Pages

Saturday, September 21, 2013

కర్కోటకస్య .............కలినాశనం! -2

అలా వారు తమ స్థానాలకి వెళ్తుండగా కలి పురుషుడు నలుని పై కోపంతో వెళ్తూ ఎదురుపడ్తాడు. ఇంద్రుడు కలిని ఎందుకు నువ్వు నలుని మీద కోపంతో బయలుదేరావని ప్రశ్నిస్తాడు, అప్పుడు కలినేను దమయంతీ స్వయంవరం గూర్చి తెలుసుకొని ఆశతో వచ్చాను కానీ దమయంతి నలుని మీద అనురాగంతో నన్ను వరించలేదు దేవతలనెవరినీ వరించలేదు కాబట్టి వారికి రాజ్యపరిత్యాగంతోపాటు కష్టాలనూ వియోగ దుఃఖాన్ని కలుగజేస్తానుఅని పలికి ద్వాపరంలోనే నలుని కష్ట పెట్టడానికి ఎదురుచూస్తూంటాడు.

నలుడు అశ్వమేధాది క్రతువులు, జప తప హోమాదులు వివిధ పుణ్యకర్మాదులు ఆచరించడం చూసి అతనిని ఎలా పీడించాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కలి పురుషుడు. అలా చాలా కాలం ఎదురు చూసిన తరవాత, ఒకనాడు మరపును పొంది అశుచియై సంధ్యోపాసన చేసిన నలునియందు కలి తన ప్రభావాన్ని ప్రవేశపెడ్తాడు. పుష్కరుడను వాని దగ్గరుకు బ్రాహ్మణ వేషంతో వెళ్ళి నలునితో జూదమాడి రాజ్యాదులను సమస్తమూ గెలుచుకోమని సలహా చెప్తాడు. పుష్కరునికి సలహాదారుగా ఉంటూ నలుని వద్దకు తీసుకొచ్చి పుష్కరునితో జూదమాడమని నలుని ఆహ్వానిస్తాడు. జూదమాడటానికి ఆహ్వానితుడైన రాజు జూదమాడకపోవడం ధర్మం కాదని జూదమాడ నిశ్చయించిన నలుడు, కలిప్రభావం వల్ల జూదాసక్తుడై కొన్ని నెలల పాటు జూదమాడుతూ ఎంతో ధనం ఎన్నో వస్తువులు ఓడిపోతాడు. విషయాలు తెలుసుకున్న పురోహితులు, పౌరులు, ప్రధానులు దమయంతీ సహితులై వచ్చి వారించినా, కలి ప్రభావితుడైన నలుడు వారందర్నీ వారించి జూద క్రీడ ఆడడం కొనసాగించి సర్వమూ కోల్పోయి భార్యతో సహా అడవులపాలౌతాడు.

రాజ్యంనుండి భార్యతో కలిసి అడవులకి చేరినవాడై ఏమీలేనివాడై తినడానికి ఏమీ లేక నీటినే ఆహారంగా తీసుకొంటూ క్షుద్భాధతో ఇద్దరూ గడుపుతుంటారు. దమయంతీ తో కలిసి అడవిలోతిరుగుతుండగా ఆకలితో ఉన్న తమ ముందు బంగారు రంగు రెక్కలతో ఉన్న పక్షులను చూసి వాటిని పట్టుకో దలచి తన వంటిమీద ఉన్న పట్టుపుట్టాన్ని పక్షులపై విసిరి పట్టుకోబోతాడు. కానీ, పక్షులు మేము నీ వస్త్రాలపహరించడానికి వచ్చామని చెప్పి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. నలుడు వంటిమీద నూలు పోగు కూడా లేకుండా సర్వమూ కోల్పోయి తన భార్య పట్టుచీర చెంగునే కట్టుకుంటాడు. అపుడు ఇద్దరూ ఏకవస్త్ర ధారులై ఒకరి మొహం ఒకరు చూస్తూ బాధపడతారు,  అడవిలోకొంత దూరం వచ్చి నలుడు తన భార్యతో అక్కడనుంచి ఘోరారణ్యం వస్తుందని, అన్నీ పోగొట్టుకున్న తాను తన బాంధవులైన ఇతర రాజుల దగ్గరికి కానీ, మామగారి వద్దకి కానీ రాలేననీ ఏం చేయాలో తెలియడం లేదనీ బాధ పడుతుంటాడు.

No comments:

Post a Comment