్పణమస్తు

Friday, May 10, 2013

మహాఫలప్రదమైనది

 శ్రీ గురుభ్యోనమః

అనాయమ స్తవమని దండి కృత శివ స్తోత్రంలోనిదీ శ్లోకం సకల విధమునలైన సాధనలు చేయలేని
అల్పులకూ మహాఫలప్రదమైనది శివచరణ ధ్యానమే నని తన భక్తి నిరూపణం చేసుకున్నాడు ఈ సుకవి

మంత్రాభ్యాసో - నియమ విధయ - స్తీర్థయాత్రానురోధో
గ్రామే భిక్షా - చరణ ముటజే - బీజవృత్తిర్వనే వా!
ఇత్యాయా సే - మహతి రమతా - మప్రగలః ఫలార్థే
స్మృత్వైవాహం - తవ చరణయో - ర్నిర్వృతిం సాధయామి!!


మంత్రములను అభ్యసించటం, పునశ్చరణ చేయటం (జపించటం), నియమములను వ్రతములను అనుష్ఠించటం, తీర్తయాత్రలను నిరంతరముగా విధిగా చేయడం, గ్రామంలో ఉండి నియమంగా భిక్షాటన చేయడం లేదా వనంలో ఉంటూ గింజలను ఏరుకొని జీవనం గడపడం వంటి ఎన్నో మహత్వమైన పనులు తమ తమ కోరికలను తీర్చుకోవడానికి చాలా శ్రమ పడుతూ చేస్తూ వానియందే ఆనందముపొందువారిని చూసి అలా శ్రమచేయనోర్వలేని నేను నీ పాదములను స్మరించుటలోనే ఆనందములను ఫలములను సాధించుచున్నాను.

శివుని నవ్వు

శ్రీ గురుభ్యోనమః

మరో శివ స్తుతి, మల్హణుడు అని అతి ప్రాచీన కవి భక్తకవి వరేణ్యుడు, మానసికంగా చేసిన ’చిరునవ్వుతో తనలో తాను నవ్వుతూ ఆనందపడిన శివుని, ఆనవ్వును చూసిన బ్రహ్మేంద్రాదుల దర్శనం’.... అద్భుతః.. నేనేదో వారికి సర్టిఫికెట్లిస్తున్నాననికాదు, వారి భావనలో నేనూ ఆ ఘట్టాన్ని తలచుకుని దాన్ని మనోఫలకంపై దృశ్యరూపకంగా చూస్తే పరమానందంగా ఉంది

గౌరీప్రదాన సమయే కథితేచలేన
గోత్రం తవేశ! కిమితి క్షణజాత చిత్రం!
ధన్యైః పితామహ పురందర లోకపాలైర్
దృష్టం నిరుత్తర ముఖం హసతోభవద్ధి!!

శివా! నీకు గౌరీదేవిని కన్యాదానం చేసి వివాహం చేసే సమయంలో హిమవంతుడు "ఈశ్వరా! నీ గోత్రమేమి ?" అని ప్రశ్నించగా ఒక క్షణకాలము నీకు ఆశ్చర్యము కలిగి ఏం చెప్పటానికీ తోచక, తరవాత నవ్వుతూ ఏమీ మాట్లాడక ఊరుకున్నావు. అలా అరమోడ్పు కళ్ళతో నవ్వుతూ కూర్చున్న నీ ముఖాన్ని చూచిరి నీ వివాహానికి విచ్చేసినటువంటి బంధువులగు బ్రహ్మేంద్రాదులు లోకపాలకులు ధన్యత పొందిరి కదా!


Tuesday, May 7, 2013

చంద్రమౌళీ! నీవే రక్షకుడవు

చంద్రమౌళీ! నీవే రక్షకుడవు

శ్రీ గురుభ్యోనమః

   బిల్హణకృత శివ స్తుతి చదువుతుంటే ఆయన ఎంత భక్తితో, తనకున్న పాండిత్యంతో శివుణ్ణి ఎలా స్తుతించాడో తెలుసుకుంటూంటే ఔరా! మహానుభావుడు ఏమి స్తుతి చేసాడు అనిపిస్తోంది. ఒక్కో మహానుభావుడు ఒక్కో విధంగా శివస్తుతి చేసారు... వారి భావనతో పాటు అంతర్లీనంగా కథా వస్తువుగా ఉండే ఏదో ఒక శివ లీల అద్భుతంగా సందర్భానుసారంగా దాచడం... మహానుభావులకే చెల్లింది


ఏనాంసి మానసిక వాచిక కాయికాని
కుర్మ స్తథా పి చరణం శరణం దధీథాః
యో దోషవంత మపి రక్షతి రక్షితాసౌ
కో వా రక్షతి నిరాగస మిందుమౌళే!

   ఇందుమౌళీ! మేము మానసుతో, వాచికంగా (మాటలతో), శరీరంతో చేయబడే మూడురకాల పాపాలు చేస్తూంటాం. అయినా నువ్వు మమ్మల్ని క్షమించి నీ పాదాలని రక్షగా ఉంచాలి అని వేడుకుంటున్నాము.

   ఇన్ని అపరాధాలు, పాపాలు చేస్తున్నారుగదా? మరి ఎందుకు ఎలా మిమ్మల్ని రక్షించాలి, మీ పాపాల్ని అపరాధాల్ని ఎలా క్షమించాలి? అని అడుగుతావని తెలుసు, ఎవరైతే తప్పులు చేసినవాణ్ణి రక్షిస్తాడో, ఉద్ధరిస్తాడో అతడే రక్షకుడు కదా (రక్షితా అనదగినవాడు). ఎందుకంటే చంద్రుణ్ణి నెత్తిమీదపెట్టుకుని చంద్రమౌళి, చంద్ర శేఖరుడు అని పేర్లు పొందిన శివా! అపరాధము, పాపము ఏమీ చేయనివాణ్ణి లోకంలో ఎవరు రక్షించరు? ఎవరైనా రక్షిస్తారు గదా! నువ్వుద్ధరించవలసినది, రక్షించవలసినది పాపాలు, అపరాధాలు చేసే మమ్మల్నే!

  (చంద్రమౌళి అన్న సంబోధనతో చంద్రునికి దక్షునిశాపం, కళల క్షయం వృద్ధి ఘట్టాలని గుర్తుచేస్తుంది, అలాగే చంద్రుడు గురువాసంలో చేసిన పాపం గుర్తొస్తాయి. దీంట్లో కవి చమత్కారం, చంద్రుణ్ణే నెత్తిమీదపెట్టుకున్న శివా అంటూ శివునికి ముందరికాళ్ళ బంధ వేయడం ఒకటి, శ్లోకం ఎవరు చదువుకున్నా వారికి వారు చదువుకుని ప్రార్థన చేసినట్లే అన్వయం అయ్యేలా ఉండడం మరోటి)

పరిప్రశ్న - ప్రశ్నవేయడంలో జాగ్రత్త

శ్రీ గురుభ్యోనమః

నమస్తే ! 
   ఒక వ్యక్తినుండి మనకు కావలసిన విషయ సమాచారాన్ని రాబట్టుకోడానికి మనం ఒక ప్రశ్నవేస్తాం. మనం అడిగే ప్రశ్న యొక్క సొంపును బట్టి మనకొచ్చే సమాధానం కూడా అంత అందంగా ఉంటుంది. పైగా ఈ ప్రశ్న అడిగే విధం ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ముఖ్యం. అసలు ప్రశ్న వేసేముందు నిజాయితీ చాలా అవసరం. మనం నిజాయితీగా అడుగుతున్నామా లేక ఏదుటివాడి పాండిత్యాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నామో ముందు మనమే నిర్ధారించుకోవాలి. రెండవరకమైతే అవతలి వ్యక్తినుంచి సమాధానం కాదుకదా ఈసడింపు కూడా కొన్ని సందర్భాలలో దొరకవచ్చు.

   అసలు ప్రశ్న ఏమిటి? దాని పూర్వాపరాలు ఏవి? ఎక్కడనుంచి ఆ అనుమానం లేదా ప్రశ్న వచ్చింది అన్నది ముందు మనం జాగ్రత్తగా గమనించి గుర్తు పెట్టుకోవాలి. అవతలి వ్యక్తిని ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన అసలెందుకొచ్చింది నీకీ సందేహం? ఆ సందేహం గురించిన వివరమో, కథో.. ఏది ఒక్కసారి చెప్పు? అని అడిగితే ఆ అనుమానం / ప్రశ్న ఎందుకొచ్చిందో తత్కారణం చెప్పి వివరించగలిగేలా ఉండాలి. అలా కాక, ఏదో అక్కడ విన్నానండి, ఇక్కడ వీరన్నారు అందులో ఏముందో తెలుసుకోడానికి అని మనకే అర్థంకాని రీతిలో ప్రశ్న చేయకూడదు.

ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు 
1) స్వతహాగా నా జీవన విధానంలో నా అనుష్ఠానంలో కలిగిన సందేహాలు:- ఇవి అడిగి తెలుసుకుని అనుమాన నివృత్తి చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. 
2) స్వజీవితంలోవే కాక, ధర్మ సూక్ష్మాలు ఇత్యాదులు:- స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ అనుమానం వచ్చినచోట సందర్భానుసారం సమయానుకూలానుసారం తెలిసినవారినడిగి తెలుసుకోవడం లేదా ఇతర ప్రామాణిక వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి విని తెలుసుకోవడం. తద్వారా పురాణేతిహాసాలు మనలో జీర్ణమై తదనుగుణంగా మన జీవన మార్పు ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది 
  
(ఇదికాక మరోరకం ఏదోఒకటి అడగాలిగదా అని అడిగేయడం... ఏదో ఒకటి పోస్ట్ చేయాలిగదా అని స్పామ్మింగ్ చేసినట్లు... దీని గురించి విజ్ఞులకనవసరం... కదా!)
    
   ముఖ్యంగా గురువుల వద్ద, ఆయన దొరికారు కాబట్టి ఏదో అడగాలిఅని అడిగేయడం కాక మన ఆధ్యాత్మికోన్నతికి పనికి వచ్చే ప్రశ్నలు అదీ ఆయన అనుకూల సమయం చూసి అడగాలి. అంతేకాని అప్పున్న వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ చొక్కాపట్టుకుని అప్పడిగినట్టు కాదు.
  
   అసలు ప్రశ్న అడిగేముందు ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పరిశ్రమ ముందు చేయాలి. అసలు ఏ పరిశ్రమా లేక ఏదో అడిగేసి వారు తిరిగివేసిన ప్రశ్నకి మన దగ్గర బదులు లేక తత్తర పడకుండా జాగ్రత్త పడాలి.
      
   గతంలో ఎంతోమందిని మన పూజ్యగురువుగారిని ఎక్కడపడితే అక్కడ ఏవో ప్రశ్నలు వేయడం చూసాను అలాంటి ప్రశ్నలు ఎలావేస్తారో అని నాకో గొప్ప అనుమానం. అవి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఎలా ఉపయోగపడతాయో అర్థంకాని ప్రశ్నలు. చాలా ప్రశ్నలు పుస్తక పరిశీలనం పురాణ పరిశీలనం ద్వారా తేలిపోతాయి. అసలు ఆ ప్రశ్నవెనుక వారి పరిశీలనం కాని పరిశ్రమ కానీ ఏమీ ఉండవు.
      
       భారతంలో ఇలాట కదండీ? అలా ఎలా అండీ? రాముడు ఇలా చేసాడు కదండీ? సినిమాలో చేప్పారు కదండీ! నిజమాండీ? ఎలా అండీ? వంటి ప్రశ్నలు కొన్ని, ఆ అడిగిన ప్రశ్న ఏ సినిమా చూసో నాటకం చూసో అడిగుతున్నామని అడిగే వాళ్ళకీ తెలుసు. భారత రామాయణాలు వాటి వ్యాఖ్యానాలు చదివితే అందులో ప్రశ్నలకి సమాధానం కూడా దొరుకుతాయి అలాగే ఏవి కల్పిత రాజ మార్తాండ కథలో తెలుస్తాయి. కానీ, ఆ పరిశ్రమ చాలామందిం చేయం, చదివి చెప్పేవారు తేరగా దొరికారని ఇచ్చవచ్చిన ప్రశ్నలు అడుగుతుంటాం.

    కొన్ని ప్రశ్నలు పెద్దలైన వారినీ, పూజ్య గురువులనూ అడగడం చూసాను అదీ ప్రత్యేకంగా సమయం తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి సంధ్యావందనం పుస్తకం ఇస్తారా... (అంటే అప్పటివరకూ సంధ్యావందనమే చేయడం రాదన్నమాట) రామాయణం తెలుగు పుస్తకాలు, భాగవతం తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి టీకా తాత్పర్యాలు ఉన్నవి కావాలి, ఎవరు వ్రాసినవి సరియైనవి, మీకేమైనా పుస్తకాల దుకాణం తెలుసా? అడ్రెస్సు చెప్తారా? అని. అటువంటి వారిని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలీదు ఎన్నో పుస్తకాల దుకాణాలున్నాయి ఏ పెద్ద దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే పుస్తకాల దుకాణదారులని అడిగినా చెబుతారు, అంతర్జాలంలో ఎన్నో పుస్తకాలు విక్రయించే వెబ్ సైట్లున్నాయి, ఉచితంగా చదువుకునే వెబ్ సైట్లున్నాయి, అరెరె వీరికి అంతపెద్దాయన సమయం కేటాయిస్తే ఎలా సమయం వృధా చేసుకుంటున్నారురా అనిపిస్తుంది.
   
         రామాయణం బాలకాండ జాగ్రత్తగా చదివితే అసలు ప్రశ్న ఎలావేయాలో తెలుస్తుంది.    వాల్మీకి విరచిత శ్రీ రామాయణమే ప్రశ్నతో మొదలు. అందులో చక్కగా చెప్తారు వాల్మీకి నారదులవారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి "పరిప్రశ్న" చేసారు అని. “పరిప్రశ్న అంటే బాగుగా ప్రశ్న అడుగుట”. “పరి పరి విధముల ఆలోచించి సరియైన ప్రశ్ననుకూర్చి అడగవలసిన వారిని అడిగే విధంగా ప్రశ్న అడగడం”. అలానే విశ్వామిత్రమహర్షిని శ్రీరాముడు అలానే సందర్భోచితంగా ప్రశ్నలువేసి విషయాలు తెలుసుకుంటారు.

   మనకి ఇప్పుడు ఎన్నోరకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడ ప్రవచనాలు, వ్యాఖ్యానాలు దొరుకుతాయి ఇలా అన్నివిషయాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐనా కొందరు పరిశీలన చేయరు, పరిశ్రమ చేయరు, ఏ ప్రశ్న అడగాలో ఎలాఅడగాలో, ఎక్కడ అడగాలో అన్న స్మృతి కూడా ఉండదు.
   ఐతే ప్రశ్న అడగడంతప్పని నేను ఎంత మాత్రమూ చెప్పట్లేదు. ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి, పుస్తకాలను ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవాలి, పరిశీలనాత్మక దృష్టి, వ్యవసాయాత్మక బుద్ధినేర్పరచుకోవాలి. ఐనా దొరకకపోతే ఆ సమాధానం దొరకకపోవడంవల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా లోటు ఉందా అని తర్కించుకోవాలి. లోటనిపిస్తే ప్రశ్నని చక్కగా కూర్చి పెద్దలనడగాలి. 

   ముఖ్యంగా గమనించవలసినదేమంటే ఈ టపా చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత మందిని చూసి చూసి ఈవిషయం గూర్చి వ్రాయాలని కొన్నాళ్ళక్రితం ఒక గ్రూపులో వ్రాసాను, ఎందుకంటే అటువంటి వారు మనగుంపులో ఉండకూడదని (లేరనే నేను నమ్ముతున్నా) ప్రస్తావించాను మన పరిచయస్తులు కనీసం ఈ విషయంలో (పెద్దలని పరిప్రశ్న వేయడంలో) జాగురూకులై ఉండాలనీ...

   తెలియకపోవడం తప్పుకాదు, తెలుసుకోవడానికి పరిశ్రమించకపోవడం బద్ధకమనే నేరం.

   మీరు విజ్ఙులు నేను చెప్పింది ఏమాత్రం ఇబ్బంది కలిగించినా, తప్పనుక్కున్నా మన్నించగలరు. ఒప్పనుక్కుంటే ఆశీర్వదించగలరు.

మీ...

Monday, April 1, 2013

తనని తాను ఉద్ధరించుకోలేని నాలాటి వాడు...


భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు, తనని తాను ఉద్ధరించుకోలేని నాలాటి వాడు, లోకాన్ని ఉద్ధరిస్తాననడం ఎలాఉంటుందంటే, తన కాళ్ళకి ముళ్ళు, రాళ్ళు గుచ్చుకోకుండా నడవడం కోసం భూమి మొత్తం మీద తోలు కప్పడానికి ప్రయత్నించినవాడిలా ఉంటుంది. అంత కన్నా సులభమూచేయవలసినదీ, ముందు తన కాళ్ళకి తాను చెప్పులేసుకోవడం.

-శంకరకింకర