Pages

Monday, July 3, 2017

ఇంటి గుమ్మంలో పెట్టిన దీపం

శ్రీ గురుభ్యోనమః
ఆ.వె
గడప దీపమది తెగడు చిమ్మచీకటి
ఇంట-బైటయనెడి యెరవు లేక
ధర్మ నెరవు దెల్ప ధరణి నిలిచె గుర్వు
వాగ్విభవము సుధలవాన గురియ

ఇంటి గుమ్మంలో పెట్టిన దీపం ఇంటిలోపల వస్తువులమీదా, ఇంటి బయట పరిసరాలమీద తన వెలుగులని ప్రసరింపజేసి చీకట్లో ఉన్న మనని ఆయావస్తువులను గుర్తించి మసలుకునే విధంగా మార్గదర్శనం చేస్తుంది.

గురువులు జ్ఞానప్రదీపాలే ఐనా అందులో కొందరు గుమ్మంలో దీపంవంటివారు. తమకు పూర్వం ఉన్న మహానుభావులు, గురువుల మహత్వాన్నీ, తన తరవాతి వారికి మార్గదర్శకత్వాన్నీ ఇచ్చే గురువులు అరుదు. అటువంటి వారిని గురువ్రతులైన వారు సంప్రదాయ దీక్షావిధానాలకతీతంగా గురువులుగా కొలవడం మన ధర్మంలో అనాదిగా పరిపాటి.

తెలుగునాట అవైదికం ప్రబలుతున్న కాలంలో వివిధ కారణాలకి సంప్రదాయ పీఠాధిపతులు కలుగజేసుకోని కారణాన, సనాతన ధర్మ వైభవాన్ని తెలుగునాట తిరిగి చాటడానికి ఒక గొంతు లేచింది. ఊపిరులే చమురై, వ్యక్తిగత కుటుంబగత జీవితాన్ని వత్తిగా మలచి సనాతన వాఙ్మయమనే దీపాన్ని రగల్చి వెలుగుల అమృత వర్షాలను కురిపించింది. చీకట్లను పారద్రోలే దీపానికి మనం ఏమి చేయగలం పుష్పాక్షతలు సమర్పించి నమస్కరించడం తప్ప. ఆ గురువనే దీపాన్ని కీర్తించడమంటే ఎదురుగా అద్దాన్ని ఉంచి ఆ అద్దంలో దీపపు వెలుగులని బంధించాలనుకున్నంత అవివేకం కదూ!

ఓ పదిహేనేళ్లక్రితం కొన్ని సంప్రదాయ కుటుంబాలకు తప్ప అన్యులకు అంతగా తెలియని పూర్వాచార్యుల, ఉపాసకుల, పౌరాణికుల వైభవం కానీ, పండుగల మహత్తు వైభవం కానీ, రామాయణ భారత భాగవత పురాణాది గ్రంథాలలోని సూక్ష్మాలుకానీ, జగద్గురువుల వైభవాలు కానీ, సనాతనమౌ ఆర్ష సంప్రదాయాలు కానీ విరివిగా ప్రచారం పొంది సనాతన ధర్మ వైభవం ఉవ్వెత్తున ఎగయడానికి కారణం ఒక్క గొంతే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన ప్రవచనామృత వెలుగులలో తన ముందు తరాల వారి మహిమాన్వితమైన జీవితాలనూ, తనసమకాలికుల గొప్పతనాన్నీ, తన తరవాతి తరం వారికి మార్గదర్శకత్వాన్నీ ఆర్షప్రోక్తమైన తన మాటల మంత్రాలచే సాధించి చూపినది పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.

వారి పుట్టినరోజును పురస్కరించుకొని వారిని కన్న పుణ్యదంపతులు కీ.శే.బ్రహ్మశ్రీ సుందర శివరావు గారు, శ్రీమతి సుశీలమ్మ గార్లకూ మరొక్కసారి సాంజలిబంధకంగా ప్రణమిల్లుతూ...

సాంజలిబంధకంగా ప్రణమిల్లుతూ...
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
(శంకరకింకర)

02-Jul-2017  హేమలంబ ఆషాడ శుద్ధనవమి రవివారం

2 comments:

  1. కొంచెం ఆలస్యంగానైనా, గురువుగారి దంపతులకి, వారి మాతాపితరులకి ఇవే నా నమస్కారములు.

    ReplyDelete