Pages

Monday, February 15, 2016

..దేవాస్తే నర విగ్రహాః!

శ్రీ గురుభ్యోనమః

యే ప్రియాణి భాషయంతి ప్రయచ్ఛంతి సత్కృతిం
శ్రీమంతోఽనింద్య చరితాః దేవాస్తే నర విగ్రహాః

        ఎప్పుడూ ప్రియమైన మంచి మాటలు పల్కుతూ సత్కర్మలు చేస్తూ శ్రీమంతులై అందరిచేత గౌరవింపబడే నడవడి ఉన్నవారు మనుష్యులుగా ఉన్న దేవతలు.

          శ్లోకాన్ని మొన్నీమధ్య ఎవరో అంతర్జాలంలో పంచుకున్నారు. అవును కదా! ఎంత నిజమైన మాట! సుభాషితాలు, నీతి శతకాలు చిన్నప్పటినుండి చదవడం ఎందరికో అలవాటున్నా వాటిల్లో చెప్పిన గుణాలు, లక్షణాలున్న వ్యక్తులను చూడడం అరుదు, లేదా అవి అన్వయం అవబడే మహోన్నత వ్యక్తులు తారసపడడం అరుదు, లేదా అలాంటి లక్షణాలు గుణాలున్న వ్యక్తులను కంటితో చూడవచ్చు అన్న స్పృహ / ఊహ కూడా లేకపోవడం కూడా జరగవచ్చు.

          వాల్మీకి మహర్షి వారు నారద మహర్షిని ప్రస్తుత కాలంలో 16 గుణాలున్న వ్యక్తి ఎవరూ అని అడిగిన ప్రశ్నకు సమాధానమే ఇప్పటి మన శ్రీ రామాయణం. శ్రీ రామాయణంలో రాముడు దేవుడు సీతమ్మ అయోనిజ అనే విషయాలు పక్కన పెట్టి రామాయణాన్ని యథావిధిగా మానవ కథలాగానే చూసినప్పుడు అందులోనే మరెందరో మహాపురుషుల చారిత్రములు మనకి తెలుస్తాయి. ఒక భగీరథుడు, వశిష్ఠుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, స్వామి హనుమ, అగస్త్యుడు ఇలా ఒకరేమిటి ఎందరో దివ్య చారిత్రమున్నవారుకనిపిస్తారు. వీరిలో ఎవరి చారిత్రం, గుణగణాలు చూసినా అందరూ లోకం కోసం తమ తపోశక్తులను ధారపోసినవారే ఉంటారు.

          ఎక్కడో చదివాను, జ్ఞానులు, పండితులు మహనీయలైనవారు లోకహితాన్నే కోరతారు, లోకుల యందు వారికి ప్రేమ, దయ, కరుణ ఎక్కువ, లోకుల్ని దూషించరు, లోకంలో దోషం ఎంచరు, అధర్మంపై తెచ్చిపెట్టుకున్న కోపం తప్ప లోకంపై లోకులపై వారిది అవ్యాజమైన నిర్హేతుకమైన ప్రేమ. వారి హితం కోసం తమ సర్వస్వాన్నీ ధారపోస్తారు... కుటుంబ సౌఖ్యాలు, ఆయుష్షుతో సహా!!!  పైన పేర్కొన్న వారి చరిత్రలు చూస్తే సుస్పష్టం లోకానికి మంచి చేయడం కోసం ప్రమాదాలను, కష్టతరమైన కార్యాలను, కొన్ని సార్లు అపనిందలనూ నెత్తినేసుకోవడమా లేదా నిమ్మకు నీరెత్తినట్లుండడమా అంటే మహోన్నత కీర్తి పొందిన ప్రతి వ్యక్తి మొదటిదాని వేపే మొగ్గారు. వారు పని చేసింది తమ విహిత కర్మాచరణంగానోలోక క్షేమం కోసమో సమాజ హితం కోసమో తప్ప ఇతర స్వార్థ ప్రయోజనాన్నీ ఆశించి కాదు కదా. సమస్త భారత వైదిక వాజ్ఞ్మయంలో అనుసరణీయ చారిత్రము కల వ్యక్తి చరిత్ర చూసినా అదే కనపడుతుంది. అందుకే వారు ప్రాతః స్మరణీయులై మహానుభావులై దేవతల స్థాయి పొందారు.

          ప్రస్తుత కాలంలో ఇటువంటి ప్రశ్నే పునరావృతమైతే పదుగురికీ మేలుకలిగించే వాక్కులు చెప్తూ, వైదిక సత్కర్మలనాచరిస్తూ ఆచరింపచేస్తూ, నిస్వార్థంగా స్వచ్ఛమైన సంకల్పంతో, అతి స్వచ్చమైన సహజమైన చిరునవ్వుతో, తడియైన చూపులతో కర్తవ్యోనుముఖులను చేస్తూ, సనాతన ధర్మ ప్రచారం గావిస్తూ, పురాణేతిహాసాలు, ధర్మ ప్రబోధాలు కొందరికి కావు అందరికీ అని ఊరూరా వాడవాడలా, కురుస్తున్న ఆషాఢ మేఘంలా, తెలుగు తెలుసన్న ప్రతి ఇంటా తన వాగ్ఝరితో సనాతన ధర్మ వైభవ ఢమరుక మోగిస్తున్న కంఠం ఒక్కరిదే... సనాతన ధర్మ ప్రచారం కావిస్తున్న మహనీయులెందరో అందరిలో, సనాతన ధర్మ ప్రచార మాలలో, మేలుమణిపూసా ఒక్కరే... నిస్సందేహం. నిజానికి తెలుగున్నచోటల్లా నడుస్తున్న ఆరున్నర అడుగుల స్ఫురద్రూపమైనసనాతన ధర్మ బావుటావారే అనడంలో సంకోచమూ లేదు.


          మరో విశేషమేమంటే, సంప్రదాయ బేధాలకతీతంగా, సనాతన ధర్మాసక్తులా - వైరులా, అసలు ఆయన గురించి ఇంతకు ముందు తెలుసా తెలీదా... ఇవి అన్నీ పక్కన పెట్టి ఆయన్నోసారి చూడాలండీ అనో, చూసామనో చెప్పుకుని పొంగిపోయేవారూ కోకొల్లలు. ఆయన పేరు వినపడగానే ఏపనిలో ఉన్నా ఠక్కున తలెత్తి చుట్టూ పరికించి ఎవరా పేరు పలికిందని ఆతృతతో చుట్టూపరికించి చూసేవారు కొందరు, వెంటనే ముకుళిత హస్తాలతో లేచి నుంచునే వారు మరికొందరైతే, ఆయన్నే ఆరాధ్యునిగా లోనప్రతిష్టించుకుని నిబ్బరంగా చిరునవ్వుచిందిస్తూ మౌనంగా ఆనందించేవారు ఇంకొందరు. పక్క రాష్ట్రాలవారు ఆయన ప్రవచనాలు వినడానికి వ్యావహారిక తెలుగు నేర్చుకుంటున్నవారున్నారు - అతిశయోక్తికాదురాముణ్ణి చూసినా అంతే కదూ! వీరు-వారు అనేమీ లేదు ఆయన్ని చూడడానికి రాక్షసులూ, వానరులు, జానపదులు, ఆటవికులు, మునులు, నాగరికులు, దేవతలూ అన్న తేడా లేకుండా రాముణ్ణి మోహించారు ఆయనతో ఏదో ఒక అనుబంధం పెట్టుకున్నారు. అలా.. బహుశా అది ఆయన కావించిన రామాయణ ఉపాసనా! ధర్మ నిరతియా! ఏమో... అది  అత్యంత అల్పమైన నా బుద్ధికీమాటలకు అందనిది.

యే ప్రియాణి భాషయంతి ప్రయచ్ఛంతి సత్కృతిం
శ్రీమంతోఽనింద్య చరితాః దేవాస్తే నర విగ్రహాః

        ఎప్పుడూ ప్రియమైన మంచి మాటలు పల్కుతూ సత్కర్మలు చేస్తూ శ్రీమంతులై అందరిచేత గౌరవింపబడే నడవడి ఉన్నవారు మనుష్యులుగా ఉన్న దేవతలు.

శ్రీ మన్మథ నామ శ్రీపంచమి సందర్భంగా శారదా జ్ఞానపుత్రులు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి వినమ్ర నమస్సుమాంజలులతో..


3 comments:

 1. అధరం మధురం వదనం మధురం
  నయనం మధురం హసితం మధురం
  హృదయం మధురం గమనం మధురం
  మధురాధిపతేరఖిలం మధురం

  ReplyDelete
  Replies
  1. మీకు స్వాగతం

   Delete
  2. ప్రతి ఇంటా తన వాగ్ఝరితో సనాతన ధర్మ వైభవ ఢమరుక మోగిస్తున్న కంఠం ఆ ఒక్కరిదే..... _/\_

   Jayamu Jayamu gurudevulaku... Jayamu Jayamu..

   Delete