Pages

Wednesday, March 1, 2017

గురువులలో ఉత్తముడు పౌరాణికుడు

శ్రీ గురుభ్యోనమః

       
పౌరాణికులకు గురుశబ్ద అన్వయము సరికాదు అనీ సరి అనీ జరిగిన ఒకానొక చర్చలో, అది సరియే అని రూఢి పరుస్తూ ప్రచురించిన వ్యాసమిది (దీనిలో గురువునకూ, ఆచార్యునకూ బేధం ఆచార్యుడెందువల్ల అనుసరనీయుడూ, వంటి విషయాలు చర్చించడంలేదు. మన ప్రస్తుత వ్యాసం గురువు ఎన్ని రకాలు ఎవరిని గురువుగా ఎరిగి సంబోధించవచ్చు అని కాన, దీనిని ఆ విషయానికి పరిమితం చేస్తూ..)

       
అసలీ గురువు ఎవరు అంటే మొట్టమొదట ఉండవలసిన లక్షణం శ్రోత్రియో బ్రహ్మనిష్ఠా... అని శాస్త్రం గురువుకి చెప్పిన ఎన్నో నిర్వచనాల్లో ముఖ్య నిర్వచనం. శ్రోత్రియుడే గురువు అవుతాడు అని దీనింబట్టి తెలియవలె. అవైదిక గురువులను ఆధ్యాత్మిక గురువులుగా యెంచుకుంటున్న, సనాతన ధర్మంలో ఒక కొత్త ఆధ్యాత్మమార్గంగా ఒక కల్ట్ గా ఏర్పరచుకుంటున్న ఈ కాలంలో శ్రోత్రియులైన గురువుల సంఖ్య తక్కువ అనే చెప్పవచ్చు. శ్రుతి ఏది చెబుతున్నదో, స్మృతులు దానిననుసరిస్తాయి శృతి స్మృతులేవి చెపుతాయో పురాణేతిహాసాలు దానినే కథారూపమున విశదీకరిస్తాయన్నది సువిదితమే. వైదికమైన తంత్ర గ్రంథములూ, వైదికమైన ఆగమ గ్రంథములూ శ్రుతి స్మృతులకూ పురాణాలకూ మధ్యన ఉండి అనుష్ఠానమున మరింత సమన్వయం చేయిస్తాయి. ఈ విషయం పక్కన బెట్టి గురువులెవరు ఎన్ని రకాలు అని తరచి చూచిన,

       
పూర్వం వేద విద్యను, తదంగములనూ, దాని తో బాటు ఇతర కళలనూ అభ్యసింపచేయడానికి గురుకులంలో "అధ్యాపకులు" గానూ, వారి సహాయకులుగా ఉండేవారు "ఉపాధ్యాయులు"గానూ ఉండేవారు. వీరు కూడా గురువులే. అటులనే ఏ జీవన విధానమువలన విశేష పాండిత్యమూ జ్ఞానమూలేకున్ననూ, పరమ పామరులైననూ, ఆధ్యాత్మ విద్యా బుద్ధులు నేర్పని తల్లిదండ్రులుకూడా శిశువుకు మొట్టమొదటి గురువులగుచున్నారు.

       
అట్లుగాక, గురువులు ముఖ్యముగా ఈ రకములని చెప్పబడినది
సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, వైదిక గురువు. దేశికగురువు, కామ్యక గురువు, కారణ గురువు, విహితోపదేష్ట వీరు గాక నిషిద్ధ గురువు మరియొకరు. నిషిద్ధ గురువుగానీ, బోధక , సూచక, వాచక, కామ్యక, గురువులుగానీ లేదా పైన చెప్పుకుఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకులుగానీ తిన్నగా ఆత్మవిద్యా జ్ఞానాన్ని ఇవ్వరు. దానికి వలసిన పూర్వరంగాన్ని తమ శిష్యుడు లేదా అనుయాయునిలో కల్పిస్తారు. నిషిద్ధ గురువు గురువే ఐననూ ఆత్మోన్నతికి సంబంధించిన విద్యా, దీక్షావిధానమెట్టిదీ కనబడదు. ఐననూ ఆతడూ గురువే అని తెలియనగును.

సరే, మనము వ్యాసపౌర్ణమిని గురుపూజోత్సవము లేదా గురుపూర్ణిమోత్సవము పేర నెరపడం విదితము. ఈ వ్యాస పౌర్ణమినాడు ఎవరిని పూజించుచున్నాము? (ఇప్పుడు కొత్తగా వచ్చిన అవైదిక మత పూజలను పక్కన బెట్టి, సనాతన సంప్రదాయముని విచారించవలె) వ్యాసపౌర్ణమినాడు గురుమండల పూజ నెరపడం సంప్రదాయం. ఈ గురుమండలమున యెవరెవరు ఉన్నారు. అని చూస్తే ఆదిగురువు నుండి మొదలు పెట్టి జగదాచార్యుడైన కృష్ణపంచకము. వ్యాస పంచకము, ఇత్యాదిగా మొదలిడి సూత, శుక, శౌనకాది పౌరాణికులనూ ఆరాధన చేయడం జరుగుతుంది. అన, పౌరాణికులు మనకు తిన్నగా బోధ జేయకున్ననూ గురు స్వరూపములని ఈ సాధన వలన ఎరుగవలె.

       
ఇక రెండు, కలియుగమున గురు పూజ అనిన గురువులలో నుత్తముడు పౌరాణికుడను బ్రహ్మ నుడివిన వాక్య ప్రమాణమును బట్టి, వివిధ దీర్ఘ ఉపాసనా విధుల అంతమున పౌరాణికుని వ్యాసునిగ తలచి గురు పూజ చేయుట యుత్తమ కర్మ. అది వ్యాసుని అనుగ్రహమునకు హేతువని ధనుర్మాసాది వ్రత నియమములయందు తెల్పబడినది. ఈ విధమును సంప్రదాయ పరంపరాగత పీఠాదులు, సంప్రదాయ బ్రహ్మవిద్యా గురు పరంపరలయందుండువారు ఉత్సవములందు కానీ, పైన పేర్కొనిని నైమిత్తిక ఉత్సవాలయందు కానీ పౌరాణికులను గురురూపమున నెంచి పూజ, సత్కారము నెరపుదురు.

       
ఇక మొదలు చెప్పిన శ్రుతి-పురాణ సంబంధమునకు చూచిన, పురాణమును కలుపుకోనిదే వేదవేదాంగ విద్య అసంపూర్ణము అని కూడా ప్రమాణమున్నంజేసి, మన కాలమున, మనకు తారసపడు పౌరాణికులెవరుగానవచ్చురో వారు వ్యాసపీఠమునందున్నప్పుడు స్వయం వ్యాసునిగ నెరుగవలయును, పౌరాణికుడు నిత్యమూ తన హృదయమందు భగవద్లీలావిషేషసంపదను, భగవద్విశేషములనబడు బరువుని మోయుటచే గురువై జనులకు మార్గదర్శకుడగుచున్నాడు. శ్రుతియొక్క మరోరూపమే పురాణమని జగద్విదితము గదా. అందుంజేసి పౌరాణికుడు శ్రోత్రియుడే అగుచున్నాడు. ఇవియన్నిటి విచారణ వలన గురువులలో ఉత్తముడు పౌరాణికుడు అను ఆర్యోక్తియే ఈ నా వ్యాసము ద్వారా మరల సాధించబడెను.

//
గురవస్సంతి లోకే తు జన్మతో గుణతశ్చయే!
తేషామపి చ సర్వేషాం పురాణజ్ఞః పరో గురుః
భవకోటీషు సర్వాసు భూత్వా భూత్వాఽవసీదతామ్!
       లోకములో చాలామంది గురువులు కలరు. వారెల్లరియందు పౌరాణికుఁడుత్తమ గురుడు అతనివలన సకల జనులూ భవకోటి సహస్రములనుండు బాధలు దాటి పునరావృత్తి లేని మోక్షమొందగవచ్చు. (కపింజలసంహిత - బ్రహ్మనారద సంవాదం)//

       
ఈ విషయాన్ని అవగతము చేసికొని తగు రీతిన తెలియవలె. ఈ పై విషయములెవ్వియుని నా స్వకపోలకల్పితములు గావు శాస్త్ర, పురాణ విచారణ సారమని తెలుపుతూ. ఇవ్విషయములు దెలిసిన, గురువులలో స్థాయీ బేధములు దెలిసి ఎవరియొద్ద ఏవిధమున ప్రవర్తించవలెనో దెలిసి మనము వినీతులమై యుండ ప్రపంచమే గురువౌను, అట్లు ఆచరించినవానికి అనంతర కాలమున ఆ మహా ప్రపంచమే లఘువౌను.

స్వస్తి.
-
శంకరకింకర


1 comment:

  1. గురువులగురించి మంచి వ్యాసం, జయ జయ శంకర, హర హర శంకర.

    ReplyDelete