Pages

Tuesday, January 20, 2015

కర్తవ్యం - బాధ్యత

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కర్తవ్యం = చేయ వలసిన కర్మను చేయవలసిన సమయానికి చేయవలసిన విధంలో నిర్వర్తించడం. దీనిలో కర్తకు ఫలితంతో సంబంధం ఉండదు. విహితమైన తన పని తను చేసుకుపోవడం ఫలితం దైవానికి వదలే లక్షణం. ఇది ధార్మికం
ఉదా:-
విశ్వామిత్రుడు నిద్రపోతున్న రాముని ప్రాతస్సంధ్య దాటిపోతోంది త్వరగా లేచి విహిత కర్మాచరణం అనే నీ కర్తవ్యాన్ని ఆచరించు అని పలికారు. దాని ద్వారా ఆయన శిష్యునికి ధర్మ బోధ అనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మరోమారు చెప్పలేదు లేచేదాకా వెంటపడలేదు. సుమతియైన రాముడు లక్ష్మణసమేతుడై లేచి నియమిత కాలంలో సంధ్యావందనమాచరించాడు. ఇక్కడ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులిద్దరూ తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించారు.


బాధ్యత = ఒక కర్మను ఫలితం ఆశించి నిర్వహించి తద్వారా ఫలితాన్ని ఎలాగైనా సాధించాలనే / పొందాలనే లక్షణం.
ఉదా:-
పైన చెప్పిన అంశాన్నే ఇక్కడ తీసుకుంటే, ఒకవేళ రాముడు నిద్రలేవలేదు అనుక్కుందాం అప్పుడు. ప్రాతస్సంధ్య వేళదాటిపోతోంది ఇంకా పిల్లలు లేవలేదని విశ్వామిత్రుడు బెంగపెట్టేసుకుని, రామలక్ష్మణుల వెంటపడి లేపి బలవంతంగానైనా స్నానం చేయించి సంధ్యావందనం చేయించడం అనేది బాధ్యత. ఇక్కడ రామలక్ష్మణులతో విహిత కర్మాచరణం చేయించి తమ కర్తవ్యపాలనం చేయించే బాధ్యతను విశ్వామిత్రుడు తీసుకున్నాడు అన్నమాట.

మన వాఙ్మయంలో నైనా కర్తవ్యమే కనిపిస్తూంటుంది బాధ్యత కాదు. ప్రతి చోటా చెప్పేది బోధించేది నీకర్తవ్యం నువ్వు చెయ్యి అని మాత్రమే...

కర్తవ్యం బాధ్యత రెంటినీ చూడాలంటే ప్రహ్లాదోపాఖ్యానం తేలిక

ఒక విద్యార్థిగా కర్తవ్య దీక్షతో తన గురువులు చెప్పిన విద్య అంతా నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. అంతకు ముందే నారదుడు ఉపదేశించిన విద్యా నేర్చుకున్నాడు. తన తండ్రి అవైదికమైన , భాగవత, వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి తన పుత్ర ధర్మంగా తన వంతు కర్తవ్యంగా మంచి చెప్పాడు.

హిరణ్యకశిపుడో ఏదోలా చేసి తన కొడుకుని తన దారిలో తెమ్మనిబాధ్యతని కుల గురువులకు అప్పగించాడు. తన కొడుకు తాను కోరుకున్నవిధంగా మారేలాతాను కోరుకున్న ఫలితాన్ని పొందేవరకూఏదో ఒకటి చేయమని ఆజ్ఞాపించాడు. ఇక నరసింహావిర్భావం తరవాత హిరణ్యకశిపు సంహరం జరిగింది. ఆపై తనని తండ్రి అంత బాధపెట్టినా ప్రహ్లాదుడు పుత్రధర్మంగా తన కర్తవ్యాన్ని మరవలేదు.తనకర్తవ్యంగా నారసింహుడితో తన తండ్రికి ఉత్తమలోకం కలిగించమని వేడుకున్నాడు తప్ప ఏదో ఒకటి చేసి నువ్వివ్వాల్సిందే అని పట్టుబట్టలేదు.

No comments:

Post a Comment